పుతిన్ ప్రియురాలు అలీనాపై ఈయూ ఆంక్షలు

పుతిన్ ప్రియురాలు అలీనాపై ఈయూ ఆంక్షలు
  • 15 ఏళ్లుగా కబయేవాతో పుతిన్ ప్రేమాయణం!
  • ఉక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దురాక్రమణ
  • యుద్ధం నేపథ్యంలో పుతిన్ ప్రియురాలికి కష్టాలు!
  • స్విస్ నుంచి బహిష్కరించాలని పిటిషన్
  • పుతిన్ ప్రియురాలు అలీనాపై ఈయూ ఆంక్షలు
  • పుతిన్ ను మానసికంగా దెబ్బకొట్టేందుకు పలు దేశాల నిర్ణయం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రియురాలికి కష్టాలు వెంటాడుతున్నాయి. పుతిన్ చర్యలు ఆమె కొంప కొల్లేరు చేసేలా తలెత్తాయి. ఉన్న చోట ఉండలేక మరోచోటకు వెళ్లలేని పరిస్థితులు దాపురించాయి. ఆమెను బహిష్కరించాలంటూ ఇప్పటికే పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. EU ఆంక్షల జాబితాలో అలీనా కబేవాను చేర్చారని వస్తున్న వార్తలు ఇప్పుడు యావత్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 

ఉక్రెయిన్‌పై దండయాత్రను కొనసాగిస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రపంచ దేశాల కఠిన ఆంక్షలను బేఖాతరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుతిన్‌ను మానసికంగా బలహీనపరిచేందుకు కొన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పుతిన్‌ ప్రియురాలుగా భావిస్తున్న జిమ్మాస్ట్ అలీనా కబయేవా (38) ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్నట్టు తెలుస్తోంది. అలీనా కబయేవా, ఆమె నలుగురు పిల్లలు భారీ భద్రత మధ్య, చాలా సీక్రెట్ ప్లేస్ లో నిర్మించిన షాలేలో (కొండ ప్రాంతాల్లో నిర్మించే చెక్కల కట్టడాలు) ఉంటున్నట్లు సమాచారం.

ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో స్విట్జర్లాండ్‌ అలీనా కబయేవాను బహిష్కరించాలంటూ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఛేంజ్‌ డాట్ ఆర్గ్‌ (change.org)లో పని చేసే మూడు దేశాలకు చెందిన కొంతమంది పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో రష్యా కూడా ఉండటం విశేషం. రష్యా, ఉక్రెయిన్‌, బెలారస్‌కు చెందిన పలువురు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను సమర్థిస్తూ ఇప్పటి వరకు 50 వేల మంది సంతకాలు చేశారని తెలుస్తోంది. 

ఉక్రెయిన్ పై భీకర దండయాత్ర కొనసాగిస్తున్న రష్యాను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు ఆంక్షల కొరఢా ఝుళిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా సహా ఐరోపా సమాఖ్య (ఈయూ) రష్యాపై పలు ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చాయి. తాజాగా ఈయూ ఆరో ఆంక్షల ప్యాకేజీని ప్రతిపాదించింది. ఈ కొత్త జాబితాలో పుతిన్ ప్రియురాలిగా భావిస్తున్న అలీనా కబయేవా పేరు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తాజా ఆంక్షల జాబితాను ఈయూ ఎగ్జిక్యూటివ్ సభ్య దేశాలకు అందించారు. ఈ జాబితాలోని ఐరోపా సమాఖ్యలోని 27 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే.. అలీనా కబయేవా ఈయూలో అడుగుపెట్టకుండా ఆమెపై నిషేధం విధిస్తారు. అంతేకాదు ఆమె ఆస్తులను కూడా స్తంభింపజేసే అవకాశముంటుంది.

ఎవరీ అలీనా కబయేవా..? 

మరోవైపు జిమ్నాస్టిక్స్ వదిలి పెట్టిన తర్వాత అలీనా కబయేవా రష్యా రాజకీయాల్లోకి ప్రవేశించారు. కబేవా తండ్రి మరాట్ కబాయేవ్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ మూడేళ్ల వయస్సులో రిథమిక్ జిమ్నాస్టిక్స్‌లో ప్రవేశించి అనంతరం రెండు ఒలింపిక్ పతకాలు, 14 ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు, 21 యూరోపియన్ ఛాంపియన్‌షిప్ పతకాలు గెలుచుకుంది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో స్వర్ణం. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. 

జిమ్మాస్టిక్స్‌కు రిటైర్మెంట్ ప్రకటించి 2004లో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 2005లో పబ్లిక్ ఛాంబర్‌ ఆఫ్ రష్యా సభ్యురాలిగా, ఆ తర్వాత 2008లో పబ్లిక్ కౌన్సిల్ ఆఫ్ జాతీయ మీడియా గ్రూప్ ఛైర్మన్‌‌గానూ పని చేశారు. 2007, 2014లో దుమా రాష్ట్రం నుంచి యునైటెడ్ రష్యా పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. ఈ క్రమంలో పుతిన్‌తో కబయేవాకు సాన్నిహిత్యం ఏర్పడి, ఇరువురి మధ్య బంధం మరింత బలపడింది. తొలిసారిగా 2008లో పుతిన్, కబయేవా రిలేషన్‌షిప్‌ వార్తలు యావత్ ప్రపంచ వ్యాప్తంగా గుప్పుమన్నాయి. పుతిన్, కబయేవాలకు నలుగురు పిల్లలు ఉన్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 

పుతిన్‌ గతంలో సోవియట్‌ గూఢచార సంస్థ కేజీబీ ఏజెంట్‌గా పని చేశాడు. స్వతహాగా గోప్యత అనేది ఆయన జీవితంలో ఒక భాగమైందంటారు. ఆయన ఫ్యామిలీ లైఫ్‌ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అయితే.. తరచూ ఆయన వ్యక్తిగత జీవితం గురించి వెస్ట్రన్‌ మీడియాలో కథనాలు దర్శనమిస్తూనే ఉంటాయి. ఉక్రెయిన్ తో యుద్ధం జరుగుతున్న వేళ ఆయన పర్సనల్‌ లైఫ్‌ మరోసారి తెర మీదకు వచ్చింది. మరోవైపు కబేవా, పుతిన్ ఏనాడూ తమ సంబంధాన్ని బహిరంగంగా ఒప్పుకోలేదు. పుతిన్ గతంలో తన వ్యక్తిగత జీవితం గురించి చాలా సార్లు ప్రస్తావించారు. తనకూ ఒక వ్యక్తిగత జీవితం ఉందని అందులోకి ఎవరు చొరబడినా ఒప్పుకోనని ఖచ్చితంగా చెప్పాడు. అందుకే తన వ్యక్తిగత జీవితం గురించి ప్రయత్నించిన వారి పట్ల పుతిన్‌ చాలా కఠినంగా వ్యవహరిస్తాడని అంటుంటారు. 

పుతిన్‌ ప్రియురాలుగా భావిస్తున్న జిమ్మాస్ట్ అలీనా కబయేవాను స్విట్జర్లాండ్‌ నుంచి పంపించి వేస్తే ఆ తర్వాత ఆమె ఏ దేశానికి వెళ్తుంది..? అక్కడ పిల్లలతో కలిసి ఎలా ఉంటుంది..? అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

మరిన్ని వార్తల కోసం.. 

ఫ్లోటింగ్ బ్రిడ్జిపై ఎంజాయ్ చేస్తున్న టూరిస్టులు

పిల్లలతో ఆడుకుంటున్నయంగ్ టైగర్