రెండు భాగాలుగా ఆసియా కప్..  4 మ్యాచులు పాక్ లో..  9 మ్యాచులు శ్రీలంకలో

రెండు భాగాలుగా ఆసియా కప్..  4 మ్యాచులు పాక్ లో..  9 మ్యాచులు శ్రీలంకలో

క్రికెట్ అభిమానులకు ఇక పండగే. ఎట్టకేలకు ఆసియా కంప్ 2023 నిర్వహణపై ఉత్కంఠ వీడింది. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన తేదీలను, వేదికలను ఆసియా క్రికెట్ కౌన్సిల్ గురువారం (జూన్ 15న) ప్రకటించింది. ఈసారి ఆసియా కప్‌.. రెండు దేశాల్లోని వేదికల్లో ఆగస్ట్‌ 31 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు జరుగుతుందని ఏషియన్‌ క్రికెట్‌ కౌన్సిల్ (ACC) ప్రకటించింది. భారత్, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, నేపాల్‌తో కూడిన టోర్నీ 18 రోజులపాటు జరగనుంది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్‌లో 13 మ్యాచ్‌లు ఉంటాయి. హైబ్రిడ్‌ మోడల్‌లో టోర్నీ జరుగుతుందని ఏసీసీ వెల్లడించింది. 

పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, మిగిలిన 9 మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఏసీసీ ప్రతినిధులు తెలిపారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌ టోర్నీకి అతిథ్యమిచ్చే అవకాశం పాకిస్తాన్‌కు వచ్చింది. మరోసారి భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఫ్యాన్స్ కు రానుంది. అయితే.. శ్రీలంక వేదికగానే ఇరు జట్ల మ్యాచ్‌ జరగనుంది. 

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ), పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మధ్య మాటల యుద్ధం  కొనసాగడంతో ఆసియా కప్‌ నిర్వహణపై మొదట్లో సందిగ్ధత నెలకొంది. పాకిస్తాన్‌కు తమ జట్టును పంపించేందుకు బీసీసీఐ నిరాకరించడం.. తమ టీమ్‌ కూడా భారత్‌ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనేది లేదని పీసీబీ పేర్కొంది. ఈ క్రమంలోనే తమ దేశంలో కొన్ని, తటస్థ వేదికల్లో కొన్ని మ్యాచ్‌లు నిర్వహించేలా హైబ్రిడ్‌ మోడల్‌ను పాక్‌ ప్రతిపాదించింది.

బీసీసీఐ సహా శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ అందుకు అంగీకరించకపోవడంతో సస్పెన్స్ నెలకొంది. దీంతో ప్రపంచకప్‌లో ఆడేది లేదని పాక్‌ తేల్చి చెప్పింది.ఈ క్రమంలో దాయాదుల పోరు లేకుండా ప్రపంచకప్‌ జరిగితే టోర్నీకి ఆకర్షణ తగ్గుతుందని భావించిన ఐసీసీ రంగంలోకి దిగింది. ఎలాంటి షరతులు లేకుండా పాక్‌ను ఒప్పించింది. అదే క్రమంలో పాక్‌ ప్రతిపాదించిన హైబ్రిడ్‌ మోడల్‌ను ఏసీసీ కూడా అంగీకరించడంతో ఆసియా కప్‌ నిర్వహణకు అడ్డంకులు తొలిగిపోయాయి. భారత్‌ ఆడే మ్యాచ్‌లతోపాటు సూపర్‌ - 4 పోరు శ్రీలంకలో జరుగుతుంది. గతేడాది టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌ విజేతగా శ్రీలంక నిలిచింది.

ఆరు జట్లు రెండు గ్రూప్‌లు విడిపోతాయి. టాప్‌ -2 జట్లు సూపర్ -4కి చేరతాయి. 

భారత్, పాకిస్థాన్‌, నేపాల్ ఒక గ్రూప్‌ కాగా.. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ మరొక గ్రూప్‌.

టాప్‌ -4లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు చేరతాయి. 

సెప్టెంబర్ 17న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.