ఆసియాలోనే శుభ్రమైన ఊరు

V6 Velugu Posted on Sep 05, 2021

  • ఊరంతా కలిసి మురికిని తరిమేసిన్రు

శుభ్రత అంటే వంటికో, ఇంటికో పరిమితమయ్యేది మాత్రమే కాదు. ఇంటితో పాటు ఇంటి చుట్టుపక్కల వాతావరణం, ఆతర్వాత కాలనీలు అన్నీ శుభ్రంగా ఉండాలి. అప్పుడే అందరికీ హెల్త్​ సొంతం అవుతుంది. అలాగే ఊరికి కూడా మంచి పేరు వస్తుంది. ఊరు అందంగా ఉంటుంది. ఈ ఊళ్లో చిన్నా పెద్ద అంతా కలిసి ప్రతి వీధిని తమ ఇంటిగా అనుకొని చెత్తా చెదారం లేకుండా చేశారు. శుభ్రత విషయంలో కలిసికట్టుగా పని చేసి ఊరికే అందాన్ని తెచ్చారు. ఆసియాలోనే శుభ్రమైన ఊరిగా పేరు తెచ్చారు ఆ ఊరికి. దాని పేరే మేఘాలయలోని మౌలినాంగ్​. 

మౌలినాంగ్​లో ప్రకృతి అందాలు చూడాలంటే రెండు కళ్లు సరిపోవు.  రోజూ ఉదయం నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చేసుకున్నట్టే.. వీధుల్ని శుభ్రం చేస్తారు ఆ ఊరి జనాలు. చిన్నా పెద్దా తేడా లేకుండా పనుల్లో పాలుపంచుకుంటారు. అన్ని ఊళ్లలో ఉన్నట్టే ఈ ఊళ్లో పశువులు ఉన్నాయి. కాకపోతే పశువులు, కోళ్లు పెంచడానికి కొన్ని రూల్స్​ ఉన్నాయి అక్కడ. పొరపాటున వీధుల్లో చెత్తా–చెదారం కనిపిస్తే.. ఎవరో ఒకరు కచ్చితంగా దాన్ని తీసి దగ్గర్లో ఉన్న చెత్తబుట్టలో పారేస్తారు. శుభ్రత విషయంలో ఆ ఊరివాళ్లంతా క్రమశిక్షణ పాటిస్తారు. ఇది ఒకరోజో రెండ్రోజులో కాదు.. రోజూ వాళ్ల దినచర్య. అందుకే ఆ ఊరు అంతా శుభ్రంగా ఉంటుంది. ఆసియాలోనే అత్యంత శుభ్రమైన ఊరిగా పేరు తెచ్చుకుంది. 

మేఘాలయాలోని ఖాశీహిల్స్​ జిల్లాలోని చిన్న మారుమూల గ్రామం మౌలినాంగ్​. రాజధాని షిల్లాంగ్​ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మౌలినాంగ్​లో ప్రతి ఇంటి ఎదురుగా వెదురుతో చేసిన డస్ట్​బిన్లు ఉంటాయి. ఇళ్లు కూడా వెదురుతోనే కట్టుకుంటారు. ఈ ఊరి అందాలను పెంచే విషయంలో వెదురును ఎన్ని రకాలుగానో వాడుకుంటారు అక్కడి వాళ్లు. ముఖ్యంగా గ్రామసభల ద్వారా ఊరి డెవలప్​మెంట్​ కోసం నిర్ణయాలు తీసుకుంటారు. ‘ఇది నా ఇల్లు, నీ ఇల్లు’ అని కాకుండా ప్రతి ఇంటి చుట్టు పక్కల కూడా శుభ్రంగా కనిపించేందుకు తమ వంతు కృషి చేస్తారు. అలాగే ఈ ఊళ్లో అందరికి రాయడం, చదవడం వచ్చు. స్టూడెంట్స్​కు ఫస్ట్​ క్లాస్​ నుంచే శుభ్రత గురించి నేర్పిస్తారు. అందుకే వీధుల్లో చెత్తా– చెదారం కనిపిస్తే చాలు పిల్లలు వెంటనే వాటిని తీసి చెత్తబుట్టలో పడేస్తారు. ఈ ఊరివాళ్లకు వ్యవసాయమే ఆధారం. వరితో పాటు, బిర్యానీ ఆకు, తమలపాకులు, సుగంధ ద్రవ్యాలు వంటి వాణిజ్య పంటలు పండిస్తారు. సంత్ర, బొప్పాయి, పైనాపిల్ పండ్లు సాగు చేస్తారు. షిల్లాంగ్‌‌ మార్కెట్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో వాటిని అమ్ముతారు. ఈ ఊరి చివర్లో 85 అడుగుల ఎత్తులో వెదురు కర్రలతో ఒక టవర్​ కట్టుకున్నారు. ఊరి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూడాలంటే ఈ టవర్ ఎక్కి చూడొచ్చు. మరో విశేషం ఏంటంటే.. ఈ టవర్‌‌పై నిల్చుంటే బంగ్లాదేశ్ కనిపిస్తుంది. మౌలినాంగ్‌‌ లో తొంభై కుటుంబాలు ఉన్నాయి. ఆ ఊరి జనాభా దాదాపు ఐదు వందలు. 

టూరిస్ట్​ ప్లేస్​..
శుభ్రమైన గ్రామంగా ఫేమస్ కావడంతో అక్కడికి టూరిస్టులు చాలా మంది వెళ్తుంటారు. అందుకని అక్కడి వాళ్లు టూరిస్ట్​ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఊళ్లోకి వెళ్లగానే టూరిస్ట్​లకు స్వాగతం పలుకుతారు. టూరిస్ట్​లకు ప్రత్యేక గెస్ట్​ హౌస్​లు ఉన్నాయి. చిన్న బెడ్​రూమ్​లు, చిన్న హాలు, వరండాలు ఉంటాయి అందులో. అవి కూడా పొడవాటి వెదురు కర్రలతో, గడ్డితో చేసినవే. మౌలినాంగ్​కు శివారులో రివాయి అనే ఊరుంది. రివాయిలో చెట్టు ఊడలతో అల్లుకున్న బ్రిడ్జి ( లివింగ్​ రూట్​​ బ్రిడ్జి) ఎంతో ఫేమస్​ . అక్కడ అన్నీ రబ్బరు చెట్లు ఉంటాయి. ఈ చెట్ల ఊడల్నిపేని ఈ బ్రిడ్జిని స్థానికులే తయారుచేశారు. 

ఎలా సాధ్యం?
రోడ్ల మీద చెత్త కనిపిస్తే చాలు చాలామంది ముక్కుమూసుకొని, తలతిప్పుకొని పక్క నుంచి వెళ్తుంటారు. డస్ట్​ బిన్లు ఉన్నా ఎంతమంది వాటిని వాడతారో తెలియదు. కానీ మౌలినాంగ్​లో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా పరిశుభ్రత గురించి జాగ్రత్తలు ఎలా తీసుకోగలుగుతున్నారో తెలుసుకోవడానికి.. వందేళ్ల వెనక్కి వెళ్లాలి. తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అప్పట్లో ఊరి జనానికి వచ్చిన ఆలోచనే ఈ రోజుకూ కొనసాగుతోంది. వందేళ్ల క్రితం వచ్చిన కలరా వల్ల పరిసరాల శుభ్రతను, నీటి శుభ్రతను మౌలినాంగ్​ ప్రజలు గుర్తించారు. అప్పట్లో దేశాన్ని కలరా మహమ్మారి అట్టుడికించింది. దాని వల్ల మౌలినాంగ్​ గ్రామస్తులు కూడా చాలా మంది ఎఫెక్ట్​ అయ్యారు. ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి వాళ్లకు ఎన్నో ఏండ్లు పట్టింది. నీరు, పరిసరాలు శుభ్రంగా ఉంటే కలరాను జయించొచ్చు అని గుర్తించారు. వందేళ్ల క్రితమే ఊరంతా ఏకమై.. శుభ్రత విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. అప్పటి నుంచి కలిసి కట్టుగా చేస్తున్న వారి కృషే ఊరిని అందంగా, శుభ్రంగా చేసింది. ఏసియాలో అత్యంత శుభ్రమైన ఊరుగా మార్చింది. 

Tagged Asia, meghalaya, cleanest town, moulinang, Khasi Hills, Asia cleanest village

Latest Videos

Subscribe Now

More News