ధోనీ రిటైర్‌మెంట్‌పై మళ్లీ మొదలైన చర్చ.. కైఫ్ ఏమన్నాడంటే..? 

ధోనీ రిటైర్‌మెంట్‌పై మళ్లీ మొదలైన చర్చ.. కైఫ్ ఏమన్నాడంటే..? 

మే 14వ తేదీ ఆదివారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మ్యాచ్‌ ఓటమి తర్వాత ఎంఎస్ ధోనీ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చాడు. ధోనీ రిటైర్‌మెంట్‌పై చర్చకు తెరలేసింది. చెపాక్‌లో చెన్నైకు చివరి లీగ్‌  మ్యాచ్‌ కావడం.. చివర్లో ఆటగాళ్లంతా మైదానమంతా కలియతిరగడంతో ధోనీకిదే చివరి సీజన్‌ అని అభిమానుల్లోనూ సందేహం తలెత్తింది. సునీల్‌ గావస్కర్ కూడా ధోనీ ఆటోగ్రాఫ్‌ను తన షర్ట్ పై తీసుకోవడంతో రిటైర్ మెంట్ ఖాయమనే చర్చ క్రికెట్ ఫ్యాన్స్ లో  మళ్లీ మొదలైంది. 

సునీల్ గావస్కర్ మాత్రమే కాదు.. స్టేడియంలో భద్రతను పర్యవేక్షిస్తున్న కొంతమంది పోలీసులు, క్రికెట్ ఫ్యాన్స్ కూడా టెన్నిస్ బాల్స్ పై ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. చెన్నై ఫ్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్‌ మ్యాచ్ అనంతరం కీలక విషయం తెలిపాడు. ‘‘వచ్చే సీజన్‌లోనూ ధోనీ తప్పకుండా ఆడతాడనే నమ్మకం మాకుంది. అభిమానులు ఎప్పటికీ ఇలానే మద్దతుగా నిలవాలని కోరుతున్నా’’ అని వెల్లడించారు. 

వచ్చే ఏడాది ఐపీఎల్ ధోని ఆడకపోవచ్చని భారత మాజీ మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ మహ్మద్ కైఫ్ కూడా అభిప్రాయపడ్డాడు. ఆదివారం (మే 14న) చెపాక్‌లో ధోని ల్యాప్ ఆఫ్ హానర్ మార్క్యూ టోర్నమెంట్ నుండి రిటైర్మెంట్ గురించి చర్చ మొదలుకావడంతో కైఫ్ ఈ విధంగా స్పందించాడు. సునీల్ గావస్కర్ లాంటి వాళ్లు ఆటోగ్రాఫ్ తీసుకోవడం బట్టి చూస్తుంటే వచ్చే ఏడాది ధోని ఐపీఎల్ ఆడకపోవచ్చని భావిస్తున్నామని తెలిపాడు. మరోవైపు.. ధోని మరికొన్ని ఐపీఎల్‌ మ్యాచ్ లు ఆడితే బాగుంటుందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. 

ప్రస్తుతం 15 పాయింట్లతో చెన్నై సూపర్ కింగ్స్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో వారి సొంతమైదానంలో సీఎస్‌కే తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే.. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఓడితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. అప్పుడు, ముంబయి, లఖ్‌నవూ, బెంగళూరుతో పోటీ పడాల్సి ఉంటుంది. తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ (మే 23), ఎలిమినేటర్‌ మ్యాచ్‌ (మే 24) చెన్నైలో జరుగుతాయి. చెన్నై టాప్‌ - 2లో ఉంటే తొలి క్వాఫయిర్‌ను చెన్నైలో ఆడే అవకాశం ఉంటుంది. మూడు లేదా నాలుగో స్థానంలో ఉంటే కూడా చెన్నైలోనే ఎలిమినేటర్‌ మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. రెండో క్వాలిఫయర్‌, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతాయి.