సుస్థిర పర్యావరణం నేటి బాలల హక్కు : డా. దొంతి నర్సింహా రెడ్డి

సుస్థిర పర్యావరణం నేటి బాలల హక్కు : డా. దొంతి నర్సింహా రెడ్డి

పర్యావరణ వనరుల విధ్వంసం వల్ల భూమిపై అనేక మార్పులు సంభవిస్తున్నాయి. మానవ కార్యకలాపాల వల్ల కాలుష్యం జరిగి భూమి ఉష్ణోగ్రత పెరుగుతున్నది. భూతాపం పర్యవసానంగా ప్రకృతి వనరులు క్షీణిస్తున్నాయి. నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. చెట్ల నరికివేత వల్ల, వేడి వాతావరణం వల్ల బాహ్య ప్రదేశాల్లో ఉండే అవకాశాలు తగ్గిపోతున్నాయి. అనేక పారిశ్రామిక ప్రాంతాలు, ఆ చుట్టూ పక్కల ప్రాంతాల్లో దుమ్మూ ధూళితో కూడిన విషవాయువుల వల్ల ప్రాణ వాయువు లేక జీవులు, జీవాలు అల్లాడుతున్నారు. స్వచ్ఛమైన తాగునీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. వైవిద్యభరితమైన ఆహార లేమి అనేక కుటుంబాలను బాధిస్తున్నది. నగరాలకు వలస పోవాల్సిన దుస్థితి. నగరాల్లో 50 శాతం కంటే ఎక్కువ జనాభా జీవన ప్రమాణాలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి. వీటి వల్ల ప్రతి జీవి, ప్రతి మనిషి బాధపడుతున్నా, పిల్లల మీద ప్రభావం చాలా ఎక్కువగా ఉంటోంది. ఎదిగే వయసులో వారికి కావాల్సిన మోతాదులో స్వచ్ఛమైన నీరు, గాలి, ఆహారం లేకపోవడం వారి శరీరం మీద దీర్ఘకాలిక ప్రభావం చూపుతున్నది. ఇర జీవాల మీద ప్రభావంతో పాటు మానవుల సంతతి మీద పర్యావరణ విధ్వంసం వల్ల కలుగుతున్న ‘హింస’ గురించిన చింత పాలకులకు లేకపోవడం దురదృష్టకరం.

కనీస సౌలత్​లు లేక..

నగరాలు విస్తృతమవుతున్న స్థాయిలో పిల్లలకు ఆట స్థలాలు లేవు. ప్రాణవాయువు అందించే చెట్లు, పచ్చదనం, ఖాళీ స్థలాలు లేవు. ఢిల్లీ వంటి నగరాల్లో చిన్న పిల్లలకు కాలుష్యమయ జీవనంతో వస్తున్న శ్వాసకోశ వ్యాధుల వల్ల సాధారణ బాల్య జీవనం కోల్పోతున్నారు. సహజ ఆహారం నుంచి అనేక మంది పిల్లలు ఎప్పుడో దూరమయ్యారు. ఇప్పటి పెద్దలు తమ బాల్యంలో అనుభవించిన జీవితం ఇప్పటి పిల్లలకు లేదు. మధ్య, సంపన్న వర్గాల పిల్లలకు వసతులు, సౌఖ్యాలు ఉన్నా, వారిని ఒక మానవ సమాజ జీవిగా ఎదగనియ్యని వాతావరణం ఉన్నది. అలాంటి వారి ఆరోగ్యం అంతంత మాత్రమే. పేద వర్గాల పిల్లలకు కనీస ప్రమాణాల మేరకు నీళ్లు, ఆహారం, నీడ, సౌఖ్యం లేవు. సహజ బాల్య వ్యవస్థ అన్ని వర్గాల పిల్లలకు అందుబాటులో లేదు. పేద వర్గాల పిల్లల పరిస్థితి ఇంకా దయనీయం. అనేక దేశాల్లో ఇప్పుడు పుడుతున్న శిశువులకు అనేక సవాళ్ల మధ్య జీవన్మరణ సమస్యలు ఎదురవుతున్నాయి. 

విదేశాల్లో ప్రభుత్వాలపై ఒత్తిడి..

పర్యావరణ పరిరక్షణ మానవ మనుగడకు అత్యంత అవసరం. నేటి బాల్యానికి రేపటి భూమి జీవించే యోగ్యంగా ఉంటుందా? అనే అనుమానం ప్రబలంగా ఉన్నది. భూ ఉష్ణోగ్రతలు పెరిగిన కొద్దీ మనుగడ కష్టతరంగా మారుతున్నది. 50 నుంచి 60 డిగ్రీల సెంటిగ్రేడ్ స్థాయిలో వేడి వల్ల పిల్లలకు భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదముంది. ఒమాన్ లో ఇప్పటికే పట్టపగలు బయట అడుగుపెట్టలేని వాతావరణం ఉన్నది. యూరప్ లో వేసవి తాపం 35 డిగ్రీలు చేరితే వారు తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. ఆయా ప్రాంతం బట్టి, దేశం బట్టి, పర్యావరణానికి జరిగిన హాని మేరకు జీవన స్థితిగతులు మారుతున్నాయి. బాల్యం మీద, పిల్లల మీద, ప్రత్యేకంగా ఆడపిల్లల మీద దుష్ప్రభావం ఎక్కువగా ఉన్నది. శాస్త్రవేత్తలు, పరిశోధకులు పర్యావరణ నష్టం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తు మీద ఆందోళనతో పర్యావరణ స్పృహ ఉన్న అనేక మంది పిల్లలు, యువకులు అనేక దేశాల్లో పర్యావరణ విధ్వంసానికి పరిష్కారాలు, విధానాల కోసం పోరాడుతున్నారు. పాలకుల మీద ఒత్తిడి పెంచుతున్నారు. కొన్ని ఐరోపా దేశాలలో పిల్లలు రోడ్ల మీదకు వచ్చి పాలకులను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిన సదస్సు ఒక దిక్సూచిని తయారు చేసింది. బాలల హక్కుల ఆస్వాదనకు పర్యావరణ విధ్వంసం భంగం కలిగిస్తున్నదని భావిస్తూ,  ప్రభుత్వాలకు, దేశాధినేతలకు సూచనలు చేసింది. 

వ్యాపారస్తులకు సూచనలు

పర్యావరణ పరిరక్షణకు బాలల హక్కులు ఎలా వర్తిస్తాయో ఇందులో స్పష్టంగా ఉన్నది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, సుస్థిరమైన పర్యావరణాన్ని పొందే హక్కు పిల్లలకు ఉందని నొక్కి చెబుతోంది. ఈ హక్కు కన్వెన్షన్ లో అంతర్లీనంగా ఉంది. దాంతో పాటు ఇతర హక్కులు కూడా ఇందులో చేర్చారు. ముఖ్యంగా జీవించే హక్కు, మనుగడ, అభివృద్ధి, అత్యున్నత ఆరోగ్య స్థితి, తగిన జీవన ప్రమాణం, విద్యా హక్కులు కూడా ఉన్నాయి. బాలల హక్కులను సంపూర్ణంగా పొందడానికి కూడా పర్యావరణ సంబంధిత హక్కు చాలా అవసరం. వాణిజ్య కార్యకలాపాల వల్ల జరిగే పర్యావరణ నష్టం నుంచి దేశాలు పిల్లలను రక్షించాలని ఐక్యరాజ్యసమితి ఈ డాక్యుమెంట్ ద్వారా నొక్కి చెబుతున్నది. లాభాపేక్ష ఉండే వ్యాపారస్తులు, వ్యాపార సంస్థలు బాలల హక్కులను గౌరవించేలా చూడటానికి దేశాలు తగిన చట్టపర నిబంధనలు రూపొందించి అమలు చేయాలనీ చెబుతున్నది. 

మన దగ్గర స్పృహ పెరగాలి..

అనేక దేశాల్లో పిల్లల పరిస్థితి కారణంగా పర్యావరణానికి సంబంధించి వారి హక్కులు పొందడానికి చట్టపరమైన అడ్డంకులను ఎదుర్కొంటున్నారని, హక్కులను నిర్ధారించే మార్గాలను పరిమితం చేస్తున్నారని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పర్యావరణానికి సంబంధించిన హక్కుల ఉల్లంఘనలకు, పిల్లలు న్యాయం పొందడానికి దేశాలు మార్గాలను అందించాలి. అందరు పిల్లలను సమానంగా చూడడానికి స్నేహపూర్వక, లింగ భేదం లేని, వైకల్యం- సమ్మిళిత ఫిర్యాదుల యంత్రాంగాలు తయారు చేయాలి. అదనంగా, నష్ట నివారణకు, బాలల హక్కుల(గత లేదా ప్రస్తుత) ఉల్లంఘనలను గుర్తించి పరిష్కరించే యంత్రాంగాలు అందుబాటులో ఉండాలి. వాతావరణ మార్పులకు సంబంధించి, వ్యాపార సంస్థల వల్ల కలిగే వాతావరణ మార్పులకు సంబంధించిన పిల్లల హక్కులకు హాని జరగకుండా రక్షించడానికి దేశాలు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి నొక్కి చెబుతోంది. పిల్లల హక్కులపై ప్రతికూల ప్రభావాలను నివారించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సాయం అవసరం ఉందని ఈ మార్గదర్శకం నొక్కి చెప్పింది. వాతావరణ మార్పుల మీద వస్తున్న ఆర్థిక వనరుల ఉపశమనం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నదని, ఇది నష్ట నివారణ చర్యలు అవసరమయ్యే ప్రాంతాల్లో నివసించే పిల్లలపట్ల వివక్షగా భావిస్తున్నట్లు కూడా ఈ డాక్యుమెంట్ పేర్కొంది. పర్యావరణ హాని, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి తక్షణ సమష్టి చర్యలను కమిటీ కోరింది. భవిష్యత్తు పిల్లలదే. నేటి బాలలదే రేపటి ప్రపంచం. ప్రస్తుత బాల్యాన్ని, రేపటి వారి భవిష్యత్తుని కాపాడాల్సిన బాధ్యత ప్రస్తుతం నిర్ణాయక దశలో ఉన్న పెద్దలదే. భారత్ లోని ప్రతి కుటుంబం తమ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వాల మీద, పాలకుల మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉన్నది. పర్యావరణహిత విధానాల కోసం నడుంకట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

స్పందించిన ఐక్యరాజ్య సమితి.. 

ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల కమిటీ వాతావరణ మార్పులపై ప్రత్యేక దృష్టి సారించి బాలల హక్కులు, పర్యావరణంపై ఇటీవల ఆగస్టు 28న అధికారిక మార్గదర్శకాలను ప్రచురించింది. బాలల హక్కుల మీద పర్యావరణ క్షీణత, వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తూ, పరిష్కరించడంతో పాటు ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్లకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, సుస్థిరమైన ప్రపంచాన్ని అందిస్తూ, భవిష్యత్తు తరాల కోసం భూమిని  సంరక్షించడానికి ప్రపంచ దేశాలు తక్షణమే అమలు చేయాల్సిన శాసన, పరిపాలనా చర్యలను ఈ మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి. దేశాలు, జాతీయ మానవ హక్కుల సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, పౌర సమాజం, నిపుణులు, పిల్లలతో రెండు దఫాల సంప్రదింపుల తర్వాత కమిటీ అధికారికంగా జనరల్ కామెంట్ నంబర్ 26 అని పిలిచే తన మార్గదర్శకాలను ఆమోదించింది. ఈ కమిటీకి 121 దేశాల్లోని పిల్లల నుంచి 16,331 విజ్ఞప్తులు అందాయి. పిల్లలు తమ జీవితాల మీద, తమ చుట్టూ ఉన్న సమాజం మీద పర్యావరణ విధ్వంసం వాతావరణ మార్పుల వల్ల పడుతున్న ప్రతికూల ప్రభావాల గురించి సమాచారం ఇచ్చారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, సుస్థిరమైన పర్యావరణం లో జీవించాల్సిన తమ  హక్కును నొక్కి చెప్పారు.

ఇండియా నుంచి  బాలల సలహాదారుడు..

“నేటి ప్రపంచానికి పిల్లలే నాయకులు, ఆలోచనాపరులు, మార్పుకు ప్రతినిధులు. మా అభిప్రాయం ముఖ్యం, అవి వినిపించే అర్హత కూడా ఉన్నది’’ అని భారతదేశానికి చెందిన పర్యావరణ, బాలల హక్కుల కార్యకర్త, ఐక్యరాజ్యసమితి కమిటీ బాలల సలహాదారుల్లో ఒకరైన17 ఏళ్ల కార్తీక్ అన్నారు. పర్యావరణ, వాతావరణ సంక్షోభాల నేపథ్యంలో మన హక్కులను అర్థం చేసుకోవడానికి, వినియోగిం చుకోవడానికి జనరల్ కామెంట్ నెం.26 ఉపయోగపడుతుందని తెలిపారు. ‘‘ఈ జనరల్ కామెంట్ నెం.26 కు దీర్ఘకాలిక చట్టపరమైన ప్రాముఖ్యత ఉన్నది’’ అని కమిటీ చైర్ పర్సన్ ఆన్ స్కెల్టన్ నొక్కి చెప్పారు. ఇది బాలల హక్కుల ఒప్పందం కింద దేశాల బాధ్యతలను వివరిస్తుంది. పర్యావరణ నష్టాలను పరిష్కరించడానికి పిల్లలు వారి హక్కులను ఉపయోగించ డానికి ఇది హామీ ఇస్తుంది. ఇందులో పిల్లలకు సమాచారం పొందడానికి, నిర్ణయాల్లో, సంప్రదింపుల్లో పాల్గొనడానికి, న్యాయం కోసం పోరాడడానికి హక్కులు కల్పిస్తూ, పర్యావరణ క్షీణత, వాతావరణ మార్పుల వల్ల కలిగే హాని నుంచి ఉపశమనం పొందడానికి అవకాశం కల్పిస్తుంది.

- డా. దొంతి నర్సింహా రెడ్డి,  పాలసీ ఎనలిస్ట్