పాలమూరుకు ఏపీ పర్మిషన్ కావాల్నట.!అడుగడుగునా కేంద్రం మోకాలడ్డు

పాలమూరుకు ఏపీ పర్మిషన్ కావాల్నట.!అడుగడుగునా కేంద్రం మోకాలడ్డు
  • ప్రాజెక్టుకు అడుగడుగునా కేంద్రం మోకాలడ్డు
  • నీటి కేటాయింపుల లెక్కలు సరిగ్గా లేవంటూ గతంలో డీపీఆర్​లు వెనక్కు
  • ఇప్పుడు ఏపీ నుంచి అంగీకార పత్రం తీసుకురావాలన్న సీడబ్ల్యూసీ
  • 45 టీఎంసీలపై ట్రిబ్యునల్​లో వాదనలు జరుగుతున్నాయంటూ వాదన
  • అప్పటి వరకు అనుమతులు కష్టమని చెప్పి తిప్పించుకుంటున్న సీడబ్ల్యూసీ

హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్రం అడుగడుగునా మోకాలడ్డేస్తున్నది. నీటి కేటాయింపుల లెక్కలు సరిగ్గా లేవంటూ డీపీఆర్​లను తిప్పిపంపిన కేంద్రం.. లెక్కలపై వివరణాత్మకంగా సర్కారు డీపీఆర్​ను సమర్పిస్తే మరో కొత్త మెలిక పెట్టింది. ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులకు సంబంధించి ఏపీ పర్మిషన్ తీసుకొస్తే అనుమతులు సులభమవుతాయని సర్కారుకు కేంద్రం తెలియజేసినట్టు తెలిసింది. ట్రిబ్యునల్​లో నీటి వాటాలపై వాదనలు జరుగుతున్నందున అప్పటివరకూ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం కష్టమవుతుందని చెప్పినట్టు సమాచారం. బుధవారం మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి.. సెంట్రల్ వాటర్ కమిషన్​ (సీడబ్ల్యూసీ) చైర్మన్ అతుల్ జైన్​తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో భాగంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు, సమ్మక్కసాగర్​కు కేటాయింపులు, ఎన్​డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా మేడిగడ్డపై చర్యలు తదితర అంశాలను చర్చించారు. అయితే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో సీడబ్ల్యూసీ చేతులెత్తేసినట్టు తెలిసింది. గత బీఆర్ఎస్ సర్కారు నిర్వాకం, నిర్లక్ష్యంతో ఇప్పటికే ఆ ప్రాజెక్టు డీపీఆర్​ను కేంద్రం తిప్పి పంపితే.. మళ్లీ డీపీఆర్​లను సీడబ్ల్యూసీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల సమర్పించింది. ఈ నేపథ్యంలోనే ఆ డీపీఆర్​లను పరిశీలించి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని ఇటు మంత్రి, అటు అధికారులు కోరినా.. సీడబ్ల్యూసీ మాత్రం తల అడ్డంగా ఊపినట్టు తెలిసింది. 

ఆ 45 టీఎంసీలపైనే అభ్యంతరమా..

పాలమూరు ప్రాజెక్టుకు మైనర్ ఇరిగేషన్ ద్వారా పొదుపు చేసుకున్న 45.66 టీఎంసీలతో పాటు.. పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలను కేటాయింపులుగా ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు కృష్ణా డెల్టాకు తరలించే నీళ్లలో వాడుకునే 45 టీఎంసీలపైనే కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇందులో ఏపీ కూడా ఉంది కనుక.. ఆ రాష్ట్రం నుంచి అంగీకారపత్రం తీసుకురావాలని సీడబ్ల్యూసీ సూచించినట్టు సమాచారం. ఇటు కృష్ణా ట్రిబ్యునల్​లో గంపగుత్త జలాల కేటాయింపుల్లో వాటాల పంపకంపైనా వాదనలు జరుగుతున్నాయని, అందులోనూ ఈ 45 టీఎంసీల అంశంపై విచారణ జరుగుతున్నదని సీడబ్ల్యూసీ చెప్పినట్టు తెలిసింది. ఈ రెండు అంశాల నేపథ్యంలో పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం కష్టం కావొచ్చని చెప్పినట్టు తెలిసింది.

ఏపీ ఒప్పుకుంటుందా..

కేంద్రం మెలిక పెట్టడంతో ప్రాజెక్టు అనుమతులకు ఏపీ ఒప్పుకుంటుందా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ తరచూ మన ప్రాజెక్టులకు ఎక్కడాలేని అడ్డంకులను సృష్టిస్తున్నది. అందులో భాగంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపైనా అవాకులు చవాకులు పేలుతున్నది. పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దంటూ కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర ప్రభుత్వానికి చాలా సార్లు లేఖలు కూడా రాసింది. అసలు డీపీఆర్​లనే పరిశీలించవద్దంటూ సీడబ్ల్యూసీకి లేఖలు రాయడం గమనార్హం. ఇటు రైతులతో ఎన్జీటీ, సుప్రీంకోర్టుల్లోనూ కేసులు వేయించింది. ఆ తర్వాత ఆయా కేసుల్లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. ప్రస్తుతం వాదనలు జరుగుతున్న బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్​లోనూ పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించిన 90 టీఎంసీలపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ కేటాయింపులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలంటూ ట్రిబ్యునల్​లో మధ్యంతర అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం.