
ముషీరాబాద్, వెలుగు: పుస్తక పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్న 35వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగిసింది. చివరిరోజు కావడంతో ఎన్టీఆర్ స్టేడియానికి పుస్తక ప్రియులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కళాభారతిలో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్ ముగింపు సభకు చీఫ్‌గెస్ట్‌గా బీజేపీ సీనియర్‌నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ రావు మాట్లాడుతూ నిరంతర సాహిత్య చర్చలతో తాత్విక చింతన పొందవచ్చన్నారు. గవర్నర్‌గా పనిచేసిన కాలంలో భాస్కరాచార్య గ్రంథాలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేశానని తెలిపారు. బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక పిల్లల్లో వచ్చిన మార్పులు చూస్తూంటే ఆందోళన చెందానని, కానీ ఇలాంటి పుస్తక ప్రదర్శనల ద్వారా ఆ భయాలు తొలగిపోయాయని చెప్పారు. నైతిక విలువులు పెంపొందించే విధాంగా విద్యావిధానం సాగాలన్నారు.
జూలూరు గౌరీశంకర్ మాట్లడుతూ.. మనుషుల మధ్య భిన్న వాదనలున్నా పుస్తకం అందరినీ ఏకం చేస్తోందని అన్నారు. పుస్తకాలు చదవడం ద్వారా మనుషుల్లో వివేకం పెరుగుతుందన్నారు. గతంతో పోలిస్తే యువ పాఠకుల సంఖ్య బాగా పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ సోమా భరత్ కుమార్, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఓయూ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ కొండ నాగేశ్వర్, బుక్ఫెయిర్నిర్వాహకులు తదితరలు పాల్గొన్నారు.అంతకు ముందు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో గాంధీ చరఖా ప్రదర్శన జరిగింది.