బెంగాల్​ గవర్నర్​ను కారు దిగనియ్యలె

బెంగాల్​ గవర్నర్​ను కారు దిగనియ్యలె

గో బ్యాక్, నో సీఏఏ, నో ఎన్సార్సీ అంటూ నినాదాలు
జేయూ కాన్వొకేషన్​కు అటెండ్​ కాకుండానే వెనక్కి

కోల్కతాపశ్చిమ బెంగాల్​ గవర్నర్​ జగ్​దీప్​ ధన్​కర్​కు సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్(సీఏఏ) వ్యతిరేక నిరసనల సెగ తగిలింది. కాన్వొకేషన్​ కు అటెండ్ అయ్యేందుకు మంగళవారం జాదవ్​పూర్​ యూనివర్సిటీ(జేయూ)కి వచ్చిన ధన్​కర్​ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. ‘గో బ్యాక్’, ‘నో ఎన్సార్సీ’, ‘నో సీఏఏ’అంటూ నినాదాలు చేస్తూ ఆయన కారును చుట్టుముట్టారు. దీంతో కాన్వొకేషన్​కు అటెండ్​ కాకుండానే గవర్నర్​ వెనుదిరగాల్సి వచ్చింది. నిరసనలతో హోరెత్తుతున్న జేయూకు గవర్నర్​ చేరుకోగానే టీఎంసీ ట్రేడ్​ యూనియన్​ వింగ్​ శిక్షా బంధు సమితి సభ్యులు 50 మంది ఆయన కారును అడ్డగించారు. నల్ల జెండాలు చూపుతూ.. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. దీంతో కారు దిగి కాలి నడకన వెన్యూకు చేరుకునేందుకు గవర్నర్​ ప్రయత్నించారు.

అయినా ఆయనను ఎటూ కదలకుండా అడ్డుకున్నారు. దీంతో వైస్​ చాన్స్​లర్​ సురంజన్​ దాస్​కు ఫోన్​ చేసిన ధన్​కర్.. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆయన వెనుదిరిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వర్సిటీ అడ్మినిస్ట్రేషన్​ ఇక్కడ చేస్తున్నదేమీ లేదని, ఉద్యోగులను కంట్రోల్​ చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వ్యవస్థ ఉండటాన్ని అంగీకరించబోమని, ఇక్కడ అసలు చట్టమనేదే లేదని మండిపడ్డారు. ఇంత తక్కువ మంది విధ్వంసం సృష్టిస్తూ స్టూడెంట్ల జీవితాలతో ఆడుకోవడం తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ఆందోళనలు చేస్తున్న వారు ఎవరూ స్టూడెంట్లు కాదని, అక్కడి సంఘటనలు తనను షాక్​కు గురిచేశాయని చెప్పారు. అయితే గవర్నర్​ ధన్​కర్​ లేకుండానే కాన్వొకేషన్​ ముగిసింది. దీనిపై ట్విటర్​లో ధన్​కర్​ స్పందిస్తూ అసలు వర్సిటీలో చట్టం అనేదే లేదని, వీసీ ఉత్సవ విగ్రహంలా మారారని వరుస ట్వీట్లు చేశారు. సోమవారం కూడా జేయూకు వచ్చిన గవర్నర్​ను స్టూడెంట్లు, నాన్​టీచింగ్​ స్టాఫ్ రెండుసార్లు అడ్డుకున్నారు.