
న్యూఢిల్లీ: ఆన్లైన్ పాఠాల కోసమని పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇస్తే.. వాటిని తప్పుగా వాడుతున్న కొందరు స్టూడెంట్స్ లేనిపోని ఇబ్బందుల్లో పడుతున్నారు. ఘజియాబాద్‌లో అయిదో తరగతి చదువుతున్న ఓ స్టూడెంట్ యూట్యూబ్‌లో హ్యాకింగ్ ట్రిక్స్ నేర్చుకొని తండ్రి మెయిల్‌ను హ్యాక్ చేశాడు. ఆపై రూ. 10 కోట్లు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నాడు. ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మెయిల్ కొన్ని నెలల కింద హ్యాక్ అయింది. హ్యాకర్ అతని పర్సనల్ ఫొటోలు, డేటా యాక్సెస్ చేయడంతోపాటు మెయిల్ పిక్చర్, పాస్వర్డ్ చేంజ్ చేశాడు. ‘రూ. 10 కోట్లు ఇవ్వు.. లేదంటే నీ పర్సనల్ ఫొటోలు, డేటా ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తా’ అంటూ మెయిల్ పంపి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఇటీవల ఫోన్ ద్వారా కూడా వేధించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీ అడ్రెస్‌ను ట్రేస్ చేస్తే బాధితుడి ఇంట్లోనే ఉన్నట్లు తేలింది. ఎవరైనా బయటి వ్యక్తి వచ్చి ఇలా చేస్తున్నాడా అని మొదలు ఆరా తీసిన పోలీసులు.. దీనంతటికీ కారణం బాధితుడి కొడుకే(11)నని నిర్ధారించారు. అయిదో తరగతి చదువుతున్న బాలుడు కొంతకాలంగా యూట్యూబ్‌లో హ్యాకింగ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ వింటున్నాడు. వాటిని బేస్ చేసుకొని తండ్రి మెయిల్ హ్యాక్ చేశాడు.