నాడు తొలి మహిళా సీజే.. నేడు తొలి మహిళా ప్రధాని.. నేపాల్ ప్రధానిగా సుశీల కర్కీ

నాడు తొలి మహిళా సీజే.. నేడు తొలి మహిళా ప్రధాని.. నేపాల్ ప్రధానిగా సుశీల కర్కీ
  • ప్రెసిడెంట్ పౌడేల్ సమక్షంలో ప్రమాణం 
  • దేశ తొలి మహిళా ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ సీజే రికార్డ్  
  • బాధ్యతలు చేపట్టిన వెంటనే కేబినెట్ భేటీ 
  • 2026 మార్చి 4న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం
  • ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం

ఖాట్మండు: నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ (73) ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం (సెప్టెంబర్ 12) రాత్రి 9.30‌‌ గంటలకు ఖాట్మండులో ఆమె చేత ప్రెసిడెంట్ రామచంద్ర పౌడేల్ తన అధికార నివాసంలో ప్రమాణం చేయించారు. ఆ వెంటనే ఆమె దేశ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో నేపాల్​కు తొలి మహిళా ప్రధానిగా ఆమె చరిత్ర సృష్టించారు. 

బాధ్యతలు చేపట్టిన వెంటనే కర్కీ తొలి కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. 2026 మార్చి 4న పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. వచ్చే ఆరు నెలలోపు ఎన్నికలు నిర్వహించడానికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. అలాగే దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎమర్జెన్సీ విధించే అంశాన్నీ కర్కీ పరిశీలించవచ్చని భావిస్తున్నారు. 

సుశీల కర్కీ కేబినెట్ ప్రతిపాదనకు ప్రెసిడెంట్ ఆమోదం తెలిపిన వెంటనే దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అమలులోకి రానుంది. కాగా, జెన్ జెడ్ తిరుగుబాటు నేపథ్యంలో మూడు రోజుల కిందట ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. తాత్కాలిక ప్రధాని పదవికి సుశీల కర్కీతోపాటు పలువురి పేర్లు వినిపించగా, గురు, శుక్రవారాల్లో రెండు దఫాలుగా జెన్ జెడ్ ప్రతినిధులతో ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్, ప్రెసిడెంట్ పౌడేల్ చర్చలు జరిపారు. శుక్రవారం రాత్రికి ఏకాభిప్రాయం రావడంతో సుశీల కర్కీని తాత్కాలిక ప్రధానిగా నియమించేందుకు ప్రెసిడెంట్ పౌడేల్ ఆమోదం తెలిపారు.

రెండు రోజుల సస్పెన్స్ కు తెర.. 

నేపాల్​లో గత ప్రధాని కేపీ శర్మ ఓలీ సర్కారు సోషల్ మీడియాపై నిషేధం విధించడంతో జెనరేషన్ జెడ్ యువత మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున ఆందోళనలు షురూ చేసింది. రాత్రికల్లా ఓలీ సర్కారు దిగొచ్చి, బ్యాన్ ను ఎత్తేసినా, ఓలీ రాజీనామా చేసినా యువత ఆగ్రహం చల్లారలేదు. పార్లమెంట్ ను రద్దు చేయాల్సిందేనంటూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రధాని, మాజీ ప్రధానులు, ప్రెసిడెంట్, మంత్రుల ఇండ్లను తగులబెట్టారు. పార్లమెంట్, సుప్రీంకోర్ట్ భవనాలకు సైతం నిప్పుపెట్టారు. 

ఈ ఆందోళనల సందర్భంగా పోలీసు కాల్పులు, నిరసనకారుల దాడుల్లో మొత్తం 51 మంది మృతిచెందారు. వందలాది మంది గాయపడ్డారు. దీంతో బుధవారం రాత్రి రంగంలోకి దిగిన ఆర్మీ.. గురువారం పరిస్థితిని కంట్రోల్ చేసింది. గురు, శుక్రవారాల్లో రెండు దఫాలుగా జెనరేషన్ జెడ్ ప్రతినిధులతో చర్చలు జరిపి చివరకు దేశ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ బాధ్యతలు చేపట్టేందుకు ఆమోదం తెలపడంతో రెండు రోజుల సస్పెన్స్ కు తెరపడినట్టయింది. అయితే, పార్లమెంట్ ను రద్దు చేయాలని, తాజా ఎన్నికలు నిర్వహించాలని జెన్ జెడ్ ప్రతినిధులు ఈ సందర్భంగా తేల్చిచెప్పారు. 

ఏపీ టూరిస్టుల బస్సుపై అటాక్ 

నేపాల్​లో ఆందోళనల సందర్భంగా ఏపీ టూరిస్టుల బస్సుపై దాడి జరిగింది. గురువారం ఉదయం ఖాట్మండులోని పశుపతినాథ్​ టెంపుల్ దర్శనానికి వెళ్లి వస్తుండగా తమ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు, కర్రలతో దాడి చేసి, అద్దాలను పగలగొట్టారని, తమ వద్ద ఉన్న బ్యాగులు, సెల్ ఫోన్ల వంటివి దోచుకున్నారని ఏపీ టూరిస్టులు తెలిపారు. నేపాల్ ఆర్మీ జవాన్లు వచ్చి తమను కాపాడారని తమ భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. 

భారత ఎంబసీ సాయంతో టూరిస్టులంతా ఇండియాకు తిరిగి వచ్చారు. దాడికి గురైన బస్సు కూడా సాయంత్రంకల్లా సోనౌలీ బార్డర్ గుండా యూపీలోని మహరాజ్ గంజ్ జిల్లాలోకి చేరుకుంది. కాగా, ఏపీకి చెందిన టూరిస్టులు సుమారు 150 మంది ఇదివరకే నేపాల్ నుంచి తిరిగి వచ్చారు. ఇతర ఇండియన్ టూరిస్టులంతా విడతల వారీగా స్పెషల్ ఫ్లైట్లలో తిరిగి వస్తున్నారు. మరోవైపు, నేపాల్ బార్డర్ లో సశస్త్ర సీమా బల్ దళాలు ముమ్మరంగా గస్తీ కాస్తున్నాయి. బార్డర్ నుంచి భారతీయులను ఇటు, నేపాల్ పౌరులను అటు మాత్రమే అనుమతిస్తున్నారు. 

నాడు తొలి మహిళా సీజే.. నేడు తొలి మహిళా ప్రధాని

సుశీల కర్కీ నేపాల్​లోని బిరట్ నగర్ లో 1952 జూన్ 7న జన్మించారు. వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో 1975లో పొలిటికల్ సైన్స్​లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. తర్వాత 1978లో ఖాట్మండులోని త్రిభువన్ యూనివర్సిటీలో లా చదివి న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. 2016 జులైలో సుప్రీంకోర్టు చీఫ్​ జస్టిస్​గా నియమితులై నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా హిస్టరీ క్రియేట్ చేశారు. పోలీస్ నియామకాల్లో రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పడంతో ఆమె 2017 ఏప్రిల్​లో అభిశంసన ఎదుర్కొన్నారు. 

దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో సర్కారు అభిశంసన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంది. తర్వాత 2017 జూన్ 6న ఆమె చీఫ్ జస్టిస్​గా రిటైర్ అయ్యారు. భర్త రాజకీయాల్లో నేపాలీ కాంగ్రెస్ లీడర్​గా ఉన్నా.. కర్కీ రాజకీయాలకు, అవినీతికి  దూరంగా ఉంటారని పేరు పొందారు. జెండర్ ఈక్వాలిటీపై ఆమె ఓ బుక్ రాశారు. 2004లో సంభవ్ కానూన్ పురస్కారం అందుకున్నారు. తాజాగా నేపాల్ తొలి మహిళా ప్రధానిగా ప్రమాణం చేసి చరిత్ర సృష్టించారు.

మూడ్రోజుల తర్వాత నేపాల్ ప్రశాంతం 

నేపాల్ లో మూడు రోజుల తర్వాత శుక్రవారం ప్రశాంత వాతావరణం నెలకొంది. ఖాట్మండులో ఆర్మీ బలగాలు గస్తీ కొనసాగించాయి. సిటీలోకి ఎంటరయ్యే ప్రతి వాహనాన్ని తనిఖీ చేశాయి. రాజధానిలో శుక్రవారం షాపులు తిరిగి ఓపెన్ అయ్యాయి. ఆందోళనల సందర్భంగా ధ్వంసమైన భవనాలు, వాహనాల శకలాలు, రోడ్లపై తగలబెట్టిన వస్తువుల తొలగింపును పౌర సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభించారు. అయితే, పోలీసుల కాల్పుల్లో చనిపోయిన ఆందోళనకారుల కుటుంబసభ్యులు, బంధువులు శుక్రవారం ఖాట్మండులోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు.  

హోటల్ ఇండస్ట్రీకి రూ. 2,500 కోట్ల నష్టం

అల్లర్ల కారణంగా నేపాల్ లో ప్రధాన ఆదాయ మార్గమైన టూరిజం, హోటల్ ఇండస్ట్రీ బిజినెస్ 50 శాతం పడిపోయింది. బియ్యం, కూరగాయలు, వంట నూనెల వంటి వాటి ధరలు అమాంతం పెరిగాయి. జెన్ జెడ్ నిరసనల వల్ల నేపాల్ హోటల్ ఇండస్ట్రీకి దాదాపు రూ. 2,500 కోట్ల మేరకు నష్టాలు సంభవించినట్టుగా అంచనా వేస్తున్నారు.