తాళాలు పగలగొట్టి..  గృహప్రవేశాలు

తాళాలు పగలగొట్టి..  గృహప్రవేశాలు
  • మల్యాలలో ఇండ్లు పూర్తయినా కేటాయించని ఆఫీసర్లు 
  • ఏడాదైనా పంచకపోవడంతో లబ్దిదారుల ఆగ్రహం 

మల్యాల,వెలుగు: డబుల్​ బెడ్​ రూమ్​ ఇండ్ల నిర్మాణం పూర్తయినా లబ్దిదారులకు కేటాయించలేదు. దీంతో   ఆగ్రహం చెందిన లబ్దిదారులు  ఇండ్లకు వేసిన తాళాలను పగలగొట్టి గృహప్రవేశాలు చేశారు. జగిత్యాల జిల్లా  మల్యాల మండలం నూకపల్లి శివారులో రామన్న పేట, పోతారం, నూకపల్లి గ్రామాల పేదలకోసం 65 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించారు. గతంలోనే లబ్దిదారుల ఎంపిక పూర్తయినా వారికి కేటాయించలేదు. ఇండ్ల కోసం అధికారులు, నాయకుల చుట్టూతిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో ఓపిక నశించిన లబ్దిదారులు శుక్రవారం తాళాలు పగుల గొట్టి ఇండ్లలోకి ప్రవేశించారు. ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి..  రెవెన్యూ వాళ్లకు  అప్పచెప్పామని, కేటాయింపులతో తమకు  సంబంధం లేదని హౌజింగ్​డీఈ మనోహర్ తెలిపారు. అయితే తమకు ఇండ్లను అప్పగించలేదని తహసీల్దార్ సుజాత చెప్తున్నారు. దీంతో ఇండ్లు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తెలియని అయోమయం నెలకొంది. అధికారులు అక్కడికి చేరుకుని కేటాయింపులు జరిగే దాకా ఇండ్లను ఖాళీ చేయాలని కోరగా.. లబ్దిదారులు నిరాకరించారు. ఇండ్లను శుభ్రం చేసుకుని అక్కడే ఉన్నారు.  దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.