హైదరాబాద్ ఐటీ కారిడార్​లో ఫుట్ పాత్​ల కబ్జా

హైదరాబాద్ ఐటీ కారిడార్​లో ఫుట్ పాత్​ల కబ్జా
  • స్థానిక నేతలే ఆక్రమిస్తున్నట్లు ఆరోపణలు!
  • టెంట్లు వేసి టిఫిన్​ సెంటర్లు, టీ స్టాల్స్​కు రెంట్ 
  • ఏరియాను బట్టి రూ.5 వేల వరకు వసూళ్లు
  • పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు, బల్దియా అధికారులు


మాదాపూర్, వెలుగు: ఐటీ కారిడార్​లోని ఫుట్​పాత్​లు కబ్జాకు గురవుతున్నాయి. స్థానిక లీడర్లే వాటిని ఆక్రమిస్తున్నట్లు  విమర్శలు వస్తున్నాయి. మీటర్ల చొప్పున షెడ్లు వేసి టిఫిన్​సెంటర్లు, టీ స్టాల్స్, ఇతర వ్యాపారాలకు రెంట్​కు ఇస్తున్నారు. షాప్​ను బట్టి వారి దగ్గరి నుంచి నెలనెలా డబ్బు వసూలు చేస్తున్నారు. ఫుట్​పాత్​లపై ప్లేస్​లేకపోవడంతో జనం రోడ్లపై నడిచి వెళ్తున్నారు. దీంతో ట్రాఫిక్​జామ్​ఏర్పడుతోంది. ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్​ పోలీసులు పట్టించుకోవడమే లేదు. అధికారులకు మామూళ్లు అందుతుండటంతో వారు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపణలు వస్తున్నాయి.

ఎక్కడ చూసినా అదే పరిస్థితి..

ఐటీ కారిడార్​లోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో సాఫ్ట్‌ వేర్, ఇతర కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కాగా ఈ ప్రాంతాల్లోని రోడ్ల వెంట ఉన్న ఫుట్​పాత్​లను అక్రమించుకొని  షెడ్లు వేసేస్తున్నారు. ఐటీసీ కోహినూర్​పక్కనే ఉన్న రోడ్డు నుంచి టీ హబ్​వరకు ఉన్న మొత్తం 1.3 కిలోమీటర్ల ఫుట్​పాత్​ఆక్రమణకు గురయ్యింది. భోజనం కోసం వచ్చే వారి కార్లు, బైక్ లతో రోడ్డు మొత్తం నిండిపోతోంది. ఈ ప్రాంతం మాదాపూర్​ట్రాఫిక్​పోలీస్​స్టేషన్​కు సమీపంలోనే ఉన్నా.. పోలీసులు నిత్యం ఈ రూట్​లో తిరుగుతున్నా వీటి గురించి పట్టించుకోవడంలేదు. మాదాపూర్​అయ్యప్ప సొసైటీ 60 ఫీట్​రోడ్ లో టిఫిన్​సెంటర్లు, తోపుడు బండ్లు మొత్తం రోడ్డుపైనే పెడుతున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్​జామ్​ఏర్పడి అఫీస్​లకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు నిమిషాల్లో వెళ్లే మార్గానికి అరగంట టైమ్ పడుతోందని వాహనదారులు చెబుతున్నారు. 

బస్టాప్ ​రోడ్డును క్లోజ్ చేసి..

మాదాపూర్​లోని కరాచీ బేకరీ నుంచి ఆవాస హోటల్ వరకు ఉన్న సర్వీస్​రోడ్, బస్టాప్​రోడ్ లో ప్రతిరోజు సాయత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు ఫుడ్​ట్రక్కులు, టిఫిన్ సెంటర్లు వెలుస్తున్నాయి. బస్టాప్​లైన్​లో కూడా పెడుతుండటంతో సాయంత్రం పూట ఆర్టీసీ బస్సులను రోడ్డుపైనే ఆపాల్సి వస్తోంది. దీంతో బస్సు వెనుకాల వెహికల్స్​బారులు తీరుతున్నాయి. ఇక్కడికి వచ్చే వారు తమ వెహికల్స్​ను మెయిన్​ రోడ్ మీదనే పార్క్ చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడుతోంది.  

అధికార పార్టీ లీడర్​ వసూళ్ల దందా?

కొండాపూర్​ ప్రాంతానికి చెందిన ఓ టీఆర్ఎస్​లీడర్ మాదాపూర్, కొండాపూర్​ఏరియాల్లో ఫుట్​పాత్​ఖాళీగా కనిపిస్తే ముందుగా అక్కడ తానే షెడ్ వేసి ఆ తర్వాత రెంటుకు ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్ట్రీట్​వెండర్స్​ జిల్లా నాయకుడినని చెప్పుకుంటూ అనుచరులతో కలిసి ఫుట్​పాత్​పై ఉన్న షాప్, ఏరియాను బట్టి నెలకు రూ.500 నుంచి 5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులను తాను మేనేజ్​చేస్తానని వారితో చెప్తున్నట్లు సమాచారం. ఈ డబ్బులో కొంత భాగాన్ని అధికారులకు పంపిస్తుండటంతో వారు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దుకాణాలకు పర్మిషన్ ​ఇచ్చే స్ట్రీట్​టౌన్​వెండింగ్​ కమిటీ నామ్​కే వాస్తేగా పనిచేస్తోందనే విమర్శలు ఉన్నాయి.

నడిచేందుకు దారిలేదు

సైబర్​టవర్స్​వద్ద ఫుట్​పాత్​ఆక్రమణకు గురికావడంతో నడిచేందుకు ఇబ్బందిగా మారింది. రోడ్డుపై నుంచి నడవాల్సి వస్తోంది. దీంతో వెహికల్స్ కు ట్రాఫిక్ జామ్ అవుతోంది.  కబ్జాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
-  జగదీశ్వర్​రెడ్డి, ప్రైవేట్ ఎంప్లాయ్

 ఎప్పటికప్పుడు క్లియర్ ​చేయిస్తున్నాం..

ఐటీ కారిడార్​లో రోడ్లపై పార్కింగ్​ చేసే బండ్లను ఎప్పటికప్పుడు ట్రాఫిక్​ టాస్క్​ఫోర్స్​ వెహికల్స్​తో క్లియర్​చేయిస్తున్నాం. కొన్ని సమయాల్లో మాత్రమే ట్రాఫిక్​ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య ఉందని మా దృష్టికి తీసుకువస్తే క్లియర్​ చేస్తాం. 
– శ్రీనివాస్​రావు, ట్రాఫిక్​ డీసీపీ, సైబరాబాద్