కమల్​నాథ్ బర్త్​డే కేక్​పై దుమారం

కమల్​నాథ్ బర్త్​డే కేక్​పై దుమారం

కమల్​నాథ్ బర్త్​డే కేక్​పై దుమారం
గుడి ఆకారంలో ఉన్న కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న కాంగ్రెస్ లీడర్
ఇది హిందువులను అవమానించడమేనని బీజేపీ ఫైర్

భోపాల్ : మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ లీడర్​ కమల్​నాథ్​ బర్త్​డే వేడుకల్లో కేక్​ కటింగ్​ వివాదాస్పదమైంది. ఆలయం ఆకారంలో ఉన్న కేక్​ కట్​ చేయడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హిందువులను అమానించడమే అని మండిపడ్డారు. కేక్​ కటింగ్ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. మూడు రోజుల పర్యటన కోసం కమల్​నాథ్​ హోంటౌన్​ చింద్వారా వచ్చారు. శుక్రవారం ఆయన బర్త్​డే ఉంది. కాంగ్రెస్​ నేతలు అడ్వాన్స్​గా ఆయన ఇంట్లోనే కేక్​ కట్ చేయించేందుకు ప్లాన్​ చేశారు. ఆలయం ఆకారంలో ఉన్న కేక్ తీసుకొచ్చారు. దానిపై కాషాయం కలర్​ జెండా, హనుమంతుడి ఫొటో పెట్టారు. ఈ కేక్​ను కమల్​నాథ్​ కట్​ చేశారు. దీంతో   సీఎం శివరాజ్​సింగ్​ చౌహాన్​ మండిపడ్డారు. మతపరమైన సింబల్స్​ ఉన్న కేక్​ కట్​ చేసి కమల్​నాథ్.. ప్రజల​ మనోభావాలు దెబ్బతీశారన్నారు.

‘‘కాంగ్రెస్​ లీడర్ల భక్తితో మాకెలాంటి సంబంధం లేదు. ఆ పార్టీలో దొంగ భక్తులు ఉన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని గతంలో కాంగ్రెస్​ వ్యతిరేకించింది. ఆ పార్టీకి కమల్​నాథ్​ నేతృత్వం వహిస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దొంగ భక్తిని ప్రదర్శిస్తున్నారు. తాము కూడా హనుమాన్​ భక్తులం అంటూ చెప్పుకుంటున్నారు. హనుమంతుడి బొమ్మ కేక్​పై పెట్టి.. దాన్ని కట్​ చేయడం అంటే హిందువులను, సనాతన ధర్మాన్ని కించపర్చడమే అవుతుంది”అని శివరాజ్​సింగ్​ చౌహాన్​ విమర్శించారు.