ప్రాణాలు తీసిన పగ..సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓ, ఎండీని హత్యచేసిన మాజీ ఉద్యోగి

ప్రాణాలు తీసిన పగ..సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓ, ఎండీని హత్యచేసిన మాజీ ఉద్యోగి

బెంగళూరు : కర్నాటక రాష్ట్రంలో ఓ కంపెనీ సీఈఓ, ఎండీల జంట హత్యల కేసు సంచలనం రేపుతోంది. జంట హత్యల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇద్దరి హత్య కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురు నిందితులు కూడా గతంలో ఒకే కంపెనీలో పని చేశారు.  ఈ ఘటన అమృతహళ్లి పంపా లేఔట్ లో కలకలం రేపింది.  

ఫణీంద్ర సుబ్రమణ్య, వినుకుమార్ అనే ఇద్దరు వ్యక్తులు..గతేడాది ఏరోనిక్స్ మీడియా ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీకి ఎండీ, సీఈఓలుగా పని చేస్తున్నారు. నిందితుల్లో ఒకడైన శబరీష్ తన పేరును జోకర్ ఫెలిక్స్ గా చెప్పుకునేవాడు. ఇతను గతంలో ఫణీంద్ర సుబ్రమణ్య, వినుకుమార్ కంపెనీలో పని చేశాడు. ఆ తర్వాత బయటకు వెళ్లి.. అదే వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో ఫణీంద్ర సుబ్రమణ్య, వినుకుమార్ తో ఫెలిక్స్ కు విబేధాలు తలెత్తాయి. 

తన వ్యాపారంలో ఫణీంద్ర సుబ్రమణ్య, వినుకుమార్ కలుగజేసుకుంటున్నారని కోపం పెంచుకున్నాడు ఫెలిక్స్. తమ కంపెనీ విషయాల్లో తరచూ జోక్యం చేసుకుంటున్నారని, కస్టమర్లను, ఉద్యోగులను లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారిపై కక్ష పెంచుకున్నాడు శబరీష్. ఎలాగైనా ఇద్దరిని అంతమొందించాలని స్కెచ్ వేశాడు. అనుకున్నదే తడవుగా జులై 11 సాయంత్రం 4 గంటల సమయంలో ఫణీంద్ర, వినుకుమార్ ఆఫీసులోకి చొరబడ్డాడు. ఫణీంద్ర, వినులను కత్తితో పొడిచి తీవ్రంగా గాయపర్చాడు. ఇద్దరు బాధితులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. ఇద్దరిని కత్తితో గాయపర్చిన తర్వాత నిందితుడు ఫెలిక్స్ అక్కడి నుంచి పారిపోయాడు. 

ఈ కేసులో శబరీష్ తో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బుధవారం (జులై 12న ) ముగ్గురు నిందితులైన శబరీష్, వినయ్ రెడ్డి, సంతోష్‌ లను అరెస్ట్ చేశారు. హత్యల వెనుక ఉన్న అసలు కారణాలను లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.