ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నది పిసరంతేనని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ అన్నారు. కొత్తగూడెం క్లబ్​లో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆసరా లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 28,427 మందికి పెన్షన్లు మంజూరయ్యాయని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు లక్షల కుటుంబాలుండగా, 3.27 లక్షల కుటుంబాలకు పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజల మధ్య కొన్ని పార్టీలు చిచ్చు పెడుతున్నాయని విమర్శించారు. ప్రజలకు ఉచితాలు వద్దంటూ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపేయాలని చూస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 46 లక్షల మందికి రూ.11 వేల కోట్ల పెన్షన్లను ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. త్వరలో మెడికల్​కాలేజీని సీఎం కేసీఆర్​ ప్రారంభిస్తారని తెలిపారు. ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు మాట్లాడుతూ ఏపీలో కరెంట్​ సరిగా ఉండడం లేదని అక్కడి వారు తెలంగాణకు వస్తున్నారని అన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య, కలెక్టర్​ అనుదీప్​, అడిషనల్​ కలెక్టర్​ కె. వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్​ కూరాకుల నాగభూషణం, మున్సిపల్​ చైర్​పర్సన్​ కె. సీతాలక్ష్మి, జడ్పీ వైస్​ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్​, గ్రంథాలయ చైర్మన్​ దిండిగాల రాజేందర్, డీఆర్డీవో మధుసూదనరాజు, జడ్పీ సీఈవో విద్యాలత పాల్గొన్నారు. అనంతరం కొత్తగూడెంలో నిర్మిస్తున్న టీఆర్ఎస్ ​బిల్డింగ్​ను ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు పరిశీలించారు. సీఎం కేసీఆర్​ మెడికల్​ కాలేజీతో పాటు టీఆర్ఎస్​ బిల్డింగ్​ను ప్రారంభిస్తారని తెలిపారు. 

‘డబుల్’ఇండ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతా

వేంసూరు: సత్తుపల్లి నియోజకవర్గంలో అర్హులైన వారికి డబుల్​బెడ్రూమ్​ ఇండ్లు ఇచ్చాకే గ్రామాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతానని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు పెన్షన్​ కార్డులు, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్​ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా దుద్దేపూడి గ్రామంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 60 వేల మందికి రైతుబంధు, 40 వేల మందికి పెన్షన్లు, 10 వేల మందికి కల్యాణలక్ష్మి స్కీమ్​ కింద లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ మారోజు సుమలత, టీఆర్ఎస్​ మండల అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి, ఎంపీడీవో వీరేశం, తహసీల్దార్​ ముజాహిద్, సర్పంచులు వేణుగోపాలరెడ్డి, సుహాసిని, రాంబాబు, మౌనిక 
పాల్గొన్నారు. 

అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యం

కారేపల్లి: అన్నివర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్​ అన్నారు. మండలంలోని పాటిమీదిగుంపులో మంగళవారం లబ్ధిదారులకు ఆసరా పెన్షన్​ కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్లు వస్తాయని తెలిపారు. ఎంపీపీ మాలోత్​ శకుంతల, జడ్పీటీసీ వాంకుడోత్​ జగన్, వైస్​ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ఎంపీడీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు. అనంతరం మండలంలోని గాంధీనగరం గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించారు. వంటగది, డార్మెటరీలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని టీచర్లకు సూచించారు. 

పెన్షన్ కార్డుల పంపిణీ రసాభాస

జూలూరుపాడు : మండలంలోని పడమట నర్సాపురం రైతువేదికలో పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, నర్సాపురం ఎంపీటీసీ ఖాజా విజయరాణి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వేదిక మీదకు తనను పిలవకుండా అడ్డుపడ్డారని ఆరోపిస్తూ ఎమ్మెల్యేతో గొడవకు దిగారు. ఇదేమి పద్ధతి అంటూ ఎమ్మెల్యేను నిలదీయడంతో అక్కడ ఉన్నవారు ఆమెను వారించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అక్కడే ఉన్న సీఐతో ఆమెను లాగి బయట పడేయండి అనడంతో గొడవ మరింత పెరిగింది. 

కొత్త పెన్షన్లలో దివ్యాంగులు, వృద్ధులకు అన్యాయం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్త పెన్షన్​ విధానంతో దివ్యాంగులు, వృద్ధులకు అన్యాయం జరిగిందని విభిన్న ప్రతిభావంతుల సంఘం(టీవీపీఎస్)వ్యవస్థాపక అధ్యక్షుడు గుండపనేని సతీశ్​​ఆరోపించారు. కొత్తగూడెంలోని సంఘం ఆఫీస్​లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలని మంత్రి పువ్వాడ అజయ్​కు వినతిపత్రం అందించినట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన దివ్యాంగుల్లో చాలా మందికి పెన్షన్​ రాలేదన్నారు. అనర్హులను పెన్షన్​ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్​ చేశారు. డయాలసిస్​ పేషెంట్లకు ఉచిత బస్​పాస్​లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కాటి నాగేశ్వరరావు, రమేశ్, మల్లేశం, సాయిబాబా, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ఖమ్మం రూరల్, వెలుగు: పాలేరు నియోజకవర్గంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన 45 మంది కుటుంబసభ్యులను ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి సతీమణి విజయమ్మ మంగళవారం ఇంటింటికీ వెళ్లి పరామర్శించారు. మృతుల ఫొటోలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు.  కుటుంబసభ్యులను ఓదార్చి ఒక్కో కుటుంబానికి రూ. 10 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఆమె వెంట టీఆర్ఎస్​ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, సర్పంచులు, ఎంపీటీలు, టీఆర్ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

ఆదివాసీలకు సోలార్ లైట్లు పంపిణీ

ములకలపల్లి, వెలుగు: మండలంలోని కొర్రాజులగుట్ట, సోయం గంగుల నగర్ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న 50 ఆదివాసీ కుటుంబాలకు మంగళవారం చిరాగ్ ఫౌండేషన్ (యూఎస్ఏ) కు చెందిన అల్లూరి పురుషోత్తం, సాకేత్  రూ.లక్ష విలువైన సోలార్ లైట్లను పంపిణీ చేశారు. ప్రతీ కుటుంబానికి మూడు సోలార్ బల్బులతో కూడిన కిట్ అందచేశారు.