రంగంలోకి కేంద్రం..టమాటా ధరలకు చెక్!

రంగంలోకి కేంద్రం..టమాటా ధరలకు చెక్!

రంగంలోకి కేంద్రం..టమాటా ధరలకు చెక్!

టమాటా ధరల నియంత్రణకు కేంద్రం రంగంలోకి దిగింది.  ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి టమాటాను కొనుగోలు చేసి, ధరలు అత్యంత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సేకరించిన టమాటాను ఈ నెల 14 లోపు ఢిల్లీ ఎన్ సీఆర్ లో డిస్కౌంట్  ధరకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించింది.

టమాట ధరలకు కేంద్రం చెక్
ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి పంట కొనుగోలు
రెండు రోజుల్లో ఢిల్లీ ఎన్ సీఆర్ లో అందుబాటులోకి
భవిష్యత్తులో రేట్లు దిగివస్తాయని సర్కారు ప్రకటన

న్యూఢిల్లీ: ఆకాశాన్నంటిన టమాట ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యుడికి ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. టమాట ధరలకు చెక్  పెట్టడానికి చర్యలు తీసుకోనున్నామని కేంద్రం ప్రకటించింది. ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర నుంచి టమాటను కొనుగోలు చేసి, ధరలు అత్యంత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పంపిణీ చేయాలని నేషనల్  అగ్రికల్చర్  కోఆపరేటివ్  మార్కెటింగ్  ఫెడరేషన్, నేషనల్  కోఆపరేటివ్  కన్జ్యూమర్  ఫెడరేషన్ ను వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆదేశించింది. సేకరించిన పంటను ఈ నెల 14 లోపు ఢిల్లీ ఎన్ సీఆర్ లో డిస్కౌంట్  ధరకు అందుబాటులోకి తేవాలని కేంద్రం సూచించింది. పంటను అందుబాటులోకి తెచ్చే సెంటర్లను కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇప్పటికే గుర్తించారు.

గత నెల రోజుల్లో ఎక్కడెక్కడైతే ధరలు భారీగా పెరిగాయో ఆ ప్రాంతాలను గుర్తించారు. అలాగే ఆ ప్రాంతాల్లో టమాట వినియోగ స్థాయిని కూడా పరిశీలించారు. కాగా, దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ టమాట పండిస్తుండగా.. దక్షిణ, పడమర ప్రాంతాల్లో ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు. దేశంలోని మొత్తం ఉత్పత్తిలో ఈ ప్రాంతాల వాటా 60 శాతం. ఈ ప్రాంతాల్లో మిగిలిన ఉత్పత్తిని దేశంలోని ఇతర ప్రాంతాల్లో వినియోగించేందుకు కేంద్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. అలాగే దేశవ్యాప్తంగా ప్రొడక్షన్ సీజన్ కూడా వేర్వేరుగా ఉంటుంది. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు పంట కోసే సీజన్. ఇక జులై, ఆగస్టు, అక్టోబర్, నవంబర్  నెలలు టమాట ఉత్పత్తికి అంత అనుకూలం కావు.

రాష్ట్రాల్లో పంట ఉత్పత్తి మధ్య తేడాల వల్లే రేట్లు పైకి

జులైలో వర్షాకాలం  ప్రారంభం కావడంతో టమాట పంపిణీకి ఎదురవుతున్న సవాళ్లు, రవాణాలో జరుగుతున్న నష్టం వల్ల టమాట రేట్లు పెరిగాయని అధికారులు తెలిపారు. ‘‘రాష్ట్రాల్లోని టమాట పంట వేసే కాలం, పంట కోసే కాలం సైకిల్  వేర్వేరుగా ఉంటున్నది. దీంతో రేట్లు పెరుగుతున్నాయి. దీనికి తోడు ప్రతికూల వాతావరణం వల్ల పంట డ్యామేజ్  కావడం, తాత్కాలిక సప్లై చెయిన్  పంపిణీపై ప్రభావం పడడం వంటి కారణాల వల్ల కూడా టమాట రేట్లు భారీగా పెరుగుతున్నాయి” అని కేంద్ర సర్కారు తెలిపింది. ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాల నుంచి టమాట సరఫరా జరుగుతున్నదని వెల్లడించింది. అలాగే హిమాచల్ ప్రదేశ్, కర్నాటక నుంచి ఢిల్లీకి పంట వస్తున్నదని పేర్కొంది. త్వరలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్  నుంచి కొత్త స్టాక్స్  వచ్చే అవకాశ ఉందని, దీంతో సమీప భవిష్యత్తులో టమాట రేట్లు తగ్గవచ్చని వివరించింది.