ప్రపంచం అంతటా  కరోనా తగ్గుతోంది

ప్రపంచం అంతటా  కరోనా తగ్గుతోంది
  • గత వారం 36 లక్షల కేసులే.. అంతకుముందు వారం 40 లక్షలు
  • 2 నెలల తర్వాత ఇంత తక్కువ నమోదు: డబ్ల్యూహెచ్​వో..7% మరణాలు తగ్గాయని వెల్లడి

జెనీవా/ఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్( డబ్ల్యూహెచ్​వో) వెల్లడించింది. పోయిన వారం 36 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపింది. అంతకుముందు వారం 40 లక్షలు రికార్డయ్యాయని చెప్పింది. రెండు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు తగ్గాయంది. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన వీక్లీ రిపోర్టులో పేర్కొంది. అత్యధికంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో 22%, సౌత్ ఈస్ట్ ఏసియాలో 16%  కేసులు తగ్గాయని డబ్ల్యూహెచ్ వో పేర్కొంది. అమెరికా, ఇండియా, బ్రిటన్, టర్కీ, ఫిలిప్పీన్స్ లలో కేసులు ఎక్కువ నమోదవుతున్నాయని తెలిపింది. 185 దేశాల్లో డెల్టా వేరియంట్ ఉందని చెప్పింది. కాగా, పోయిన వారం 60 వేల కరోనా డెత్స్ నమోదయ్యాయని.. అంతకుముందు వారంతో పోలిస్తే కరోనా మరణాలు 7% తగ్గాయని పేర్కొంది. సౌత్ ఈస్ట్ ఏసియాలో 30% మరణాలు తగ్గగా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో మాత్రం 7% పెరిగాయని వివరించింది. 
ఇండియాకు థ్యాంక్స్: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ 
మన దేశ హెల్త్ మినిస్టర్ మన్​సుఖ్ మాండవీయకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనామ్ థ్యాంక్స్ చెప్పారు. అక్టోబర్ నుంచి ‘కొవాక్స్’ కరోనా టీకాలు సప్లై చేస్తామని ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరి కల్లా అన్ని దేశాల్లో 40% వ్యాక్సినేషన్ టార్గెట్ ను చేరుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ట్వీట్ చేశారు.

దేశంలో కొత్త కేసులు 27 వేలు
దేశంలో కొత్తగా 26,964 కరోనా కేసులు నమోదయ్యాయని, దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.35 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. వైరస్ తో మరో 383 మంది చనిపోయారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,45,768కి పెరిగిందని తెలిపింది. 6 నెలల తర్వాత యాక్టివ్ కేసులు 3 లక్షలకు తగ్గాయని చెప్పింది. డైలీ పాజిటివిటీ రేటు 1.69 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 2.08 శాతంగా, రికవరీ రేటు 97.77 శాతంగా, డెత్ రేటు 1.33 శాతంగా నమోదైందని వివరించింది. మంగళవారం 15,92,395 టెస్టులు చేయగా.. మొత్తం టెస్టుల సంఖ్య 55.67 కోట్లకు 
చేరిందని పేర్కొంది.