బంగ్లా ఖాళీ చేస్త.. లోక్ సభ సెక్రటేరియెట్​కు రాహుల్ గాంధీ లేఖ  

బంగ్లా ఖాళీ చేస్త.. లోక్ సభ సెక్రటేరియెట్​కు రాహుల్ గాంధీ లేఖ  
  •     ఆ బంగ్లాలో హ్యాపీ మెమొరీస్ ఉన్నాయని వెల్లడి

న్యూఢిల్లీ: తాను ఉంటున్న అధికారిక బంగ్లా ఖాళీ చేస్తానని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ తెలిపారు. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియెట్ కు మంగళవారం ఆయన లేఖ రాశారు. ‘‘12 తుగ్లక్ లేన్​లో నాకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని మీరు రాసిన లెటర్ అందింది. అందుకు కృతజ్ఞతలు. నా హక్కులకు భంగం కలగకుండా, లెటర్​లో మీరు పేర్కొన్న మేరకు బంగ్లాను ఖాళీ చేస్తాను. నేను నాలుగు సార్లు లోక్ సభ సభ్యుడిగా ఎన్నికై ఇదే బంగ్లాలో ఉంటున్నాను.

ఇక్కడ నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి” అని లేఖలో రాహుల్ పేర్కొన్నారు. కాగా, పరువునష్టం దావా కేసులో రాహుల్​కు రెండేండ్ల జైలు శిక్ష పడింది. దీంతో ఎంపీగా ఆయనపై అనర్హత వేటు పడింది. అనర్హతకు గురైన ఎంపీ.. ప్రభుత్వ బంగ్లాలో ఉండేందుకు వీల్లేదని, ఏప్రిల్ 22లోగా బంగ్లా ఖాళీ చేయాలని రాహుల్​కు సోమవారం లోక్ సభ సెక్రటేరియెట్ నోటీసులు ఇచ్చింది. 

కేంద్రంపై ఖర్గే ఫైర్.. 

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. కేంద్రం రాహుల్​ను బెదిరిస్తోందని, అవమానిస్తోందని మండిపడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. రాహుల్​ను బలహీనపర్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ‘‘రాహుల్ తన తల్లి సోనియా గాంధీ దగ్గరికి వెళ్లి ఉంటారు. లేదంటే నా దగ్గరికి వస్తారు. ఆయన కోసం నా ఇంట్లో ఏర్పాట్లు చేస్తాను” అని చెప్పారు. ‘‘ఇది మాకేం కొత్త కాదు. చాలాసార్లు మూడు నాలుగు నెలలు బంగ్లా లేకుండా ఉన్నాం. ఆరు నెలల తర్వాత నేనుంటున్న బంగ్లా నాకు కేటాయించారు. ఇతరులను అవమానించాలని కొంతమంది ఇలా ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఖండిస్తున్నాను” అని అన్నారు. కాగా, కేంద్రంపై ఎంపీ కపిల్ సిబల్ కూడా ఫైర్ అయ్యారు. ‘‘రాహుల్ ను బంగ్లా ఖాళీ చేయమన్నారు. వాళ్లకు మనస్సాక్షి లేకుండా పోయింది. ఇవి చిల్లర రాజకీయాలు’’ అని ట్వీట్ చేశారు.

చట్టాన్ని గౌరవించాల్సిందే: అమెరికా 

రాహుల్ వ్యవహారంపై అమెరికా స్పందించింది. ఈ కేసును తాము గమనిస్తున్నామని తెలిపింది. ‘‘చట్టాన్ని గౌరవించడం, న్యాయ స్వతంత్రత అనేవి ఏ ప్రజాస్వామ్యానికైనా మూలస్తంభాలు. ఇండియా కోర్టుల్లో రాహుల్ గాంధీ కేసును మేం గమనిస్తున్నాం. భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్య విలువలపై భారత ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు నిబద్ధతతో ఉన్నాం. మా రెండు దేశాలకు కీలకమైన ప్రజాస్వామ్య సూత్రాలు, మానవ హక్కుల పరిరక్షణ, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాముఖ్యతను ఎప్పుడూ హైలైట్ చేస్తూనే ఉంటాం” అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ చెప్పారు.