బీఆర్ఎస్ బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ నేతల ప్రయత్నాలు

బీఆర్ఎస్ బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ నేతల ప్రయత్నాలు
  • ప్రగతి భవన్, తెలంగాణ భవన్ నుంచి పిలుపు
  • బీఆర్ఎస్ విస్తరణ బాధ్యత తీసుకోవాలని సూచన
  • సూరత్, బిలాస్ పూర్, షోలాపూర్, భివండీపై ఫోకస్​

హైదరాబాద్, వెలుగు: ఇతర రాష్ట్రాల్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణ వారు ఏ రాష్ట్రంలో.. ఏఏ సిటీలో ఎక్కువగా ఉన్నారు.. అక్కడి జనాన్ని ప్రభావితం చేసే వారు ఎవరున్నారు అని ఆరా తీస్తున్నారు. ఇక్కడ వారి మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని ఆ ప్రాంత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వారిని పిలిపించే బాధ్యతలను అప్పగిస్తున్నారు. కులాల వారీగా కూడా టీఆర్ఎస్ లీడర్లతో ఫోన్ లు చేయిస్తున్నారు. చేనేత, గౌడ కులాల వారు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో, సిటీల్లో బాగా స్థిరపడ్డారు. అక్కడి జనంలో వీరికి మంచి పట్టు ఉండడంతో వారి మద్దతును కూడగడుతున్నారు. అలాంటి వారికి హైదరాబాద్ రావాల్సిందిగా తెలంగాణ భవన్, ప్రగతి భవన్ నుంచి కాల్స్ చేస్తున్నారు. వారి కోసం విమాన టికెట్లు, స్టార్ హోటళ్లు బుక్ చేస్తున్నారు. రెండు మూడు రోజులు వీఐపీ మర్యాదలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు సమావేశమై బీఆర్ఎస్ బలోపేతం కోసం వారి రాష్ట్రాల్లో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలో దిశానిర్దేశం చేస్తున్నారు.

కటౌట్​లు కట్టండి, మీటింగ్​లు పెట్టండి 

ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వారికి తమతమ సిటీలలో బీఆర్ఎస్, కేసీఆర్ పేరుతో భారీ హోర్డింగ్ లు, కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, లోకల్ లీడర్లను బీఆర్ఎస్ లో చేర్పించడం, చిన్న, చిన్న మీటింగ్ లు పెట్టడం వంటి బాధ్యతలు అప్పగిస్తున్నారు. అక్కడ పార్టీ కోసం ఏ ప్రోగ్రామ్ చేసినా దానికి సంబంధించిన ఖర్చంతా చూసుకుంటామనే భరోసా ఇస్తున్నారు. అక్కడి జనాలను ప్రభావితం చేసే లోకల్ లీడర్లను పార్టీలో చేర్పిస్తే.. మంచి ఆఫర్ ఉంటుందని కూడా హామీ ఇస్తున్నారు. పిలవగానే వచ్చినందకు వారికి నజరానాలు ఇచ్చి పంపిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో ఆయా ప్రాంతాల్లో మంచి ఊపు వచ్చేలా పని చేయండి, ఆ తర్వాత ఇక్కడి నుంచి ముఖ్య నేతలు వచ్చి మీటింగ్ లు పెడ్తారని బీఆర్ఎస్ విస్తరణ బాధ్యతలను అప్పగిస్తున్నారు.

ఈ ప్రాంతాలపై ఫోకస్

గుజరాత్ లోని సూరత్, ఛత్తీస్​గఢ్ లోని బిలాస్ పూర్, మహారాష్ట్రలోని భివండీ, షోలాపూర్ లలో ఉంటున్న తెలంగాణ వారు ఇక్కడికి వచ్చి, టీఆర్ఎస్ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోని తెలంగాణ వారిపై కూడా టీఆర్ఎస్ నేతలు ఫోకస్ పెట్టారు. అయితే ఈ రాష్ట్రాల్లో తెలంగాణ వారు చాలా తక్కువగా ఉండడం, పైగా ఆంధ్ర ప్రాంతం వారు అక్కడ బాగా ప్రభావితం చేసే స్థాయిలో ఉండడంతో టీఆర్ఎస్ నేతలు వారితో మంతనాలు జరుపుతున్నారు. దక్షిణ భారత్ లో బీఆర్ఎస్ ను బలోపేతం చేసి, ఆ తర్వాత నార్త్ స్టేట్ లపై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ద్వారా మహారాష్ట్రలో సిక్కులు ఎక్కువగా ఉన్న నాందేడ్ లో బీఆర్ఎస్ విస్తరణపై దృష్టి పెట్టారు.