
నేపాల్‌లో సంభవించిన భూకంపం ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 157కు చేరింది. శనివారం (నవంబర్ 4) అర్థరాత్రి భూకంపం సంభవించడంతో జాజర్ కోట్, రుకుమ్ వెస్ట్ జిల్లాల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. వాయువ్య నేపాల్‌లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో సంభవించిన ఈ భూకంప విపత్తులో ఇప్పటివరకు కనీసం 157 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు చెప్పారు. మరో 375 మందికి పైగా గాయపడ్డారు.
దేశ రాజధాని ఖాట్మాండుకు 400కి.మీల దూరంలో ఉన్న జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. శుక్రవారం రాత్రి 11.47 గంటల ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
భూకంప తీవ్రతకు పలు జిల్లాలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. పలు ప్రాంతాలతో కమ్యూనికేషన్ తెగిపోయింది. జనం రాత్రంతా రోడ్లపైనే గడిపారు. పైగా అర్ధరాత్రి కావడంతో ముందుగా ప్రమాద తీవ్రత తెలియలేదు. ఉదయం నుంచి సహాయక చర్యలు తీవ్రతరం చేశారు. రాత్రి సమయం కావడంతో సహాయ చర్యలు కష్టంగా మారాయని, కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి అటువైపు వెళ్లలేకపోయినట్లు అధికారులు చెప్పారు. ప్రకృతి విపత్తులో జజర్‌కోట్ జిల్లాలోని నల్‌గఢ్ మున్సిపాలిటీ డిప్యూటీ హెడ్ సరితా సింగ్ మృతిచెందారు. భూకంప ధాటికి ఆమె ఉంటున్న నివాసం కూలిపోయినట్లు అధికారులు చెప్పారు.
గాఢనిద్రలో ఉండగా భూకంపం సంభవించడంతో.. ప్రాణాల కోసం పరుగులు తీసేందుకు అవకాశం కూడా లేకపోయింది. రుకమ్, జజర్‌కోట్‌లో ఇళ్లు వందల సంఖ్యలో నేలమట్టం అయ్యాయి. శిథిలాలు తొలగిస్తోన్న కొద్దీ.. మృతదేహాలు బయటపడుతున్నాయి. భూకంపం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే.. కొన్ని చోట్ల రోడ్లపై కొండచరియలు విరిగిపడటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. శనివారం (నవంబర్ 4న) ఉదయం నేపాల్ ప్రధాని పుష్ప కుమార్ దహల్ ప్రచండ వైద్య బృందంతో కలిసి భూకంప ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
భూకంప విపత్తుపై భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో నేపాల్‌కు అండగా ఉంటామని, ఎలాంటి సహకారమైన చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. భూకంప మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
- ALSO READ | 128కి చేరిన నేపాల్ భూకంప మృతుల సంఖ్య