బ్లాక్​ పగోడా నిర్మాణ శైలి

బ్లాక్​ పగోడా నిర్మాణ శైలి

దేశంలో మొదటిసారిగా దేవాలయాలను ఇక్ష్వాకులు కృష్ణా నది ఒడ్డున వీరాపురంలో నిర్మించారు. ఉత్తర భారతదేశంలో మొదటి దేవాలయాల నిర్మాణాన్ని గుప్తులు చేపట్టారు. వీరు తొలి దశలో ఆలయ నిర్మాణానికి రాతిని ఉపయోగించగా మలిదశ నాటికి రాతితోపాటు ఇటుకనూ ఉపయోగించారు. గుప్తుల కాలంలో దేవాలయ నిర్మాణాలు, వాస్తుశైలి అత్యున్నత శిఖరాలను చేరింది. కాబట్టి భారత వాస్తు చరిత్రలో గుప్తుల కాలంలో నూతన శకం ప్రారంభమైంది. 

మొదటి దశ : ఎలాంటి గోపురాలు లేని సమతల పైకప్పు దేవాలయాలు, చతురస్రాకార దేవాలయాలు, బోలుగా ఉన్న స్తంభాలతో గల ప్రవేశ ద్వారాలు, తక్కువ ఎత్తుగల వేదికపై నిర్మాణం వంటివి నిర్మించారు. 

రెండోదశ : మొదటి దశలోని సమతల పైకప్పు, చతురస్రాకారం వంటి లక్షణాలను రెండో దశలోను కొనసాగించారు. మొదటి దశ బోలుగా ఉన్న స్తంభాలతో ప్రవేశ ద్వారాలు నిర్మిస్తే రెండో దశలో నిండైన శిలాస్తంభాలతో ప్రవేశ ద్వారాలు నిర్మించారు. మొదటి దశలో తక్కువ ఎత్తు గల వేదికలపై దేవాలయాలను నిర్మిస్తే రెండో దశలో ఎత్తైన వేదికలపై ఆలయాలను నిర్మించారు. ఈ దశలో గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ కోసం స్థలాన్ని వదిలి మందిరాన్ని నిర్మించారు. రెండంతస్తుల దేవాలయాలను సైతం రెండో దశలో నిర్మించారు. 

మూడో దశ : రెండో దశలోని నిర్మాణ రీతులను కొనసాగిస్తూనే కొన్ని నూతన పద్ధతులను ప్రవేశపెట్టారు. నూతన పద్ధతులు 1. పైకప్పులకు శిఖరాలను నిర్మించారు. 2. పంచాయతన శైలిని ప్రారంభించారు. పై కారణాల వల్లనే మూడో దశ నుంచి నగర శైలి/ శిఖర శైలి ప్రారంభమైందని అనేక మంది చరిత్రకారులు పేర్కొంటారు. ఉత్తర్​ప్రదేశ్​లోని ఖాన్​పూర్​ వద్ద భితర్​గావ్​లోని టెర్రాకోట ఇటుకలతో నిర్మించిన దేశాలయం ఈ దశకు చెందింది.

నాలుగో దశ : ఈ శైలిలో పూర్వ లక్షణాలకు కొత్తగా దీర్ఘచతురస్రాకార మందిర నిర్మాణాన్ని చేపట్టారు. 

ఐదోదశ : ఈ దశలో వృత్తాకార ఆలయాలను నిర్మించారు. 

పంచాయతన శైలి : దేవాలయ ప్రాంగణంలోని ముఖ్య దేవునితోపాటు మరో నలుగురు దేవతలకు మందిరాలను నిర్మించడం మొదలు పెట్టారు. ముఖ్యదేవుని గర్భగుడిని భారీ పరిమాణంలోను, మిగిలినవి తక్కువ పరిమాణంలో నిర్మించారు. 

నగర శైలి వాస్తు నిర్మాణం 

పంచాయతన శైలిని ఉపయోగించారు. చతురస్ర, దీర్ఘచతురస్రాకార ఆలయాలను నిర్మించారు. ఈ శైలిలో ఆలయ ప్రాంగణాల్లో కోనేరును నిర్మించలేదు. ఆలయ గోడలను నిలువుగా మూడు భాగాలుగా విభజించారు. వీటిని రథా అని పిలిచేవారు. త్రిరథ అనే మూడు భాగాల్లో వివిధ శిల్పాలు రూపొందించేవారు. తర్వాతి కాలంలో త్రిరథ అనేది పంచరథ, సప్తరథ, నవరథ అనే విధంగా విస్తరించింది. ఈ శైలి ఉత్తర, మధ్య భారతదేశంలో అత్యధిక ప్రాచుర్యం పొందింది. నగర శైలి నుంచి మూడు ఉపశైలులు ప్రారంభమయ్యాయి. అవి.. 1. ఒడిశా శైలి 2. ఖజురహో శైలి 3. సోలంకి శైలి

ఒడిశా శైలి : ఈ శైలి క్రీ.శ. 8వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు విలసిల్లింది. శిఖశైలిని ఒరిస్సాలో దియోల్​ అంటారు.  చుట్టూ గోడలకు బయటి వైపున సుందరమైన ఆడంబర నమూనాలతో అలంకరించి, లోపలి వైపు మాత్రం అలంకరణ లేకుండా నిర్మించారు. స్తంభాల స్థానంలో ఇనుపకడ్డీలను వినియోగించారు. ఒడిశా శైలిలో గర్భగుడిపై నిర్మాణం క్రమంగా సన్నబడుతూ వెళ్లి చివరకు లోపలివైపునకు వంగి ఉంటుంది. మండపాలను జగమోహన అంటారు.  

ఖజురహో శైలి : ఈ ఆలయాలను చందేళ రాజులు నిర్మించారు. చందేళ దేవాలయాల ప్రవేశ ద్వారం వద్ద ఉన్న మిథున శిల్పాలు మంగళ ప్రదమైనవిగా భావిస్తారు. వీటి చుట్టూ ఉన్న గోడలకు లోపలి వైపు, బయట వైపు ఆడంబర, గజిబిజి చిత్రలేఖనాలు అనేకం చిత్రించారు. ఈ ఆలయాలపై గల శిల్పాలకు స్ఫూర్తి కామసూత్ర గ్రంథం. వీటికి ప్రహరీలు లేవు. ఈ ఆలయాల కింద గర్భగృహం, సమావేశ మందిరం, స్తంభాలతో కూడిన వరండాతప్పకుండా కలిగి ఉంటాయి. ప్రధాన ఆలయానికి అనుబంధంగా నిర్మించిన ఆలయాల్లోను శిఖరాలు ఉండటంతో మొత్తం ఆలయాల ప్రాంగణ పర్వత శ్రేణిని తలపిస్తుంది. ఈ ఆలయాల వేదిక సాపేక్షంగా ఉండి ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయాలు అందమైన శిల్పాలకు ప్రసిద్ధిగాంచాయి. 

ద్రావిడ వాస్తుశైలి: ఈ శైలి పల్లవులతో ప్రారంభించినప్పటికి చోళుల కాలంలో మరింత శోభాయమానంగా విరాజిల్లింది. దేవాలయ అగ్రభాగంలో శిఖరం/ విమానం ఏర్పాటు ఉంటుంది. ఇది అష్టముఖి ఆకారంలో ఉండి నగర నిర్మాణ శైలిలోని కలశానికి సరిసమానమైంది. ద్రావిడ శైలిలో గర్భగృహ ద్వారానికి ఇరువైపుల దేవాలయ రక్షణగా ద్వారపాలకుల ఏడు శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఇదే నగర శైలిలో గర్భగృహ ద్వారానికి ఇరువైపుల మిథున, గంగాదేవి, యమునల ప్రతిమలు చెక్కి ఉంటాయి. ద్రావిడ శైలిలో ఒకే ఒక విమానం ఉంటే నగర శైలిలో బహుళ సంఖ్యలో శిఖరాలు ఉంటాయి. భూతల ప్రణాళిక, ఎత్తయిన వేదిక ఉంటుంది. 

గాంధార శిల్పకళ 

క్రీ.పూ. 1–2 శతాబ్దంలో ఇండో– గ్రీకులు పరిపాలనలో ఉన్నప్పుడు గాంధార శిల్పకళ ఆవిర్భవించగా శకులు, కుషానులు ఎక్కువగా పోషించారు. ఇది వాయవ్య భారతదేశంలో ముఖ్యంగా పెషావర్​ చుట్టూ కనిపించిన శిల్పకళ. గ్రీకు, భారతీయ, రోమ్​ శిల్పకళారీతుల సమ్మేళనమే గాంధార శిల్ప కళా శైలి. కాబట్టి దీన్ని ఇండో – గ్రీకు శిల్ప కళ అంటారు. ఈ శైలిలో బుద్ధుని విగ్రహాలు, బుద్ధుని జీవితానికి సంబంధించిన ముఖ్య ఘట్టాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ శైలి మొదటి దశలో గ్రీకు ప్రభావాన్ని, చివరిదశలో రోమన్​ ప్రభావాన్ని గమనించవచ్చు. ఇది మహాయాన బౌద్ధమత అభివృద్ధికి పాటుపడింది. 

లక్షణాలు: ఈ శిల్పకళ బౌద్ధ మతానికి మాత్రమే సంబంధించింది. ఇందులో విస్తారంగా నల్లరాయి వినియోగించారు. గాంధార శిల్పంలో బుద్ధుని ముఖ్య లక్షణాల్లో గ్రీకు ప్రభావం ప్రధానంగా కనిపిస్తుంది. బుద్ధుని జన్మ, బోధనలు, జ్ఞానోదయ అంశాలు ఉంటాయి. ఈ శైలిలో మలచిన బోధిసత్వుని విగ్రహాల్లో ప్రధానమైంది బోధిసత్వమైత్రేయ, బోధిసత్వ అవలోకితేశ్వర, బోధఙసత్వ పద్మపాణి, ఇందులో ఆధ్యాత్మికత కంటే శారీరక సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. గ్రీకుల పల్చటి వస్త్రధారణ, రోమన్ల ఉంగరాల జుట్టు ప్రత్యేకతలు. సిగముడి, బరువైన కనురెప్పలు, త్రిముఖ భంగిమలు, నైష్పత్తిక కొలతలు దరహాస వదనం ఇతర ముఖ్య లక్షణాలు. 

మధుర శిల్పకళః

కుషాణు యుగంలో తూర్పు భారతదేశంలో దేశీయ రీతుల్లో వర్ధిల్లిన శిల్పకళా రీతి మధుర శిల్పకళ. ఇందులో బుద్ధుణ్ని భారతీయత ఉట్టిపడేలా చిత్రీకరించారు. ఇది దేశంలోని క్రీ.పూ. 1వ శతాబ్దంలో గంగా – యమున మైదాన ప్రాంతంలోని మధుర వద్ద అభివృద్ధి చెందింది. 

లక్షణాలు : మధుర కళలో బుద్ధునితోపాటు భారతీయ దేవతలను విగ్రహాలుగా మలిచారు. బ్రాహ్మణ మతదైవమైన శివుణ్ని లింగరూపంలోనూ అర్థనారీశ్వరుడిగాను, పార్వతీ సమేతుడుగాను మలిచారు. విష్ణు దేవుడిని లక్ష్మీ సమేతుడుగా మలిచారు. స్త్రీ దేవతలను అత్యంత సుందరంగా మలచడం మధుర శిల్పకళారీతిలో ఒక విశిష్ట అంశం. మత అంశాలతోపాటు లౌకిక అంశాలూ చోటుచేసుకున్నాయి. యక్షిణులు, సాలభంజికలు, అప్సరలు, నాగినులు ప్రత్యేకతను సంతరించుకున్నవి. శిల్పానికి ఎర్రని ఇసుకరాయిని విస్తృతంగా వినియోగించారు. శారీరక సౌందర్యం కంటే ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇచ్చారు.