బీజేపీకి ఫుల్ మెజారిటీ.. కాంగ్రెస్ కు 44 సీట్లు దాటవు : మోడీ

బీజేపీకి ఫుల్ మెజారిటీ.. కాంగ్రెస్ కు 44 సీట్లు దాటవు : మోడీ

లోక్​సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పబోయేది ప్రాంతీయ పార్టీలేనన్న అంచనాలను ప్రధాని నరేంద్ర మోడీ కొట్టిపారేశారు. దేశంలో ఏ ప్రాంతంలోనూ బీజేపీకి దీటుగా ఏ ఒక్క పార్టీ నిలబడలేకపోయిందన్నారు. గతంలో సాధించిన వాటికంటే ఈసారి ఎక్కువ సీట్లతో అధికారాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం హర్యానాలో పర్యటించిన ఆయన, రోహ్​తక్ సభా వేదిక వద్ద ‘ఏఎన్​ఐ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్​, చంద్రబాబు ప్రయత్నాలపై..

బీజేపీకి మెజారిటీ రాకపోవచ్చన్న అంచనాల నేపథ్యంలో టీఆర్ఎస్​ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్​కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారంటూ గత మూడు రోజులుగా జాతీయ మీడియాలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే విషయాన్ని ఉటంకిస్తూ, ‘‘కేంద్ర సర్కారు ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలకం కానున్నట్లు చర్చ జరుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్​, ఏపీ సీఎం చంద్రబాబు లాంటి వారు ఇప్పటికే తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వాటిని మీరెలా చూస్తారు?”అని ఏఎన్​ఐ రిపోర్టర్​ ప్రశ్నించగా, మోడీ చాలా తేలికగా బదులిచ్చారు. ‘‘అంచనాల సంగతి వదిలేద్దాం. జనం ఏమంటున్నారో అదే విందాం. బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతున్నదని ప్రజలు అనుకుంటున్నారు. ఎన్డీఏలోని ఇతర పార్టీలు కూడా మంచి స్కోర్​ సాధిస్తాయంటున్నారు. ఇప్పుడున్న వాటికంటే ఎక్కువ సీట్లతో, ఫుల్​ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం. ఈసారి దేశం నలుమూలల నుంచి మేం సీట్లు గెలవబోతున్నాం. అలాంటప్పుడు (ప్రాంతీయ పార్టీల) మద్దతు అన్న ముచ్చటే ఉండదు”అని చెప్పారు.

ప్లేయర్​ తప్పులకు అంపైర్​ని తిడతారా?

మూడో ఫేజ్​ పోలింగ్​ ముగిసే నాటికే పోల్​ ట్రెండ్స్ వెల్లడయ్యాయన్న మోడీ,  అప్పటి నుంచే ప్రతిపక్షాల్లో వణుకు మొదలైందని, తమ పీఠాలు కూలిపోతున్నాయన్న భయంతోనే వ్యక్తిగత దాడులకు దిగారని ఆక్షేపించారు. ‘‘గడిచిన ఐదేండ్లలో ఎన్డీఏ సర్కార్​ సాధించిన విజయాలను అన్ని సభల్లో చెబుతూనే వస్తున్నా. ఎన్నికల పోరులో విఫలమయ్యామని అర్థమయ్యాక, ప్రతిపక్ష నేతలు నాపై వ్యక్తిగత దాడులకు దిగారు. డిక్షనరీల్లోని అన్ని తిట్లను నాపై వదిలారు.వాళ్లు తిట్టే వంద తిట్లలో 33 శాతం నామీద, మరో 33 శాతం ఈవీఎంలమీద, మిగిలినవన్నీ ఎన్నికల సంఘంపై ప్రయోగించారు. ఈవీఎంలను, ఈసీని తిడుతున్న ప్రతిపక్షాల తీరు, సరిగా ఆటరాని ప్లేయర్లు అంపైర్ ని తిట్టినట్లుగా ఉంది’’అని మోడీ ఎద్దేవా
చేశారు. ఎన్నికల ప్రచారంలో కాం గ్రెస్ అబద్ధా లు, అసత్యాలను ప్రజలు గమనిం చారని, ఆ పార్టీకి ఈసారి 44 సీట్లు కూడా రావని మోడీ జోస్యం చెప్పారు.