
కొల్లాపూర్(నాగర్కర్నూల్), వెలుగు : అటవీ భూముల్లో దున్నుకుంటున్నారని ఫారెస్ట్ సిబ్బంది బుధవారం రైతుల పంటలను పీకేశారు. జేసీబీతో గుంతలు తీసి మొక్కలు నాటడానికి రాగా, రైతులు కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు. బాధితుల్లో రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఉండడం గమనార్హం. కొల్లాపూర్ మండలం సోమశిల సమీపంలోని చెన్నపల్లి శివారులోని సర్వే నంబర్87లో రిటైర్డ్ఆర్మీ జవాన్ వెంకటస్వామికి 2002లో ప్రభుత్వం ఐదెకరాల భూమి కేటాయించింది. దీనికి సంబంధించి పట్టా పాస్బుక్ కూడా అందజేసింది. 2004లో పదవీ విరమణ తీసుకున్న వెంకటస్వామి అందులోనే వ్యవసాయం చేసుకుంటున్నాడు. అతడితో పాటు పక్కన ఉన్న భూములను కొంతమంది రైతులు సాగు చేసుకుంటున్నారు. అవి అటవీ శాఖ భూములని బుధవారం ఫారెస్ట్ సిబ్బంది వచ్చి పంటలను ధ్వంసం చేశారు. లక్షల్లో పెట్టుబడి పెట్టామని, తమ కష్టాన్ని మట్టిపాలు చేయొద్దని పలువురు రైతులు అధికారుల కాళ్లపై పడ్డారు. వెంకటస్వామి తమ్ముడు కాటం నాగేశ్కూడా ఆఫీసర్ల కాళ్లపై పడగా సిబ్బంది పక్కకు లాగేశారు. దీంతో అతడు జేసీబీకి అడ్డం పడ్డాడు. అయినా ఫారెస్ట్ సిబ్బంది తమ పని తాము చేసుకుపోయారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. తన దగ్గర పట్టా పాస్బుక్ఉన్నా ఫారెస్ట్ భూములంటూ కంది పంటను పీకేశారని వెంకటస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందిపై చర్యలు తీసుకుని నష్టపరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్ చేశారు.
సరిహద్దుల్లో పోరాడి గెలిచా...వీళ్లతో నా వల్ల కాదు
నాకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో సాగు చేసుకుంటున్నా. అయితే అది ఫారెస్ట్ ల్యాండ్ అని అటవీశాఖాధికారులు అడ్డుపడుతున్నారు. కొల్లాపూర్ తహసీల్దార్, డీఎఫ్ఓ, ఎమ్మెల్యే, కలెక్టర్, మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్లను కూడా ఆశ్రయించా. అధికారులు ఏం నివేదికలు ఇచ్చారో చెప్పరు. ఇప్పటి వరకు ఏ రకమైన సహాయం చేయలేదు. సరిహద్దుల్లో శత్రువులతో పోరాడా..కానీ, ఇక్కడ పోరాడి నా భూమిని సాధించుకుంటానన్న నమ్మకం పోతోంది. నా పరిస్థితే ఇట్లా ఉంటే చదువుకోని పేదల సంగతి ఏమిటి ? – వెంకటస్వామి, రిటైర్డ్ ఆర్మీ జవాన్