ఢిల్లీలో 5 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్​

ఢిల్లీలో 5 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్​

గడ్డకట్టిన కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్

న్యూఢిల్లీ, వెలుగు: ఉత్తర భారతంలో చలి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వారం రోజులుగా చాలా రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణో గ్రతలు నమోదవుతున్నాయి. జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లను మంచు కమ్మేసింది. మంచి నీళ్లు కూడా గడ్డకడుతున్నది. 40 రోజుల ఈ సీజన్లో సరస్సులు, నీటి సరఫరా మార్గాలు గడ్డకట్టుకుపోయాయి. ఈ ఎఫెక్ట్  ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీల్లో కూడా ఉంది. చాలా చోట్ల 3 నుంచి 7 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలో క్రిస్మస్ రోజు రాత్రి ఉష్టోగ్రత 5.3 డిగ్రీలకు పడిపోయింది. 

ఈ సీజన్ లో ఇదే కనిష్ట ఉష్టోగ్రత అని ఐఎండీ అధికారులు వెల్లడించారు. రానున్న వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే చాన్స్​ ఉందని తెలిపారు. డిసెంబర్ 31 దాకా రాత్రి పూట దాదాపు 1 డిగ్రీ, డే టైంలో 5 డిగ్రీలు నమోదవుతాయన్నారు. మరో వైపు ఉదయం పది, పదకొండు దాటినా పొగమంచు వ దిలి పెట్టడం లేదు. దీంతో విజిబులిటీ పడిపోయింది. హర్యానా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ లో రోడ్డు, రైలు ప్రయాణాల్లో ఆలస్యం జరుగుతోంది. చల్లని గాలులతో జనం వణికిపోతున్నారు. 

పగటి సమయం తగ్గింది

శీతాకాలం నేపథ్యంలో ఢిల్లీతోపాటు ఉత్తరాదిన పగటి వాతావరణంలో మార్పులు కన్పిస్తున్నాయి. డిసెంబర్ 20 నుంచి పూర్తిగా పగటి టైం తగ్గింది. ఢిల్లీలో ఉదయం 10 తర్వాత కాస్త ఎండ కన్పిస్తే, మధ్యాహ్నం 3 తర్వాత చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఈ వాతావవరణ చాలా ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. స్వెటర్స్, చేతులకు గ్లౌజ్ లు, చెవులు కప్పేలా టోపీలు ఇలాంటి ప్రొటెక్షన్ లేకుండా బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.