యాసంగిలో తగ్గుతున్న వరి..గత సీజన్​ కంటే 40 వేల ఎకరాలు తగ్గుదల

యాసంగిలో తగ్గుతున్న వరి..గత సీజన్​ కంటే 40 వేల ఎకరాలు తగ్గుదల
  •     2.41 లక్షల ఎకరాల్లో సాగు అంచనా 

యాదాద్రి, వెలుగు : యాసంగి సీజన్​లో ఈసారి వరి సాగు తగ్గనుంది. గత సీజన్​ కంటే ఈసారి 40 వేల ఎకరాల్లో సాగు తగ్గుతుందని వ్యవసాయ అధికారులు  అంచనా వేశారు. వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆరుతడి పంటల సాగు పెరగనుందని అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్లాన్ రెడీ చేశామని, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నామని చెబుతున్నారు.  

2.41 లక్షల ఎకరాల్లో వరి 

యాదాద్రి జిల్లాలో గడిచిన కొన్ని సీజన్లుగా వరి సాగు పెరిగింది. వరి సాగు తగ్గించాలని గత సర్కారు చెప్పినా రైతులు పట్టించుకోలేదు. పత్తి, కందులు, ఇతర ఆరుతడి పంటలు సాగు చేసే రైతులు సైతం వరి సాగు వైపు మళ్లారు. ముగిసిన వానాకాలం సీజన్​లో దాదాపు 3 లక్షల ఎకరాల్లో  వరి సాగు చేశారు. దొడ్డురకమే ఎక్కువగా సాగు చేయడంతో దిగుబడి కూడా పెరిగింది.  ఇప్పుడు యాసంగి సీజన్​కు రైతులు రెడీ అయ్యారు. అయితే గడిచిన సీజన్​ కంటే ఈసారి వరిని తక్కువగా సాగు చేస్తారని అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు.  గత సీజన్​లో 2.81 లక్షల ఎకరాల్లో సాగు చేయగా ఈసారి 2.41 లక్షల ఎకరాల్లోనే సాగవనుందని చెబుతున్నారు. 

వానలు సరిగా పడలే

జిల్లాలో బోర్ల కిందనే ఎక్కువగా వరి సాగు చేస్తున్నారు.  వానాకాలం సీజన్​లో  అవసరమైన సమయంలో వానలు పడలేదు. భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టి.. బోర్ల నుంచి పంటకు సరిగా నీరందించలేకపోయారు. దీంతో ఈసారి వరి సాగు నుంచి కొందరు రైతులు తప్పుకుంటున్నారని తెలుస్తోంది.  గత యాసంగిలో 1.50 లక్షల మంది రైతులు సాగు చేయగా ఈసారి వారి సంఖ్య తగ్గుతుందని అధికారులు అంటున్నారు. 

ఆరుతడి పంటలు 20 వేల ఎకరాలు 

ఆరుతడి పంటల సాగు మాత్రం గతంలో కంటే  పెరుగనుందని అగ్రికల్చర్​ ఆఫీసర్లు చెబుతున్నారు.  గత యాసంగి సీజన్​లో కేవలం 1730 ఎకరాల్లో  ఆరుతడి పంటలు సాగవగా.. ఈ సారి 20 వేల ఎకరాలు దాటొచ్చని  అంచనా వేశారు.  జిల్లాలోని నేలల్లో మినుములు, నువ్వులు, వేరుశనగ, కుసుమలు, జొన్న, మొక్కజొన్న సాగు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.