
సేమ్ సెక్స్ పెండ్లిని గుర్తించలేం
వాటికి చట్టబద్ధత కల్పించబోం
సుప్రీంలో కేంద్రం కౌంటర్
ఇది హక్కుల ఉల్లంఘన కిందికి రాదని స్పష్టం
ఇయ్యాల సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ : సేమ్ సెక్స్ మ్యారేజెస్ కు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈమేరకు వాదనలతో సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. పెండ్లి అనేది.. కేవలం ఆడ, మగ మధ్య జరిగే ఘట్టమని తెలిపింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ అనేవి భారత సంస్కృతికి విరుద్ధమైనవని వ్యాఖ్యానించింది. 2018 సంవత్సరంలో రాజ్యాంగంలోని 377 సెక్షన్ ను డీక్రిమినలైజ్ చేయడాన్ని గుర్తుచేస్తూ.. సేమ్ సెక్స్ మ్యారేజెస్‌కు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌కు దాన్ని ప్రాతిపదికగా పరిగణించలేమని కేంద్రం స్పష్టంచేసింది. ప్రస్తుత చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టును కోరింది. సేమ్ సెక్స్ మ్యారేజెస్‌ను గుర్తించకపోవడం అనేది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి రాదని పేర్కొంది. కేంద్రం దాఖలు చేసిన ఈ అఫిడవిట్‌తో పాటు దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై సోమవారం సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ విచారించనుంది.
పర్సనల్‌లా ప్రొవిజన్స్‌కు విఘాతం
సేమ్ సెక్స్ రిలేషన్‌షిప్‌ను.. భార్యాభర్తలు, పిల్లలతో కూడిన భారత కుటుంబ వ్యవస్థతో పోల్చి చూడలేమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ‘ఆడ, మగ మధ్య జరిగే పెండ్లిళ్లను గుర్తించేందుకు హిందూ మ్యారేజ్ యాక్ట్1955, క్రిస్టియన్మ్యారేజ్ యాక్ట్1872, పార్సీ మ్యారేజ్ యాక్ట్ 1936, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954, ఫారిన్ మ్యారేజ్ యాక్ట్ 1969 ఉన్నాయి. వీటికి లోబడే ఆయా వర్గాల పెండ్లిళ్లు జరుగుతుంటాయి” అని తెలిపింది. ‘‘స్త్రీ, పురుషుల వివాహాలను మాత్రమే ప్రభుత్వం గుర్తిస్తుంది. ఇతరత్రా జరిగే పెండ్లిళ్లను గుర్తించలేం. అయితే, ఇదే సమయంలో మిగతా రకమైన సంబంధాలు చట్టవ్యతిరేకమైనవని అనలేం” అని అఫిడవిట్లో పేర్కొంది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ కు చట్టబద్ధత కల్పిస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న పర్సనల్ లా ప్రొవిజన్స్‌కు విఘాతం కలుగుతుందని కేంద్రం తెలిపింది.