
- సీఎంఆర్ గడువు మళ్లీ పెంచం
- నెలాఖరు వరకు పూర్తి చేయాల్సిందే: రాష్ట్రానికి కేంద్రం అల్టిమేటం
- నిరుడి సీఎంఆర్ ఇంకా 12 లక్షల టన్నులు పెండింగ్
- రోజుకు 50 వేల టన్నులు మిల్లింగ్ చేస్తేనే నెలాఖరు వరకు ఇచ్చే చాన్స్
హైదరాబాద్, వెలుగు : గత రెండు సీజన్ల కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) గడువును కేంద్రం ఈ నెలాఖరు వరకు పెంచింది. అయితే, ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిన నేపథ్యంలో సీఎంఆర్ గడువును మళ్లీ పెంచబోమని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి జైప్రకాశ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే తగినంత గడువు ఇచ్చామని, మళ్లీ ఎక్స్‌టెన్షన్ చేయాలని కోరమనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని జైప్రకాశ్ వర్మ ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.
ప్రతి నెలా కేంద్రం సీఎంఆర్ గడువు పొడిగిస్తూ వస్తున్నా మిల్లర్లు తీవ్ర జాప్యం చేస్తున్నారు. వాస్తవానికి మిల్లర్లు బియ్యం అందించడానికి గత నెలాఖరు వరకే గడువు ఉంది. గత నెల 23న రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ గడువు పెంచాలని కేంద్రానికి లెటర్ రాసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగిస్తూ మరో నెల రోజుల పాటు వెసులుబాటు కల్పించింది. కేంద్రం నిర్ణయంతో నిరుడు (2021–22) రెండు సీజన్‌లకు సంబంధించి 12 లక్షల టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ ఈ నెలాఖరు వరకు ఇవ్వాల్సి ఉంది. అయితే, ఈ నెలలో మిగిలిన 24 రోజుల్లో మిల్లింగ్ చేసి ఇవ్వాలంటే మిల్లర్లు కనీసం రోజుకు యావరేజీగా 50 వేల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంటుందని ఎఫ్‌సీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.
నిరుడు వానకాలం వడ్లు ఇంకా పూర్తికాలే..
2021–22 వానకాలానికి సంబంధించి మిల్లులకు అప్పగించిన 70.21 లక్షల టన్నుల వడ్లను మిల్లింగ్ చేసి 47.04 లక్షల టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. కానీ, ఏడాదిన్నర అయినా ఇప్పటి వరకు 44.41 లక్షల టన్నులు ఇచ్చారు. ఇంకా 2.64 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది.
వానకాలం 89 శాతం ఇవ్వాలి..
2022–23 వానకాలం సీజన్లో ప్రభుత్వం సివిల్ సప్లయ్స్ ద్వారా 65.03 లక్షల టన్నుల వడ్లు సేకరించింది. ఈ ధాన్యం మిల్లింగ్ చేసి 43.57 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ రా రైస్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 11 శాతం మాత్రమే అంటే కేవలం 4.75 లక్షల టన్నులే మిల్లర్లు సీఎంఆర్ ఇచ్చారు. ఇంకా 38.82 లక్షల టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది.
2021–22 యాసంగి మిల్లింగ్ ఇంకా పెండింగే..
సివిల్ సప్లయ్స్ ద్వారా 2021–22 యాసంగిలో సేకరించిన వడ్లు 50.39 లక్షల టన్నులు మిల్లింగ్ చేసి.. 34.07 లక్షల టన్నులు సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు 72.81 శాతం అంటే 24.80 లక్షల టన్నుల బియ్యం మాత్రమే సరఫరా చేసింది. ఇంకా 9.26 లక్షల టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది.