అంధకారంగా మారిన ఫోటోగ్రాఫర్ల జీవితాలు

అంధకారంగా మారిన ఫోటోగ్రాఫర్ల జీవితాలు

వేయి పదాల్లో చెప్పలేని భావాన్ని ఒక్క ఫోటోతో చెప్పొచ్చంటారు. అందుకే ఫోటోకు అంత ప్రాముఖ్యత ఉంటుంది. మన జీవితాల్లో జరిగే ఎన్నో ఘటనలను ఫోటోలుగా మలిచి.. వాటిని మధుర జ్ఞాపకాలుగా మార్చేవాడే ఫోటోగ్రాఫర్. అయితే ఇవాళ స్మార్ట్ ఫోన్ల రాకతో ఆ ఫోటోగ్రాఫర్ల జీవితాలు దుర్భరంగా మారాయి. రంగు రంగుల ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్ల బతుకులు నేడు అంధకారంగా మారాయి. ఒంటి కన్నుతో ఈ  ప్రపంచాన్ని మొత్తం తన కెమెరాలో బంధించే ఫోటోగ్రాఫర్.. నేడు కస్టమర్లు లేక వెలవెలబోతున్నాడు. స్టూడియోలకు అద్దె చెల్లించలేక అప్పుల పాలవుతున్నాడు. 

స్మార్ట్ ఫోన్ల రాకతో ఫోటోగ్రాఫర్ల బతుకులు దుర్భరం

టెక్నాలజీ పెరగడం వల్ల జీవితాలు సులువుగా మారుతాయి అంటుంటారు చాలామంది. కానీ స్మార్ట్ ఫోన్లు పరిచయం అయ్యాక ఫొటో గ్రాఫర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ఉపాధి లేక ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు ఉపాధి లేక కూలీలుగా మారారు. లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన స్టూడియోలు కస్టమర్లు లేక వెలవెల బోతున్నాయి. మ్యారేజ్, బర్త్ డే వంటి సెలెబ్రేషన్స్ కు ఇవాళ ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లనే వాడుతున్నారు. ఇదివరకు పాస్ ఫొటోల కోసం అయినా స్టూడియోకి వెళ్లేవాళ్లు. ప్రస్తుతం అంతా ఆన్ లైన్ అవ్వడంతో.. పాస్ ఫోటో అవసరం తగ్గిపోయింది. ఒకప్పుడు బ్లాక్  అండ్  వైట్  ఫొటోకే యమ క్రేజ్ ఉండేది. కానీ, ఇప్పుడు పెరిగిన టెక్నాలజీతో ఫొటోకు వ్యాల్యూ  లేకుండా పోయింది. దీంతో చాలా మందికి స్టూడియోలకు అద్దె కట్టలేని పరిస్థితి ఏర్పడింది.

ఆదుకోవాలంటూ ఫోటోగ్రాఫర్ల విన్నపం

రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో పని చేస్తున్న ఫోటో గ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలంటూ ఫోటోగ్రాఫర్లు కోరుతున్నారు. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. లోన్లు ఇచ్చి ఆర్ధికంగా ఆదుకోవాలని ఫోటోగ్రాఫర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అనుభవం లేనివాళ్లు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లుగా చలామణి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన వాళ్లకే ప్రభుత్వ పథకాలు అందించాలని ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కోరుతున్నారు.