మీడియా తప్పుడు ప్రచారం వల్లే ఓడినం : వేముల ప్రశాంత్ రెడ్డి

 మీడియా తప్పుడు ప్రచారం వల్లే ఓడినం : వేముల ప్రశాంత్ రెడ్డి

బెల్లంపల్లి, వెలుగు : బీఆర్ఎస్ పై మీడియా తప్పుడు ప్రచారం చేయడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోయామని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్  రెడ్డి అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన నిర్వహించిన అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్  పాలనలో మాజీ సీఎం రూ.7 లక్షల కోట్ల అప్పు చేస్తే, 50 రోజుల కాంగ్రెస్  పాలనలో ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి రూ.14 వేల కోట్ల అప్పు చేశారని ఆయన ఆరోపించారు. అబద్ధపు హామీలు, మోసపూరిత ప్రచారాలతో రేవంత్  రెడ్డి సీఎం అయ్యారన్నారు. లక్షల కోట్లు బీఆర్ఎస్  ప్రభుత్వం అప్పులు చేసిందని చెబుతున్న రేవంత్.. 50 రోజుల్లో  రూ.14 వేల కోట్ల అప్పులు ఎందుకు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్  నేతలపై తప్పుడు కేసులు పెట్టొద్దని, ప్రభుత్వం దాడులకు పాల్పడితే ప్రతిదాడులు తప్పవని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్  పార్టీ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై పోరాడాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ  దండే విఠల్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మాజీ మంత్రి బోడ జనార్ధన్, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, నియోజకవర్గంలోని ఏడు మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

సుమన్  వల్లే జిల్లాలో పార్టీ ఓడింది: సతీశ్

ప్రస్తుతమున్న ​పార్టీ జిల్లా అధ్యక్షుడి మూలంగానే జిల్లాలో బీఆర్ఎస్  ఓడిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​ను మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్  విమర్శించారు. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షుడిని మార్చాలని, లేకపోతే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్  ప్రభుత్వం బీఆర్ఎస్ లీడర్లపై తప్పుడు కేసులు పెడుతున్నదని ఆరోపించారు.