ప్రిలిమ్స్ కటాఫ్ ఎంత?

ప్రిలిమ్స్ కటాఫ్ ఎంత?
  • గ్రూప్1 అభ్యర్థుల్లో ఉత్కంఠ
  • మెయిన్స్ ప్రిపరేషన్​పై అయోమయం 
  • క్వశ్చన్ పేపర్ పోయిన అభ్యర్థుల అవస్థలు 
  • ఇవ్వాల్టి నుంచి ‘కీ’ పై అభ్యంతరాల స్వీకరణ

టీఎస్​పీఎస్సీ గ్రూప్1 ప్రిలిమినరీ ‘కీ’ని రిలీజ్ చేసినా, కటాఫ్ ఎంతో తెలియక అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. వచ్చే మార్కులపై క్లారిటీ వచ్చినా, మెయిన్స్​ ఎంపికపై స్పష్టత రాలేదు. దీంతో మెయిన్స్ కు ప్రిపేర్ కావాలా వద్దా అని సంకోచిస్తున్నారు. 

హైదరాబాద్,వెలుగు : గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో అయోమయం తగ్గడం లేదు. రెండ్రోజుల కింద ప్రిలిమినరీ ‘కీ’ని టీఎస్​పీఎస్సీ రిలీజ్ చేసినా, కటాఫ్ ఎంత ఉంటుందో తెలియక అందరిలో ఉత్కంఠ నెలకొంది. వచ్చే మార్కులపై కొంత క్లారిటీ వచ్చినా, మెయిన్స్​ ఎంపికపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో మెయిన్స్ కు ప్రిపేర్ కావాలా వద్దా అని అభ్యర్థులు సంకోచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 503 గ్రూప్1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగ్గా, 2,85,916 మంది హాజరయ్యారు. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్, కీ ని శనివారం టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో పెట్టింది.

సోమవారం నుంచి నవంబర్ 4 వరకూ అభ్యంతరాలను వెబ్ సైట్​ ద్వారా స్వీకరిస్తామని ప్రకటించింది. అయితే క్వశ్చన్ పేపర్ సెట్ల రూపంలో కాకుండా, సిరీస్ రూపంలో ఇవ్వడంతో ‘కీ’ చూసుకోవడమూ అభ్యర్థులకు పరీక్షగా మారింది. ఒక్కో అభ్యర్థి దాదాపు గంటన్నర నుంచి రెండు గంటల పాటు జవాబులు చూసుకోవడానికి టైమ్​ కేటాయించాల్సి వచ్చింది. మరోపక్క క్వశ్చన్ పేపర్ అందుబాటులో లేని అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్సర్లు ఎలా చూసుకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. మాస్టర్ క్వశ్చన్ పేపర్, కీ ని చూసి... కొన్ని ప్రశ్నలు మాత్రమే వారు ఇచ్చిన ఆన్సర్​ను గుర్తిస్తున్నారు.

మెజారిటీ అభ్యర్థులు తమకు ఎన్ని మార్కులు వస్తాయో ఓ అంచనాకు వచ్చేశారు. కానీ మెయిన్స్ కు క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు రావాలనే దానిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో అభ్యర్థుల్లో డైలమా కొనసాగుతోంది. ఒక్కో కేటగిరీ ఒక్కో కటాఫ్​ఉండే అవకాశముంది. దీంతో తాము క్వాలిఫై లిస్టులో ఉంటామో లేదో అనే సందేహం క్యాండిడేట్లలో నెలకొంది. దీనిప్రభావం ప్రిపరేషన్​పై పడుతోందని అభ్యర్థులు చెప్తున్నారు. 

ఒక్కొక్కరు ఒక్కోరకమైన అంచనా..
ప్రిలిమ్స్​ నుంచి మెయిన్స్​కు ఒక్కో కేటగిరీలో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీంట్లో ఒక్కో కేటగిరీలో ఎన్ని మార్కులు వస్తే , ప్రిలిమ్స్​కు ఎంపిక చేస్తారనే దానిపై ఒక్కొక్కరు ఒక్కో రకమైన అంచనా వేశారు. కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కటాఫ్ పై మార్కుల అంచనా లిస్టులు రిలీజ్ చేశారు. దాని ప్రకారం... రెండు మల్టీజోన్లలోనూ ఓపెన్ కేటగిరీలో 65–70 మార్కులు , ఉమెన్స్ కేటగిరీలో 60–65 మార్కులు వస్తే క్వాలిఫై అయ్యే అవకాశముందని చెప్తున్నారు. బీసీ–బీ, బీసీ–డీ కేటగిరీలో ఇంతే  పోటీ ఉండే అవకాశముందంటున్నారు. ఏది ఏమైనా ఫైనల్ కీ వచ్చి, రిజల్ట్ వచ్చే వరకూ స్పష్టత రాదు.