‘డూమ్స్ డే గ్లేసియర్’ ఫాస్ట్​గా కరుగుతోంది

‘డూమ్స్ డే గ్లేసియర్’ ఫాస్ట్​గా కరుగుతోంది

లండన్: ప్రపంచంలోనే అతి పెద్ద హిమానీనదం అయిన థ్వేట్స్ గ్లేసియర్​కు గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెను ముప్పు ముంచుకొస్తోంది. 128 కిలోమీటర్ల వెడల్పు.. కిలోమీటరున్నరకు పైగా మందం.. 1.90 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో.. మొత్తంగా మన దేశంలోని గుజరాత్ రాష్ట్రమంత సైజులో అంటార్కిటికా ఖండంలో ఉన్న ఈ గ్లేసియర్ మునుపెన్నడూ లేనంత వేగంగా కరిగిపోతోందట. ఇది గనక ముక్కలు అయిపోయినా లేదా పూర్తిగా కరిగినా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల తీర ప్రాంతాలు మునిగిపోతయని ‘బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే’లో వెల్లడించింది. ఈ గ్లేసియర్ కరిగితే భారీ ముప్పు కలిగే అవకాశం ఉన్నందున దీనిని సైంటిస్టులు ‘డూమ్స్ డే గ్లేసియర్’గా పిలుస్తున్నారు. 

గ్లేసియర్ పగుళ్లలోకి వేడినీళ్లు

గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రపు నీరు వేడెక్కుతోందని, ఈ వేడినీళ్లు థ్వేట్స్ గ్లేసియర్​ కింది భాగాన్ని వేగంగా కరిగిస్తున్నాయని బ్రిటన్ సైంటిస్టులు గుర్తించారు. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్​తో ఈ గ్లేసియర్ నుంచి ఏటా వందల కోట్ల టన్నుల ఐస్ ముక్కలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారు.

థ్వేట్స్ మొత్తం ముక్కలైతే..?

థ్వేట్స్ గ్లేసియర్ మొత్తం ముక్కలైపోతే ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు 3 మీటర్ల మేర పెరుగుతాయని సైంటిస్టులు అంచనా. అయితే, ఈ గ్లేసియర్ దాని చుట్టుపక్కల ఐస్, గ్లేసియర్లకు ఒక ఆనకట్టలా పనిచేస్తోందని, ఇది ముక్కలైతే ఆ ఐస్, గ్లేసియర్ లు కూడా సముద్రంలో కలుస్తాయని చెప్తున్నారు. వాస్తవానికి ఈ గ్లేసియర్ మొత్తం కరిగేందుకు వేల ఏండ్లు పడుతుందని అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడిది అనూహ్య వేగంతో కరుగుతుండటం చూస్తే.. వచ్చే వందేండ్లలోనే దీని వల్ల సముద్రమట్టాలు అర మీటర్ పెరగవచ్చని, మరో 500 ఏండ్లలో ఇది పూర్తిగా కరిగిపోయే ప్రమాదం కూడా ఉందని సైంటిస్టులు పేర్కొన్నారు.

ఇండియాకూ ముప్పుంటది 

థ్వేట్స్ గ్లేసియర్ మనకు దాదాపుగా 12 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతదూరంలో ఉంది కదా.. ఇది కరిగితే మనకేంటీ? అని అనుకునేందుకులేదని సైంటిస్టులు చెప్పారు. ఇది కరిగితే హిందూ మహాసముద్రంతో పాటు అరేబియా సముద్రంలోనూ నీటి మట్టం పెరుగుతుందని అంటున్నారు.


టర్కీ భూకంపానికి లింకు..?

టర్కీ, సిరియాలలో ఇటీవల వచ్చిన భూకంపాలకూ ఓ గ్లేసియర్ వేగంగా కరిగిపోవడం కూడా కారణం కావచ్చని బ్రిటన్ సైంటిస్టులు పేర్కొన్నారు. టర్కీలోని మౌంట్ అగ్రి(అరారత్) అగ్నిపర్వతంపై ఉన్న గ్లేసియర్లు, మంచు గతకొన్నేండ్లలో భారీగా కరగిపోయాయని, అందువల్ల అక్కడి టెక్టానిక్ ప్లేట్​పై బరువు తగ్గిపోయి, అది ముందుకు కదిలి భూకంపాలకు దారి తీసి ఉండొచ్చనీ అంచనా వేశారు.