కేసీఆర్.. ఏపీ పంచన చేరి రాష్ట్రాన్ని ముంచాలని చూస్తున్నడు: రేవంత్

కేసీఆర్.. ఏపీ పంచన చేరి రాష్ట్రాన్ని ముంచాలని చూస్తున్నడు: రేవంత్
  • మాణిక్కం ఠాగూర్ గోవాకు బదిలీ 
  • సీనియర్ల ఫిర్యాదుతో హైకమాండ్ చర్యలు 
  • హైదరాబాద్​లో పార్టీ కేడర్ కు ట్రైనింగ్.. 
  • హాజరు కాని కొందరు సీనియర్లు   


హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ స్టేట్ ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్​ను గోవాకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన మాణిక్​రావ్​ ఠాక్రేను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు పార్టీ వాట్సాప్​ గ్రూపుల నుంచి మాణిక్కం లెఫ్ట్​ అయ్యారు. ఇన్నాళ్లూ తనకు సహకరించిన వారందరికీ థ్యాంక్స్ అంటూ మెసేజ్ పెట్టారు. దీంతో బాధ్యతల నుంచి ఆయనే తప్పుకున్నారా? లేక హైకమాండ్ తప్పించిందా? అనే చర్చ జరిగింది.

 ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయనను బదిలీ చేస్తూ హైకమాండ్ ఆదేశాలు ఇచ్చింది. మాణిక్కం ఠాగూర్​పై రాష్ట్ర సీనియర్​ నేతలు ముందు నుంచీ గుర్రుగానే ఉన్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్​ సింగ్​కు ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో మాణిక్కంపై హైకమాండ్​కు దిగ్విజయ్ రిపోర్టు ఇచ్చారని, దాని ఆధారంగానే చర్యలు తీసుకుందని పార్టీ నేతలు అంటున్నారు. కాగా, మహారాష్ట్రకు చెందిన మాణిక్​రావ్​ ఠాక్రే 1985 నుంచి 2004 వరకు నాలుగు సార్లు  ఎమ్మెల్యేగా గెలిచారు. 2008 నుంచి 2015 వరకు పీసీసీ చీఫ్​గా పని చేశారు. 2009 నుంచి 2018 మధ్య ఎమ్మెల్సీగా ఉన్నారు.  

కేసీఆర్.. ఆస్తుల విభజనపై నీ వైఖరేంటి?: రేవంత్ 

2003లో తెలంగాణ ప్రజలు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నారో.. ఇప్పుడు 2023లోనూ అలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారని పీసీసీ చీఫ్​రేవంత్ అన్నారు. ఈ పరిస్థితుల నుంచి ప్రజలను గట్టేక్కించేది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. పార్టీ నేతలందరూ కష్టపడి పని చేస్తే కేసీఆర్ ఒక లెక్క కాదని.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బండ్లతోని, గుండ్లతోని ఒరిగేదేమీ లేదన్నారు. ఓటరు లిస్టు నుంచి కాంగ్రెస్​ సానుభూతిపరుల పేర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్ లో లోపాలు, హాత్​సే హాత్​జోడో అభియాన్, ఎన్నికల రూల్స్, ఇన్సూరెన్స్, మీడియా, సోషల్​ మీడి యా తదితర అంశాలపై బుధవారం హైదరాబాద్ బోయిన్​పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్ లో పార్టీ కేడర్ కు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. కేసీఆర్ ఏపీ పంచన చేరి తెలంగాణను ముంచాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. 

‘‘కేసీఆర్.. పోలవరంపై మీ నిర్ణయమేంటి? పోతిరెడ్డిపాడుపై తెలంగాణ వైపు ఉంటారా? రాయలసీమ వైపు ఉంటారా? గోదావరి, కృష్ణా వివాదాలపై ఆ గట్టునుంటారా? ఈ గట్టునుంటారా?” అని ప్రశ్నించారు. ఆస్తుల విభజనపై కేసీఆర్ స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎస్, డీజీపీలుగా బీహార్ వాళ్లను నియమించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మీడియా అనే పదానికి అర్థం మారిందని.. కొన్ని మీడియా సంస్థలు సర్కార్ కు అనుబంధ సంస్థలుగా మారాయని ఆరోపించారు. హాత్ సే హాత్​ జోడో అభియాన్​లో భాగంగా ప్రతి గడపకూ రాహుల్ మెసేజ్ తీసుకెళ్లాలన్నారు.  

కలిసి పనిచేస్తే మనదే అధికారం: గిరీశ్ ఛాడొంకర్​

అందరూ కలిసి పనిచేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్​దే అధికారమని హాత్​సే హాత్ జోడో అభియాన్​రాష్ట్ర పరిశీలకుడు గిరీశ్​ఛాడొంకర్​ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ జోడో యాత్ర స్ఫూర్తిగా యాత్రలు చేయాలన్నారు. ప్రతి బ్లాక్​లోనూ కాంగ్రెస్​ జెండాను ఎగరేసి పాదయాత్రలు ప్రారంభించాలని చెప్పారు. హాత్ సే హాత్ జోడో అభియాన్​ను ఎన్నికల ప్రచారంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. 8న జిల్లా, మండల, బూత్​స్థాయిలో సన్నాహక సమావేశాలు, 10న బ్లాక్ అధ్యక్షుల మీటింగ్స్ నిర్వహించాలని సూచించారు. 

ధరణితో రైతులు నష్టపోతున్నరు: భట్టి

ధరణి పోర్టల్​తో రెవెన్యూ వ్యవస్థకే ప్రమాదం ఏర్పడిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ధరణితో రాష్ట్రంలోని రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణిపై అసెంబ్లీలోనే ప్రభుత్వాన్ని నిలదీశామని గుర్తు చేశారు. హాత్ సే హాత్​జోడో అభియాన్​ను ఆటంకాలు లేకుండా నడిపించాలని జానారెడ్డి సూచించారు. చేతులే కాకుండా నేతల మనసులూ కలవాలని, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని కోరారు. ఎన్ని కష్టాలెదురైనా పార్టీకి మునుపటి వైభవాన్ని తీసుకురావాలన్నారు. పార్టీలో పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను జానారెడ్డి తీసుకోవాలని ఏఐసీసీ సభ్యుడు సంపత్​కుమార్ విజ్ఞప్తి చేశారు. అధికారం, మోసమే సీఎం కేసీఆర్ ఆలోచన అని ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం చేసే తప్పులకు సామాన్యులు బలవుతున్నారని అన్నారు. లిక్కర్ ఆదాయం మీదనే రాష్ట్ర సర్కార్ నడుస్తున్నదని ప్రచార కమిటీ చైర్మన్​మధుయాష్కీ అన్నారు. కేసీఆర్ అవినీతిపై యువత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు.  

కొందరు సీనియర్లు డుమ్మా.. 

ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు కొంతమంది సీనియర్లు డుమ్మా కొట్టారు. మూడు రోజుల క్రితం పార్టీ సీనియర్లకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫోన్​చేసి కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ సెక్రటరీ బోసు రాజు కూడా పార్టీ నేతలతో మాట్లాడారు. దీంతో భట్టి, జీవన్​రెడ్డి వంటి అసంతృప్త నేతలు శిక్షణ కార్యక్రమానికి వచ్చారు. కానీ దామోదర రాజనర్సింహ, మహేశ్వర్​రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఢిల్లీలో పార్లమెంటరీ డిఫెన్స్ కమిటీ మీటింగ్​ఉండడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాహుల్ యాత్రకు వెళ్లడంతో ఎమ్మెల్యే సీతక్క హాజరుకాలేక పోయారు. కాగా, కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ బోసు రాజు, కోదండరెడ్డి, అన్వేష్​రెడ్డి, అంజన్​ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.