రాష్ట్రానికి 283 బీఎస్ఎన్ఎల్ టవర్లు మంజూరు చేసిన కేంద్రం

రాష్ట్రానికి 283 బీఎస్ఎన్ఎల్ టవర్లు మంజూరు చేసిన కేంద్రం
  • అత్యధికంగా ఆదిలాబాద్ పార్లమెంట్​ స్థానంలో 165 టవర్లు
  • 500 రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ 
  • ఒక్కో టవర్​కు రూ.50 లక్షలు, టెండర్ల ప్రక్రియ పూర్తి

ఆదిలాబాద్, వెలుగు:రాష్ట్రంలో ఇప్పటికీ సెల్​ఫోన్​నెట్ వర్క్ లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లోని చాలామంది ప్రజలు ఏండ్లుగా ఇంటర్నెట్ ప్రపంచానికి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా  కొత్తగా బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలో 283 టవర్లు మంజూరు చేయగా అత్యధికంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 165 బీఎస్ఎన్ఎల్ టవర్లను మంజూరు చేసింది.  90 శాతం టవర్లు రిమోట్ ఏరియాల్లోనే ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టెలికం అడ్వయిజరీ కమిటీ చైర్మన్, ఎంపీ సోయం బాపురావు అధ్యక్షతన మీటింగ్​జరిగింది. బీఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటుకు సంబంధించి సమావేశంలో చర్చించారు. గతంలోనే ఎంపీ సోయం పలుసార్లు కేంద్ర మంత్రులను కలిసి జిల్లాలో సెల్​టవర్ల సమస్యను పలుసార్లు తెలియజేశారు. కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాస్ లు వినలేక స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డ విషయాన్ని వివరించారు. ఇంటర్నెట్ లేని గ్రామాల్లో అప్పట్లో రూ. 14 లక్షలు ఖర్చు చేసి 34 కిలోమీటర్ల పరిధిలో  200 స్తంభాలు వేసి బీఎస్ఎన్ఎల్ కేబుల్ ఏర్పాటు చేసిన విషయాన్ని సోయం తెలియజేశారు. ఎంపీ కృషితో రిమోట్ ఏరియాలకు 4జీ టవర్లు మంజూరు కావడంతో గిరిజన ప్రజల సమస్యలు తీరనున్నాయి. 

ఏడాదిన్నరలో కంప్లీట్​చేసేలా..

ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్ల ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం 500 రోజుల గడువు ఇచ్చింది. రాష్ట్రంలో ఒకేసారి ఈ స్థాయిలో కేంద్రం 4 జీ టవర్లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగిసింది. దాదాపు ఒక్కో టవర్ కు రూ. 50 లక్షలు ఖర్చు చేయనున్నారు. టవర్ల నిర్మాణానికి సంబంధించి స్థల సేకరణ జరుగుతోంది. 165 టవర్లు ఇప్పటివరకు అసలు నెట్ వర్క్ లేని గ్రామాల్లోనే నిర్మించనున్నారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో 54, కొమురం భీం జిల్లాలో 94, నిర్మల్ లో14, మంచిర్యాలలో 4 టవర్లు ఉన్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే  63 టవర్లకు స్థలం కేటాయించారు. టవర్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాల్లో 15 ఫారెస్టు ల్యాండ్స్, 87 రెవెన్యూ ల్యాండ్స్​ఇంకా పెండింగ్ లో ఉన్నాయి.  

రెండు లక్షలకు పైగా కనెక్షన్లు

ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్ఎన్ఎల్ 2జీకి సంబంధించిన 276 టవర్లు, 3 జీకి సంబంధించి 139 టవర్లు, 4 జీ టవర్లు 34 ఉన్నాయి. 2,33,451 మొబైల్ కనెక్షన్లు, 1,695 పోస్ట్ పెయిడ్, 13 కస్టమర్ సర్వీస్ సెంటర్లు, బిజినెస్ కు సంబంధించినవి 535 కనెక్షన్లు ఉన్నాయి. అయితే మారుమూల గిరిజన ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ తో పాటు అసలు ఏ ప్రైవేట్ నెట్ వర్క్ కూడా కనిపించదు. ఇప్పటికీ పింఛన్, రేషన్, స్టూడెంట్ల ఆన్ లైన్ చదువులు.. ఇలా పలు పనుల కోసం ఇంటర్నెట్ సదుపాయం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. 4జీ టవర్ల ఏర్పాటుతో నెట్ వర్క్ సమస్యకు చెక్ పడనుంది. టెండర్ల ప్రక్రియ సైతం పూర్తి కావడంతో త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టవర్లకు గవర్నమెంట్ ల్యాండ్ మాత్రమే సేకరించనున్నారు. రెవెన్యూ, ఫారెస్టు ల్యాండ్ కు సంబంధించి కలెక్టర్ల ద్వారా పర్మిషన్లు తీసుకోనున్నారు.

గిరిజనులకు అందుబాటులోకి 4జీ 

కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రజల కోసం 4జీ సేవలు తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 165 సెల్ టవర్లు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. ఇప్పటికీ చాలా గ్రామాల్లో సెల్ టవర్లు లేవు. ఉన్నవాటిలో కూడా నెట్ వర్క్ సమస్య  కనిపిస్తోంది. కరోనా టైంలో రెండేళ్లు నెట్ వర్క్ లేకపోవడంతో గిరిజన స్టూడెంట్లు ఆన్ లైన్ చదువులకు దూరమయ్యారు. పథకాలు అమలు చేయాలన్నా నెట్ వర్క్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ టవర్ల ఏర్పాటుతో సమస్య పరిష్కారం కానుంది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. 
- సోయం బాపురావు, ఎంపీ, ఆదిలాబాద్