కరెంట్ బకాయిల్లో తెలంగాణ టాప్

కరెంట్ బకాయిల్లో తెలంగాణ టాప్

న్యూఢిల్లీ, వెలుగు: కరెంట్ బకాయిల్లో దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉందని కేంద్రం వెల్లడించింది. గతేడాది చివరి నాటికి రూ.11,935 కోట్లు డిస్కంలకు బాకీ పడ్డట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్​కే సింగ్ తెలిపారు. గడిచిన మూడేండ్లలో తెలంగాణ ఏటా బకాయి నిధుల్ని పెంచుకుంటూ పోతోందని వివరించారు. 2020 డిసెంబర్ 31 నాటికి రూ.9,320 కోట్లు ఉండగా, 2021 డిసెంబర్ 31 నాటికి రూ.10,003.3 కోట్లకు పెరిగాయని స్పష్టం చేశారు. ఈమేరకు రాజ్యసభ సభ్యుడు వినయ్ దిను టెండూల్కర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే, దేశంలోని 36 రాష్ట్రాలు/యూటీల్లో రూ.10వేల కోట్లకు పైగా బాకీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని తెలిపారు. అలాగే, చాలా రాష్ట్రాలు ప్రతి యేటా తమ బకాయిలను తగ్గించుకుంటున్నాయని పేర్కొన్నారు. రూ.9,933 కోట్ల బాకీతో జమ్మూ కాశ్మీర్​ (యూటీ) రెండో ప్లేస్​లో నిలిచింది. రూ.9,131 కోట్లతో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉండగా, రూ.9,116 కోట్లతో ఏపీ నాలుగో స్థానంలో ఉందన్నారు.

ఇక దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులోనూ భారీగా విద్యుత్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ రూ.86 కోట్లు, హర్యానా రూ.34 కోట్లు, గుజరాత్ రూ.358కోట్లు, ఒడిశా రూ.384 కోట్ల బాకీ ఉన్నాయని వివరించారు. 2020లో యూపీ బకాయిలు రూ.13,294 కోట్లు ఉండగా, 2021 నాటికి రూ.115 కోట్లకు తగ్గించుకుందన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్, 2021లో స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి (జీఎస్ డీపీ)లో 0.5 శాతం అదనపు రుణాల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతించిందని తెలిపారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 0.5 శాతం వరకు అదనపు రుణాలు తీసుకోవడానికి ఏపీతో పాటు 12 రాష్ట్రాల (మణిపూర్, రాజస్థాన్, ఉత్తర్​ప్రదేశ్, తమిళనాడు, సిక్కిం, మేఘాలయ, ఒడిశా, అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, హిమాచల్) ప్రతిపాదనలు ఆమోదించామని తెలిపారు.