
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సభ.. పర్యవేక్షణకు 12 కమిటీలు
ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా 29న టీడీపీ 41వ ఆవిర్భా వ దినోత్సవం జరుగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ ప్రతినిధులు పాల్గొననున్న ఈ సభకు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి ఏపీ శాఖతో కలిపి సంయుక్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. సభను పరేడ్ గ్రౌండ్లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. కంటోన్మెంట్ ఎన్నికల కోడ్ కారణంగా అక్కడ సభ నిర్వహణ సాధ్యం కాలేదు. నిజాం కాలేజ్ మైదానం, ఎల్బీ స్టేడియంలో సభ నిర్వహణకు దరఖాస్తు చేసుకున్నా అధికారుల నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించేందుకు కాసాని జ్ఞానేశ్వర్ సమాయత్తం అయ్యారు. సభా నిర్వహణలో ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా 12 కమిటీలను నియమించారు.
అదొక పండుగ లాంటిది
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం అనేది 15వేల మంది పార్టీ ప్రతినిధులు కలిసి జరుపుకుంటున్న పండుగ లాంటిదని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆయన వెంట పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, జ్యోత్స్న, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, తదితరులు ఉన్నారు.