ఈడీ, సీబీఐ దాడులు చేస్తే బీజేపీపై తిరగబడతరు: తమ్మినేని వీరభద్రం

ఈడీ, సీబీఐ దాడులు చేస్తే బీజేపీపై తిరగబడతరు: తమ్మినేని వీరభద్రం

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే.. సీఎం కేసీఆర్ పట్ల బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మునుగోడు ఎన్నికలతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లక్ష్యం దెబ్బతిందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులతో బీజేపీకి సంబంధం లేదని చెప్పుకుంటూనే.. హైకోర్టు, సుప్రీం కోర్టులకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలతో దాడులు చేస్తే రాష్ట్రంలో కాషాయ పార్టీ పై ప్రజలు తిరగబడతారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై దాడులు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనుకుంటే ప్రజల్లో సానుకూలత పెరుగుతుందని తమ్మినేని వీరభద్రం అన్నారు. 

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించడం మోడీ విధానమని తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి.. మోడీ పర్యటనపై నిరసన తెలియజేశామని గుర్తుచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్‭తో కలిసి పోటీ అనే ప్రతిపాదనపై ఇంకా క్లారిటి లేదని అన్నారు. పొత్తులపై ఎన్నికలు వచ్చినప్పుడే చర్చిస్తున్నామని తమ్మినేని తెలిపారు. అటవీశాఖ అధికారి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలని తమ్మినేని వీరభద్రం అన్నారు.