కేంద్ర బడ్జెట్​లో ఉపాధి​పై ఫోకస్​ చేయాలె

కేంద్ర బడ్జెట్​లో ఉపాధి​పై ఫోకస్​ చేయాలె

ఇప్పుడు రాబోయే బడ్జెట్‌‌మేజర్‌‌‌‌గా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను పెంచేలా ఉండాలి. కరోనా క్రైసిస్, లాక్‌‌డౌన్‌‌ టైమ్‌‌లో దేశవ్యాప్తంగా దాదాపు 1.8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాగే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌ వేల సంఖ్యలో మూతపడ్డాయి. దేశ వ్యాప్తంగా వలస కూలీలు ఉపాధి కోల్పోయి తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. వాళ్లందరికీ తిరిగి ఉపాధి అవకాశాలు చూపించాలి. అలాగే కరోనా కారణంగా చైనా నుంచి భారీ స్థాయిలో కంపెనీలు తమ పెట్టుబడులు ఉపసంహరించుకుని, వాటి యూనిట్లను ఇండియాకు తరలిస్తాయని ఊహాగానాలు వచ్చాయి. కానీ అది అనుకున్నంత స్థాయిలో జరగలేదు. అటువంటి కంపెనీలను ఆకర్షించి మన దేశంలో పెట్టేలా చూస్తే భారీగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనికి అవసరమైన రిఫామ్స్‌‌ ఈ బడ్జెట్‌‌లో ఉంటే ఎకానమీతో పాటు సామాన్యులకు కొనుగోలు శక్తి పెరిగి, మార్కెట్‌‌లో డిమాండ్ పెరుగుతుంది.

జీడీపీ గ్రోత్ పెంచడానికి రూట్ మార్చాలి

ఇండియా రెండో వేవ్‌‌ నుంచి సేఫ్‌‌ అయినా.. అమెరికా లాంటి దేశాలు చాలా ఇబ్బందిపడ్డాయి. అయినప్పటికీ సామాన్యుడికి ఏది అవసరమన్నది తెలుసుకుని వర్క్ చేసింది. దాదాపు మూడు లక్షల కోట్ల డాలర్ల (ఇండియన్ కరెన్సీలో సుమారు 220 లక్షల కోట్లు) ప్యాకేజీలను రెండు సార్లు ప్రకటించి, వాటిని ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పంప్ చేసింది. దీని వల్ల ఆ దేశం గ్రోత్ రేట్ తగ్గకుండా చూసుకోగలిగింది. ప్రస్తుతం అమెరికా జీడీపీ 15 శాతం ఉండడంలో ఈ చర్యలే సహకరించాయి. కానీ ఇండియాలో మాత్రం గ్రోత్‌‌ రేట్ భారీగా తగ్గింది. అయితే వ్యాక్సినేషన్ మొదలవడం, కరోనా వైరస్ స్ప్రెడ్‌‌ కూడా కంట్రోల్‌‌లోకి రావడంతో మన ఎకానమీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఈ ఏడాది సెకండ్ ఆఫ్‌‌లో మరింత మెరుగయ్యే చాన్స్ ఉంది. మన దేశంలోనూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫైనాన్సియల్ అసిస్టెన్స్ ప్యాకేజీ ద్వారా కేవలం ఒకటి, రెండు శాతానికి మించి జీడీపీ గ్రోత్ అవడానికి ఉపయోగపడలేదు. ఈ ప్యాకేజీ మరింత బెటర్‌‌‌‌గా ఉపయోగపడి గ్రోత్ మంచిగా రావాలంటే కేంద్రం రూట్ మార్చాలి. కార్పొరేట్లకు టాక్స్‌‌ రద్దు చేస్తే అది ఇన్వెస్ట్‌‌మెంట్ల రూపంలోకి మారి జాబ్ క్రియేషన్‌‌కు ఉపయోగపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి భావించారు. కానీ అలా జరగలేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌‌లో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌ (ఎంఎస్ఎంఈ) రీస్టార్ట్‌‌కు సపోర్ట్‌‌గా ఉండేలా పాలసీ తీసుకుంటే ఎకానమీగ్రోత్‌‌కు ఉపయోగపడుతుంది. ఈ తరహా సంస్థలు భారీ సంఖ్యలో ఉండడంతో ఎక్కువ మందికి ఉపాధి కూడా వస్తుంది.

ఇన్‌‌ఫ్రాపై స్పెండింగ్స్‌‌ పెరగాలి

బడుగు, అట్టడుగు వర్గాలు, ఉపాధి కూలీల వంటి వారి చేతిలోకి నేరుగా డబ్బు వెళ్లేలా చేయడంలో కేంద్రం ఫెయిల్ అయింది. దీనిని ఇప్పుడు రెక్టిఫై చేయాలంటే ఇన్‌‌ఫ్రా రంగంపై స్పెండింగ్‌‌ పెంచేలా బడ్జెట్‌‌లో దృష్టి పెట్టాలి. ఇలా జరిగితే అభివృద్ధితో పాటు ఆయా వర్గాలకు భారీగా ఉపాధి దొరుకుతుంది. పబ్లిక్ స్పెండింగ్ పెంచేలా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా డబ్బు అందించాలి. సామాన్యుల చేతిలో డబ్బు లేకుంటే ఎకానమీ గ్రోత్ అనేది అసాధ్యమని గుర్తించాలి. ఎంఎస్‌‌ఎంఈలు, ఇన్‌‌ఫ్రా రంగాలకు ప్రభుత్వం బ్యాంకుల ఫైనాన్స్ చాలా కీలకం. అయితే బ్యాంకుల ప్రైవేటైజేషన్ జరుగుతుందన్న భయం ఆ రంగాల్లో ఉంది. దీనిని పోగొట్టేలా బడ్జెట్‌‌లో చర్యలు కనిపిస్తే మంచి పాజిటివ్ సైన్ ఇచ్చినట్లే.

టార్గెట్‌‌ రూరల్ ఎకానమీ

మన దేశంలో నేటికీ మెజారిటీ జనాభా గ్రామాల్లోనే బతుకుతున్నారు. అక్కడ ఉండే జనాలు ఫైనాన్షియల్‌‌గా బాగుంటే అన్ని రంగాలను ప్రభావితం చేస్తుంది. పై నుంచి కింది వరకు మార్కెట్‌‌లో రొటేషన్ పెరుగుతుంది. అందుకే రూరల్ ఎకానమీకి బూస్టింగ్ ఇచ్చేలా బడ్జెట్‌‌లో పాలసీలు ఉండాలి. ఈ మేరకు ఇప్పటికే ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచడం మంచి పరిణామం. అయితే రైతు చట్టాలపై నెలకొన్న గందరగోళాన్ని బడ్జెట్ సెషన్‌‌లో క్లియర్ చేసి, రైతుల్లో భరోసా నింపేలా నిర్ణయాలు తీసుకోవాలి. రూరల్ ఎకానమీలో మేజర్‌‌‌‌గా చిన్న వ్యాపారులు, రైతులు టార్గెట్‌‌గా బడ్జెట్ ప్రకటనలు వస్తాయని అంతా ఆశిస్తున్నారు.

వ్యాక్సినేషన్ స్టార్ట్ కావడం ప్లస్

అమెరికా, బ్రిటన్ సహా అనేక దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వచ్చింది. మన దేశాన్ని కూడాసెకండ్ వేవ్ ఇబ్బంది పెడుతుందని నిపుణులు భావించారు. ఇటీవల వచ్చిన యూకే స్ట్రెయిన్‌‌పైనా కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. ఈ స్ట్రెయిన్ కూడా అంతగా ఎఫెక్ట్ చూపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఇప్పటికే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈ రెండు అంశాలు మన దేశ ఎకానమీని ట్రాక్‌‌లో పెట్టేందుకు ప్లస్‌‌ పాయింట్స్‌‌గా చూడొచ్చు. గతంలో ఎన్నడూ చూడనంతగా మైనస్ 23 శాతానికి పడిపోయిన మన ఎకానమీ గ్రోత్‌‌ను పాజిటివ్ రేట్‌‌లోకి తెచ్చేందుకు పరిస్థితి అనుకూలంగా కనిపిస్తున్న టైమ్‌‌లో వస్తున్న బడ్జెట్‌‌ ఇది. దీనిపై అందరికీ భారీ ఎక్స్‌‌పెక్టేషన్స్ ఉన్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌‌ ప్రవేశపెట్టనున్నారు. కరోనా క్రైసిస్, ఎకానమీ స్లో డౌన్ తర్వాత వస్తున్న ఈ బడ్జెట్‌‌పై సామాన్యులతో పాటు అన్ని రంగాల వారికి భారీ ఎక్స్‌‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లను కేంద్రం ఎలా అడ్రస్ చేయబోతోందన్న దానిపై అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎకానమీ మళ్లీ ట్రాక్‌‌లో పడేందుకు కొత్త బడ్జెట్‌‌లో ప్రకటించే విధానాలే కీలకం. ఇప్పటికే ఎకానమీ మెల్లగా పుంజుకుంటోంది. కరోనా కంట్రోల్ అయ్యి, వ్యాక్సిన్ కూడా వచ్చిన నేపథ్యంలో రాబోయే ఆర్థిక సంవత్సరంలో అన్ని రంగాల్లో మంచి గ్రోత్ ఉండేలా పాలసీలతో బడ్జెట్‌‌ తీసుకురావడానికి ఇది కీ టైమ్‌‌ అని చెప్పొచ్చు.

టాక్సుల విషయంలో

బడ్జెట్ అంటే కార్పొరేట్ మొదలు కామన్ మ్యాన్ వరకు అంతా ఎదురు చూసేది టాక్సుల పాలసీ గురించే. అయితే ఈ ఏడాదికి టాక్సులు ఏవీ పెంచకుండా స్టేబుల్‌‌గా ఉండడమే బెటర్. అలా చేస్తేనే ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేయడం సాధ్యం.  కొద్ది మొత్తంలో పెంచినా కూడా స్టాక్ మార్కెట్‌‌లో భారీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. ఇన్వెస్ట్‌‌మెంట్లు పెరగాల్సిన టైమ్‌‌లో ఇది అంత మంచిది కాదు. అలాగే సామాన్యులపైనా టాక్సుల భారం పెంచకుండా, వీలైతే మినహాయింపులు ఇవ్వాలనే అంతా ఆశిస్తున్నారు. మొత్తంగా కరోనా క్రైసిస్ తర్వాత వస్తున్న బడ్జెట్ కావడంతో ఎకానమీకి కిక్ స్టార్ట్‌‌లా ఉండే పాలసీలతో బడ్జెట్ తెచ్చేందుకు కేంద్రానికి ఇదో మంచి అవకాశం.

 – పర్సా వెంకట్,పొలిటికల్ ఎనలిస్ట్