చిరిగిన, రంగు మారిన నోట్లు ఆర్​బీఐకి

చిరిగిన, రంగు మారిన నోట్లు ఆర్​బీఐకి

వరంగల్‍, వెలుగు:  మేడారం మహా జాతర హుండీల లెక్కింపు అంటే పెద్ద టాస్క్.. అంతేకాదు.. వనదేవతలకు భక్తులు మొక్కులుగా చెల్లించుకున్న ఒడిబియ్యం, బెల్లం..  పసుపుకుంకుమ అంటి, చిరిగిపోయిన నోట్లను .. చిల్లరను ఏం చేస్తారు..  హుండీ ఆదాయంలో పూజరుల వాటా ఎంత.. .. అన్న విషయాలు కూడా అసక్తి రేకెత్తిస్తాయి. జాతరలో ఏర్పాటు చేసిన 500  హుండీల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ఆలయ ఈవో రాజేంద్రం ఈ అంశాల గురించి ‘వెలుగు’కు వివరించారు.  

చిరిగిన నోట్లు ఆర్‍బీఐకి పంపిస్తరు 

హుండీల్లో భక్తులు వేసిన కరెన్సీ నోట్లు చాలావరకు పసుపు కుంకుమలతో రంగు మారుతాయి. రూ.10 నుంచి రూ. 2 వేల నోటు వరకు లక్షల విలువైన కరెన్సీ  బెల్లం, కొబ్బరి నీళ్లతో తడిసి ముద్దగా మారుతాయి. చిరిగిపోతాయి. కౌంటింగ్​ చేస్తున్న సిబ్బంది సాధ్యమైనంత వరకు వాటిని సబ్బు నీళ్లతో క్లీన్​ చేసే ప్రయత్నం చేస్తారు. మరీ ఎక్కువ కలర్‍ అంటిన నోట్లను బ్యాంకర్ల సాయంతో ఆర్‍బీఐకి  పంపిస్తున్నారు. నోట్‍పై నంబర్లు స్పష్టంగా కనిపిస్తే వాటికి బదులుగా కొత్త నోట్లు ఇస్తారు. 

ఒడిబియ్యం వేలం 

భక్తులు మొక్కుల్లో భాగంగా ఒడి బియ్యాన్ని కూడా  హుండీల్లో వేస్తారు. నోట్లను లెక్కించే టైమ్​లోనే సిబ్బంది జల్లెడ పట్టి నోట్లు, బంగారాలను, బియ్యాన్ని వేరు చేస్తారు. బియ్యాన్ని బస్తాల్లో నింపుతారు. లెక్కింపు పూర్తయిన తర్వాత ఈ బియ్యాన్ని వేలం వేస్తారు. దాదాపు 50 నుంచి 70 క్వింటాళ్ల ఒడి బియ్యం కానుకల రూపంలో వస్తాయి. 
ఫారెన్​ కరెన్సీని మార్చుకుంటరు.హుండీలో వచ్చిన  ఫారిన్‍ కరెన్సీని లెక్కించేటప్పుడే  సిబ్బంది వేరు చేస్తారు. ఆయా దేశాల కరెన్సీని బ్యాంకర్ల సాయంతో ఫారెన్‍ ఎక్స్చెంజీలో ఆరోజు డాలర్‍ రేటు ఆధారంగా ఇండియన్‍ కరెన్సీలోకి మార్చుకుంటారు. ఈ ప్రక్రియకు దాదాపు నెల నుంచి రెండు నెలల టైం పడుతుంది.  

కాయిన్స్​ కిలోల్లో లెక్కిస్తారు 

హుండీల్లో భక్తులు వేసే చిల్లర నాణేలను జల్లెడ పట్టి వేరు చేస్తారు. రూ.1 నుంచి వివిధ డినామినేషన్లలో  కాయిన్స్ వేరు చేస్తారు.  కిలోకు ఎన్ని నాణేలు వస్తాయన్నది  రిజర్వ్​ బ్యాంక్‍ కు ఒక అంచనాఉంటుంది. ఈ లెక్కన వచ్చిన మొత్తం నాణేలను తూకం వేసి వాటి విలువ  లెక్కకడతారు.

పూజరులకు  33.33% వాటా

ఆదివాసీ సంప్రదాయం ప్రకారం మేడారం జాతర ఆదాయంలో  ప్రధాన పూజరుల కుటుంబాలకు వాటా ఉంటుంది. కానుకల ఆదాయంలో మూడోవంతు  వారికి ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది.  ప్రధాన పూజారులైన 13 కుటుంబాలకు ఆ మొత్తాన్ని  అందిస్తారు. ఇందుకోసం వారి  బ్యాంక్‍ అకౌంట్ల వివరాలు తీసుకుంటారు.  13 వారసత్వ కుటుంబాలు తమకొచ్చిన  వాటాలోంచి  అన్నదమ్ముల కుంటుంబాలతో పంచుకుంటారు. 

అమ్మవారి ప్రసాదం పూజారులకే 

మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద లక్షలాది మంది భక్తులు బంగారం రూపంలో బెల్లాన్ని మొక్కుగా చెల్లించుకుంటారు. టన్నులకొద్ది వచ్చే ఈ ప్రసాదాన్ని పూజారులు తీసుకుంటారు. గద్దెల ప్రాంతం నుంచి వారే దానిని తరలిస్తారు.   

బంగారం, వెండి  లాకర్లోకి .. 

మేడారానికి వచ్చే భక్తులు బంగారు, వెండి వస్తువులు అమ్మవారికి మొక్కుగా హుండీల్లో  వేస్తుంటారు. ప్రతిజాతరలో  కిలో కంటే ఎక్కువ బంగారం, 50 కిలోల వరకు వెండి వస్తుంటుంది. 2020లో కిలో 63 గ్రాముల బంగారం,  53 కిలోల 450 గ్రాముల వెండి హుండీల ద్వారా వచ్చింది.  జ్యువలరీ వెరిఫికేషన్‍ ఆఫీసర్లు, గోల్డ్​స్మిత్‍ల సమక్షంలో వాటి బరువు, క్వాలిటీ చూస్తారు. ప్రత్యేక బాక్సులో సీల్‍ వేసి.. బ్యాంక్‍ లాకర్​లో భద్రపరుస్తారు.

మేడారం హుండీల ఆదాయం రూ.10 కోట్లు

వరంగల్‍, వెలుగు: మేడారం  హుండీల ఆదాయం రూ.10,00,63,980కు చేరింది. హన్మకొండ టీటీడీ కల్యాణ మండపంలో ఇప్పటివరకు 450 బాక్సులు తెరిచారు. ఆరోరోజు రూ.21,67,000 నగదు వచ్చింది. ఇంకా 47 హుండీలతో పాటు తిరుగువారానికి సంబంధించిన 20 హుండీలను లెక్కించాల్సి ఉంది.  సారలమ్మ హుండీల్లో కరెన్సీ నోట్లు ఎక్కువగా పసుపు కుంకుమ, బెల్లంలో కలిసి రంగుమారాయి. ఇలాంటి నోట్ల విలువ రూ.కోటి కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.  లెక్కింపులో భాగంగా కొందరు అమ్మవారి కానుకలను చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రోజూ దాదాపు 300 మంది సేవాదృక్ఫథంతో లెక్కింపు విధులకు హాజరవుతున్నారు. ఇందులో కొందరు  సీసీ కెమెరాలు ఉన్నాయనే భయం లేకుండా చోరీ ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కొందరిని  గుర్తించి  పోలీస్‍ సిబ్బంది  వార్నింగ్‍ ఇచ్చారు. వారి నుంచి చోరీ చేసిన మొత్తాన్ని  స్వాధీనం చేసుకున్నారు.