దేశంలో ఓటర్ల సంఖ్యను వెల్లడించిన ఎలక్షన్ కమిషన్

దేశంలో ఓటర్ల సంఖ్యను వెల్లడించిన ఎలక్షన్ కమిషన్
  • 2019 లోక్​సభ ఎన్నికల్లో ఓటు వెయ్యనోళ్లు 30 కోట్లు

దేశంలో ఓటర్ల సంఖ్యను ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి 94,50,25,694 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. ఇది 1951తో పోలిస్తే ఆరు రెట్లు ఎక్కువని పేర్కొంది.

న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది జనవరి 1 నాటి మొత్తం ఓటర్ల సంఖ్య 94,50,25,694కు చేరింది. 1951తో పోలిస్తే ఇది ఆరు రెట్లు ఎక్కువ పెరిగింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951లో జరిగిన తొలి జనరల్​ఎలక్షన్ల కోసం సిద్ధం చేసిన లిస్టుల ప్రకారం రిజిస్టర్​ అయిన ఓటర్ల సంఖ్య 17.32 కోట్లు. అయితే వీరిలో 45.67 శాతం మంది మాత్రమే అప్పట్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1957 రెండో జనరల్ ఎలక్షన్ల నాటికి ఓటర్ల సంఖ్య 19.37 కోట్లకు చేరగా.. 47.74 శాతం మంది ఓటు వేశారు. 1962లో తొలిసారిగా పోలింగ్​ శాతం 55.42గా నమోదైంది. ఆ ఎన్నికల్లో రిజిస్టర్​ అయిన ఓటర్ల సంఖ్య 21.64 కోట్లు. 2009 నాటికి రిజిస్టర్డ్​ ఓటర్ల సంఖ్య 71.7 కోట్ల మార్కును చేరుకుంది. వీరిలో 58.21 శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1962తో పోలిస్తే పోలింగ్​ శాతం పెరుగుదల చాలా తక్కువే. 2014 జనరల్​ ఎలక్షన్ల నాటికి మొత్తం ఓటర్ల సంఖ్య 83.4 కోట్లకు చేరితే ఓటు వేసిన వారి శాతం 66.44గా నమోదైంది. 2019 జనరల్​ ఎలక్షన్ల సమయంలో 91.2 కోట్ల మంది ఓటు హక్కు కోసం రిజిస్టర్​చేసుకోగా.. 67.4 శాతం పోలింగ్​ నమోదైంది. 

ఓట్లేయని వారిని రప్పించుడే అసలు టాస్క్

1951 తర్వాత ఓటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పటికీ లోక్​సభ ఎన్నికల్లో ఓటింగ్​కు దూరంగా ఉంటున్న వారు మూడోవంతు మంది ఉంటున్నారు. 2019 లోక్​సభ ఎన్నికల సమయంలో 75 శాతం పోలింగ్​ శాతం సాధించేందుకు ఈసీ ప్రయత్నాలు చేసినా.. 30 కోట్ల మంది పోలింగ్​ బూత్​లకు దూరంగానే ఉన్నారు. ఓటింగ్​కు దూరంగా ఉన్న వారిలో ఎక్కువగా అర్బన్​ జనాలు, యువత, వలస కార్మికులే. ఇటీవల పూర్తయిన హిమాచల్ ప్రదేశ్, గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్​ జనాలు ఓటింగ్​కు దూరంగా ఉన్నట్టు ఈసీ వెల్లడించింది. వివిధ కారణాల వల్ల ఎన్నికల టైంలో వలస కార్మికులు సొంతూర్లకు వెళ్లడానికి వీలు కావడం లేదు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే ఇటీవల రిమోట్​ ఓటింగ్​ టెక్నాలజీని ప్రతిపాదించింది. ఈ ఏడాది అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్​సభ ఎన్నికలు ఉన్నందున ఓటింగ్​ పర్సంటేజ్​ను పెంచేందుకు ఈసీ కొత్త స్ట్రాటజీలను సిద్ధం చేస్తోంది.