ఆస్ట్రేలియాతో టీ20 సమరానికి సై.. సూర్య గాడిలో పడేనా..?

ఆస్ట్రేలియాతో టీ20 సమరానికి సై.. సూర్య గాడిలో పడేనా..?

కాన్‌‌‌‌‌‌‌‌బెర్రా: ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ చేజార్చుకున్న టీమిండియా.. ఇప్పుడు టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో నేడు ఇరుజట్ల మధ్య తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ జరగనుంది. ఇండియా, శ్రీలంక ఆతిథ్యమిచ్చే టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌కు మూడు నెలల సమయమే మిగిలి ఉంది. అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో మెగా టోర్నీకి సరైన టీమ్‌‌‌‌‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌ను రూపొందించుకోవడానికి ఇండియాకు 15 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లే మిగిలి ఉన్నాయి.

దాంతో అన్ని రంగాల్లో బలంగా ఉన్న ఆసీస్‌‌‌‌‌‌‌‌తో జరిగే ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ నుంచి మెగా టోర్నీకి ప్రిపరేషన్స్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఇరు జట్లు తమ చివరి 10 టీ20ల్లో చెరో ఎనిమిది విజయాలు సాధించాయి.  కాబట్టి ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లోనూ రెండు జట్ల మధ్య పోటీ సమతూకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఇండియా సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌తో ఐదేసి టీ20లు ఆడనుంది. అప్పటి వరకు వరల్డ్‌‌ కప్‌‌కు వెళ్లే పూర్తి జట్టును ఎంచుకోవాలని హెడ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ గౌతమ్‌‌‌‌‌‌‌‌ గంభీర్‌‌‌‌‌‌‌‌, మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆసీస్‌‌తో తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనే ఇండియా పూర్తి స్థాయి బలగాన్ని బరిలోకి దించనుంది. 

పేస్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌పై దృష్టి

ఆసియా కప్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో అద్భుతంగా ఆడిన ఇండియా జట్టులో కొన్ని మార్పులు చేసే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. బలమైన స్పిన్‌‌‌‌‌‌‌‌కు తోడు పేస్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను కూడా బలోపేతం చేయాలని మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బుమ్రా, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌కు తోడు మూడో పేసర్‌‌‌‌‌‌‌‌గా హర్షిత్‌‌‌‌‌‌‌‌ రాణాకు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వొచ్చు. ఇదే జరిగితే శివమ్‌‌‌‌‌‌‌‌ దూబే బెంచ్‌‌‌‌‌‌‌‌కు పరిమితం కానున్నాడు. తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న నితీశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ కూడా ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ సాధించాడు. 

ఒకవేళ సీమ్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ లోటును భర్తీ చేయాలంటే నితీశ్‌‌‌‌‌‌‌‌ ఎంపికను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తే అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌కు తోడుగా కుల్దీప్‌‌‌‌‌‌‌‌, వరుణ్‌‌‌‌‌‌‌‌ చక్రవర్తిలో ఒకరికే చాన్స్‌‌‌‌‌‌‌‌ దక్కనుంది. ఇక బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు తిరుగులేదు. కానీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ సూర్య ఫామ్‌‌‌‌‌‌‌‌ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. గత 14 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో అతను ఒక్క హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ కూడా చేయలేదు. మెగా టోర్నీకి టైమ్‌‌‌‌‌‌‌‌ దగ్గరపడుతుండటంతో అతను ఫామ్‌‌‌‌‌‌‌‌లోకి రావడం అత్యవసరం. 

2023లో సూర్య 18 ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో 156 స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌తో 733 రన్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఐదు హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీలు ఉన్నాయి. 2024లో 151 స్ట్రయిక్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌తో 450 రన్స్‌‌‌‌‌‌‌‌ సాధించాడు. కానీ 2025కు వచ్చేసరికి ఇది బాగా పడిపోయింది. 10 ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో సగటున 11 రన్స్‌‌‌‌‌‌‌‌తో వంద పరుగులు మాత్రమే చేయగలిగాడు. 

అయినా కోచ్‌‌‌‌‌‌‌‌ గంభీర్‌‌‌‌ అతనిపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. ఇక కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా ఇప్పటి వరకు ఆడిన 29 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో 23 విజయాలుసాధించాడు. మిగతా లైనప్‌‌‌‌‌‌‌‌లో అభిషేక్‌‌‌‌‌‌‌‌, గిల్‌‌‌‌‌‌‌‌, తిలక్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో శాంసన్‌‌‌‌‌‌‌‌ మెరిస్తే రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌పై ఫినిషింగ్‌‌‌‌‌‌‌‌ బాధ్యత కాస్త తగ్గుతుంది. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌గా అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ తన పాత్ర సమర్థంగా పోషిస్తున్నాడు.  

షార్ట్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌.. ఇంగ్లిస్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌

రెండో వన్డేలో వేలికి తగిలిన గాయానికి సర్జరీ చేయించుకున్న మాథ్యూ షార్ట్‌‌‌‌‌‌‌‌ను ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పించారు. కాలిపిక్క నొప్పి కారణంగా కివీస్‌‌‌‌‌‌‌‌తో సిరీస్‌‌‌‌‌‌‌‌కు దూరమైన జోష్ ఇంగ్లిస్‌‌‌‌‌‌‌‌ను జట్టులోకి తీసుకున్నారు. కాబట్టి ఆసీస్‌‌‌‌‌‌‌‌ లైనప్‌‌‌‌‌‌‌‌ కూడా బలంగానే కనిపిస్తోంది. ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌లో మార్ష్‌‌‌‌‌‌‌‌, హెడ్‌‌‌‌‌‌‌‌కు తిరుగులేదు. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో మ్యాక్స్‌‌‌‌‌‌‌‌వెల్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో టిమ్‌‌‌‌‌‌‌‌ డేవిడ్‌‌‌‌‌‌‌‌, జోష్‌‌‌‌‌‌‌‌ ఫిలిప్‌‌‌‌‌‌‌‌పై భారం పడనుంది.

అడిలైడ్‌‌‌‌‌‌‌‌లో ఇండియాపై మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడిన కొత్త కుర్రాడు. ఓవెన్‌‌‌‌‌‌‌‌పై అందరి దృష్టి నెలకొంది. సీమ్‌‌‌‌‌‌‌‌ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌గా, ఫినిషర్‌‌‌‌‌‌‌‌గా స్టోయినిస్‌‌‌‌‌‌‌‌ పాత్ర కీలకం కానుంది. స్పిన్‌‌‌‌‌‌‌‌ కంటే పేస్‌‌‌‌‌‌‌‌పైనే కంగారూలు ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. ఏకైక స్పిన్నర్‌‌‌‌‌‌‌‌గా కునెమన్‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. పేసర్లుగా హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌, ఎలిస్‌‌‌‌‌‌‌‌, బార్ట్‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌ను బరిలోకి దించనున్నారు. 

పిచ్‌‌‌‌‌‌‌‌, వాతావరణం

కాన్‌‌‌‌‌‌‌‌బెర్రాలో వాతావరణం చల్లగా ఉంది. పగటిపూట చిరుజల్లులు పడే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నా సాయంత్రానికి ఎలాంటి వర్షం ఉండకపోవచ్చు. పూర్తి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ జరిగే అవకాశం ఉంది. మెన్స్‌‌‌‌‌‌‌‌ టీ20, బీబీఎల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో స్పిన్‌‌‌‌‌‌‌‌ కీలక పాత్ర పోషించింది. మనుకా ఓవల్‌‌‌‌‌‌‌‌ బౌండ్రీ లైన్‌‌‌‌‌‌‌‌ పెద్దగా ఉండటంతో లో స్కోర్లు నమోదవుతున్నాయి. 

జట్లు (అంచనా):

ఇండియా: సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), అభిషేక్‌‌‌‌‌‌‌‌ శర్మ, శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌, తిలక్‌‌‌‌‌‌‌‌ వర్మ, సంజూ శాంసన్‌‌‌‌‌‌‌‌, రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌, శివమ్‌‌‌‌‌‌‌‌ దూబే / హర్షిత్‌‌‌‌‌‌‌‌ రాణా, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ / వరుణ్‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి, అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా. 


ఆస్ట్రేలియా: మిచెల్‌‌‌‌‌‌‌‌ మార్ష్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), ట్రావిస్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌, జోష్‌‌‌‌‌‌‌‌ ఇంగ్లిస్‌‌‌‌‌‌‌‌, టిమ్‌‌‌‌‌‌‌‌ డేవిడ్‌‌‌‌‌‌‌‌, జోష్‌‌‌‌‌‌‌‌ ఫిలిప్, మిచ్‌‌‌‌‌‌‌‌ ఓవెన్‌‌‌‌‌‌‌‌, మార్కస్‌‌‌‌‌‌‌‌ స్టోయినిస్‌‌‌‌‌‌‌‌, సీన్‌‌‌‌‌‌‌‌ అబాట్‌‌‌‌‌‌‌‌ / జేవియర్‌‌‌‌‌‌‌‌ బార్ట్‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌, నేథన్‌‌‌‌‌‌‌‌ ఎలిస్‌‌‌‌‌‌‌‌, మ్యాట్‌‌‌‌‌‌‌‌ కునెమన్‌‌‌‌‌‌‌‌, జోష్‌‌‌‌‌‌‌‌ హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌.