ఆర్థిక వ్యవస్థలపై కోలుకోలేని దెబ్బ

ఆర్థిక వ్యవస్థలపై కోలుకోలేని దెబ్బ

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాదాపు 5.5 శాతం కుచించుకుపోయింది. చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, అప్పుల పెరుగుదల వంటి దుష్ప్రభావాలు వెలుగు చూశాయి. యూరోపియన్ యూనియన్, చైనా, అమెరికా లాంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు కూడా కరోనా వల్ల ప్రభావితమయ్యాయి. ఈ ఏడాది సుమారు 207 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోవచ్చని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ ఔట్​లుక్ పేర్కొంది. కరోనా నుంచి తేరుకొని ఇప్పుడిప్పుడే వృద్ధి రేటులో పూర్వ స్థితికి చేరుకుంటున్న ఆర్థిక వ్యవస్థలపై రష్యా– ఉక్రెయిన్​ యుద్ధ పిడుగు పడింది. దీంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై దెబ్బ మీద దెబ్బ పడినట్లు అయింది.

ప్రపంచ చమురు ఉత్పత్తిలో అమెరికా, సౌదీ అరేబియాల తర్వాత మూడో అతిపెద్ద ఉత్పత్తిదారైన రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షల ప్రభావం చాలా దేశాలపై పడింది. ఆంక్షలకు పూర్వం రోజుకు దాదాపు 8 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తితో ప్రపంచ చమురు సరఫరాలో రష్యా భాగస్వామ్యం14 శాతం ఉండేది. ఆంక్షల తర్వాత ఈ చమురు బహిరంగ మార్కెట్ లో అందుబాటులో లేకపోవడంతో ఆ మేరకు సరఫరాలో కొరత ఏర్పడింది. డిమాండ్ కు తగ్గట్లు ఉత్పత్తి, సరఫరా లేకపోవడంతో చమురు ధరలు ఆకాశాన్నంటాయి. యుద్ధానికి పూర్వం జనవరి 3న బ్యారెల్ కు సుమారు78 అమెరికా డాలర్లుగా ఉన్న ఈ ధరలు యుద్ధం మొదలైన రెండు వారాల తర్వాత మార్చి 7న సుమారు135 డాలర్లకు ఎగబాకాయి. అప్పటి నుంచి కాస్త అటు ఇటుగా110 డాలర్ల వద్ద తచ్చాడుతున్నాయి. నిరుడు ఇదే కాలానికి చమురు ధర 65 డాలర్ల వరకు ఉండేది. ఇప్పుడు దాదాపు రెండింతలైన ధరల వల్ల ప్రపంచ ద్రవ్యోల్బణం జనవరిలో 6.4 శాతం నుంచి ఏప్రిల్ చివరి నాటికి 9.6 శాతానికి పెరిగింది. ఇది 2017 జనవరి నుంచి 2021 జులై వరకు సగటున1.5 శాతం ఉన్న విషయం గమనిస్తే పెరుగుదల తీవ్రత అర్థం అవుతుంది.

 పేద దేశాలపై తీవ్ర ప్రభావం

ఫిబ్రవరి రెండో వారంలో విడుదలైన యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్​మెంట్ నివేదిక ప్రకారం 2021 చివరి నాటికి కరోనా పూర్వస్థితికి చేరుకున్న అంతర్జాతీయ వాణిజ్యం.. 2022 మొదటి మూడు నెలల్లో 13 శాతానికి పైగా వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది. ఏప్రిల్ రెండో వారంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వెలువరించిన గణాంకాల ప్రకారం రష్యా– ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్రంగా పడటమే కాకుండా, ఆహారం, చమురు, వ్యవసాయ ఉత్పత్తులను పెంచే ఎరువుల వంటి వాటిపై పడింది. ఆ రెండు దేశాలు కలిపి ఎగుమతి చేసే గోధుమలు అంతర్జాతీయ మార్కెట్ లో 29 శాతం, టర్కీ, చైనా, ఇండియాలు దిగుమతి చేసుకొనే సన్ ఫ్లవర్ ఆయిల్ లో వరుసగా 25.9 శాతం, 23 శాతం,13 శాతం ఉంటాయి. యుద్ధం వల్ల ఈ ఎగుమతులు నిలిచిపోవడంతో కొరత ఏర్పడి వాటి ధరలు పెరిగాయి. దీంతో అల్పాదాయ, పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. 

పడిపోతున్న వృద్ధి రేటు

చైనాలో కరోనా కొత్త వేరియంట్​వల్ల విధించిన లాక్​డౌన్..​ ఆ దేశం నుంచి ఎగుమతయ్యే ముడి సరుకుల ఎగుమతులను నిలిపివేశాయి. దాంతో ముడి సరుకులకు తీవ్ర కొరత ఏర్పడి పారిశ్రామిక ఉత్పత్తులకు విఘాతం కలుగుతోంది. దీనివల్ల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమన పరిస్థితులు ఏర్పడబోవచ్చని ప్రపంచ వాణిజ్య సంస్థ అంచనా వేసింది. పెరుగుతున్న ధరలు ప్రజలకు భారం కాకుండా ఉండటానికి దేశాలు సబ్సిడీలు పెంచవచ్చని, అయితే ఆ ప్రభావం మౌలికవసతుల లాంటి అభివృద్ధి పనులపై పడే అవకాశం ఉందని ఐఎంఎఫ్​ ఏప్రిల్ లో విడుదల చేసిన గ్లోబల్ ఫైనాన్షియల్ డెవలప్​మెంట్ రిపోర్ట్ లో అభిప్రాయపడింది. జాన్స్ హేండెర్సన్ అసెట్ మేనేజ్​మెంట్ ఫర్మ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది అంతర్జాతీయ అప్పులు దాదాపు10 శాతం పెరిగి 71.6 ట్రిలియన్ డాలర్లకు చేరాయి.

సంక్షోభం దిశగా పలు దేశాలు..

 ప్రపంచంలో చాలా దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఈ అప్పుల్లో సుమారు 650 బిలియన్ డాలర్లతో సింహభాగం చైనావే. శ్రీలంకలో ఏర్పడిన గడ్డు పరిస్థితులు ఆఫ్గనిస్తాన్, నేపాల్, వెనిజులా, ఇరాక్, సిరియా, యెమెన్, లెబనాన్, పాకిస్తాన్ లలో కూడా ఏర్పడే అవకాశముందని ఆయా దేశాల ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తే అర్థమవుతుంది. రష్యా మరింత దీర్ఘ కాల యుద్ధానికి సిద్ధమవుతోందని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. 

193 మిలియన్ల మందికి ఆహార కొరత

యునైటెడ్ నేషన్స్ ఏప్రిల్ లో ప్రచురించిన ‘ప్రపంచ ఆహార భద్రతపై ఉక్రెయిన్ – రష్యా యుద్ధ ప్రభావం’ రిపోర్ట్ ప్రకారం ఉక్రెయిన్, రష్యా దేశాల నుంచి దిగుమతయ్యే ఆహార ధాన్యాలపై ఆధారపడిన ఆఫ్రికా దేశాల ప్రజలు ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో వంట నూనెలు ధరలు 42 శాతం, గోధుమల ధరలు 39 శాతం పెరిగాయి. అదే నెలలో ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రచురించిన గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ ప్రకారం 53 దేశాలకు చెందిన సుమారు193 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు కరోనా సృష్టించిన పరిస్థితులు, మరో వైపు రష్యా –ఉక్రెయిన్ యుద్ధమే అందుకు ముఖ్య కారణం. పెరుగుతున్న ధరలను భరించలేక ప్రజలు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నారని ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం, ప్రపంచ వాణిజ్య సంస్థలు ఏప్రిల్ 21న విడుదల చేసిన ఓ సంయుక్త ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశాయి. 
- డా. గద్దె ఓంప్రసాద్
అసిస్టెంట్​ ప్రొఫెసర్, 
సెంట్రల్​ వర్సిటీ, సిక్కిం