బడ్జెట్​ ఎలా తయారు చేస్తారంటే.. పలువురి నుంచి అభిప్రాయాల సేకరణ

బడ్జెట్​ ఎలా తయారు చేస్తారంటే.. పలువురి నుంచి అభిప్రాయాల సేకరణ
  • బడ్జెట్​ ఎలా తయారు చేస్తారంటే..
  • పలువురి నుంచి అభిప్రాయాల సేకరణ           
  • వివిధ దశల్లో సంప్రదింపులు

న్యూఢిల్లీ : ప్రతి ఏటా కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్​ మనదేశానికి, ఆర్థిక వ్యవస్థకు దిక్సూచీ వంటిది. దేశంలోని ప్రతి ఒక్కరి జీవితాలపై ఇది ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రభుత్వం బడ్జెట్ ఎందుకు, ఎలా తయారు చేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. 2024 సంవత్సరానికి బడ్జెట్ ఫిబ్రవరి 1, 2024న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రవేశపెడతారు. బడ్జెట్‌‌ను సిద్ధం చేసే ప్రక్రియ,  దానిని ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం. 

సంప్రదింపులు

బడ్జెట్‌‌ను సమర్పించే ముందు  రెవెన్యూ శాఖ, పరిశ్రమల సంఘాలు, వాణిజ్య సంఘాలు, రైతుల సంఘాలు, వర్తక సంఘాలు,  ఆర్థిక వేత్తలతో సహా వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ఆర్థిక మంత్రి చర్చలు జరుపుతారు. రాష్ట్ర  కేంద్ర స్థాయిలలోని మంత్రిత్వ శాఖలు, అలాగే ఎస్​ఐజీలు, రక్షణ దళాలు, బడ్జెట్ తయారీ  ప్రారంభ దశల్లో చురుకుగా పాల్గొంటాయి. ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ విభాగానికి వివరాలను సమర్పిస్తాయి. బడ్జెట్ రూపకల్పనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్,  ఇతర మంత్రిత్వ శాఖలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

బడ్జెట్‌‌లో ప్రజల సహకారం ఎంత?

బడ్జెట్ తయారీ ప్రక్రియ కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ.. వివిధ పరిశ్రమలు, కార్పొరేషన్లతో పాటు  సామాన్యుల నుంచి కూడా సలహాలను కోరుతుంది. ఆయా వర్గాల నుంచి వచ్చిన సూచనలను సమీక్షించిన తర్వాత, అధికారులతో సమావేశం అవుతుంది. ఇదంతా పూర్తయ్యాక బడ్జెట్ డాక్యుమెంటును తయారు చేస్తారు. బడ్జెట్ తయారీ కోసం  సుమారు 100 మంది వ్యక్తుల టీమ్​ పని చేస్తుంది. ఈ వ్యక్తులు బడ్జెట్‌‌ను సమర్పించే వరకు 10 రోజుల నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలోనే ఉండవలసి ఉంటుంది. ఆర్థిక లోటు లక్ష్యాన్ని తగ్గించే చర్యలను కూడా ప్రభుత్వం లెక్కలోకి తీసుకుంటుంది.

బడ్జెట్ బ్లూప్రింట్

రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఖర్చులను అంచనా వేసి అవసరమైన మొత్తాన్ని ఇవ్వాలని సర్క్యులర్‌‌ ద్వారా సంబంధిత శాఖలను కోరుతారు.  మొత్తం కేటాయింపుపై వివిధ శాఖల మధ్య చర్చ జరుగుతుంది. ఏ శాఖకు ఎంత మొత్తంలో నిధులు కేటాయించాలనే దానిపై కూడా సమాలోచనలు జరుగుతాయి. ఆర్థిక శాఖ ఇతర మంత్రిత్వ శాఖలతో సమావేశం నిర్వహించి బ్లూప్రింట్‌‌ను సిద్ధం చేస్తుంది.  అన్ని మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు ఆర్థిక మంత్రిత్వ శాఖతో నిధుల కేటాయింపుపై చర్చిస్తారు.

బడ్జెట్ ఉద్దేశం ఏమిటి?

పన్నుల  ఆదాయం, ప్రభుత్వ రుసుములు, జరిమానాలు, డివిడెండ్లు, ఇచ్చిన అప్పులపై వడ్డీ మొదలైనవి  ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం వనరులు.  ఆదాయ వనరులను పెంచడం ద్వారా వివిధ పథకాలకు నిధులు విడుదల చేయడం బడ్జెట్​ ముఖ్య ఉద్దేశం. దేశ ఆర్థిక వృద్ధి రేటును పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. పేదరికం,  నిరుద్యోగాన్ని తగ్గించడానికి, పౌరుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి వ్యూహాలను అభివృద్ధి చేస్తుంది. రైల్వేలు, విద్యుత్తు, రోడ్లు వంటి రంగాలలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించడం వంటివి బడ్జెట్​ ప్రాధాన్యాలు.