రూ.7 కోట్ల ఇన్సూరెన్స్​ డబ్బుల కోసం మర్డర్​ డ్రామా

 రూ.7  కోట్ల ఇన్సూరెన్స్​ డబ్బుల కోసం మర్డర్​ డ్రామా
  • కారులో వ్యక్తి దహనం కేసులో బిగ్​ ట్విస్ట్​
  • చనిపోయాడనుకున్న వ్యక్తి బతికే ఉన్నడు.. పోలీసులకు దొరికిండు
  • తాను చనిపోయినట్లు బీమా కంపెనీని నమ్మించేందుకు డ్రామా
  • చనిపోయింది కారు డ్రైవరా.. అడ్డా కూలీనా?

మెదక్ (టేక్మాల్​), వెలుగు :  ఆన్​లైన్​ గేమ్​లు ఆడి, బెట్టింగ్​లు కట్టి పెద్ద మొత్తంలో నష్టపోయిన ఓ ప్రభుత్వ ఉద్యోగి.. రూ.7  కోట్ల ఇన్సూరెన్స్​ డబ్బుల కోసం ఆడిన మర్డర్​ డ్రామా  బట్టబయలైంది. సంచలనం రేకెత్తించిన ఈ సంఘటనలో ఎవరూ ఊహించని బిగ్​ ట్విస్ట్​ వెలుగులోకి వచ్చింది. కారు దహనమై చనిపోయాడనుకున్న వ్యక్తి ప్రాణాలతోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ కారులో హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది మిస్టరీగా మారింది. 

సీసీ ఫుటేజీలు, సెల్​ ఫోన్​ కాల్​ డేటాలో.. 

మెదక్ జిల్లా టేక్మాల్​ మండలం వెంకటాపూర్​ వద్ద ఈ నెల 9న కారులో ఓ వ్యక్తి దహనమయ్యాడు. ఈ కారు హైదరాబాద్ సెక్రటేరియట్​లోని ఇరిగేషన్​ విభాగంలో అసిస్టెంట్​ సెక్షన్​ ఆఫీసర్​గా పనిచేస్తున్న బీమ్లా తండావాసి ధర్మా నాయక్​దిగా గుర్తించారు. సంఘటనా స్థలంలో దొరికిన బ్యాగులో ధర్మా నాయక్​కు సంబంధించిన పలు డాక్యుమెంట్లు దొరకడంతో.. ఆ కారులో దహనమైంది అతడేనని తొలుత  భావించారు. ఆ కోణంలోనే పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కానీ సీసీ ఫుటేజీలు, సెల్​ ఫోన్​ కాల్​ డేటాను విశ్లేషించాక  విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కారు దహనం సంఘటనలో చనిపోయాడు అని భావిస్తున్న ధర్మా నాయక్​ బతికే ఉన్నాడని పోలీసులు గుర్తించారు. 

అతడిని మహారాష్ట్రలోని పుణెలో  అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. ఆన్​లైన్​ గేమ్స్​ ఆడి, బెట్టింగ్​లు పెట్టి కోట్లలో నష్టపోయిన ధర్మా నాయక్​.. వాటిని తీర్చేందుకే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మర్డర్ డ్రామా ప్లాన్​ చేశాడని భావిస్తున్నారు. తాను చనిపోతే దాదాపు రూ.7 కోట్ల ఇన్సూరెన్స్​ డబ్బులు వస్తాయని.. వాటితో అప్పులన్నీ తీర్చేయొచ్చని చెప్పి ఈ పథకం వేసినట్టు తెలుస్తోంది. 

మర్డర్​ ప్లాన్​ అమలైన 4 రోజుల తర్వాత.. 

చేగుంట, హైదరాబాద్​కు చెందిన ఫ్రెండ్స్​ తో కలిసి బాసరకు వెళ్తున్నట్టు  ఈ నెల 5న  ఇంట్లో చెప్పి ధర్మా నాయక్ వెళ్లాడని సంఘటన జరిగిన రోజు కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. ఇంటి నుంచి వెళ్లిన నాలుగు రోజుల తరువాత (జనవరి 9న).. ఓ వ్యక్తిని తన దగ్గరి బంధువు సహకారంతో చంపేసి, కారులోనే  డెడ్ బాడీని ఉంచి వెంకటాపూర్​ సమీపంలోని కుంట వద్ద నిప్పు పెట్టాడు.  అనంతరం అక్కడి నుంచి ధర్మా నాయక్ పరారైనట్టు భావిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన మూడు, నాలుగు రోజుల తర్వాతి నుంచి.. ధర్మా నాయక్​ తన కుటుంబ సభ్యులకు ఫోన్​ చేసి డెత్​ సర్టిఫికెట్​ తీసుకోమని చెబుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతని సెల్​ ఫోన్​ కాల్​ డాటా ఆధారంగా ఆచూకీ గుర్తించినట్లు సమాచారం. వెంకటాపూర్​ గ్రామంలోని సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా జనవరి 8వ తేదీన రాత్రి ధర్మానాయక్​ తన కారులో తండాకు వెళ్లినట్టు గుర్తించారు. దర్యాప్తును ముందుకు తీసుకెళ్లిన పోలీసులు.. అతన్ని పుణెలో అదుపులోకి తీసుకున్నారు. ఈ మర్డర్​ ప్లాన్​లో అతడికి సహకరించిన బంధువును కూడా పోలీసులు పట్టుకున్నట్టు తెలిసింది. అయితే హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది మిస్టరీగా మారింది. ధర్మానాయక్​ హైదరాబాద్​ నుంచి తీసుకొచ్చిన టెంపరరీ డ్రైవర్​ కావొచ్చని కొందరు అంటుండగా.. బాసర నుంచి తీసుకొచ్చిన అడ్డా కూలీ అయి ఉండొచ్చని ఇంకొందరు చెబుతున్నారు. అయితే అతన్ని ఎక్కడ.. ఎలా చంపేశారు? అనేది ధర్మా నాయక్ నోరు విప్పి పోలీసులకు​ చెబితే గానీ తెలిసేలా లేదు.