‘ఫౌండేషన్’ తర్వాతే IAS,IPS పోస్టులు?

‘ఫౌండేషన్’ తర్వాతే IAS,IPS పోస్టులు?

న్యూఢిల్లీ:ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు ‘సివిల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్’ను సంస్కరించేందుకు మళ్లీ పూనుకుంటోంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ) ఇందుకు కావాల్సిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను తయారు చేసినట్లు తెలిసింది. అభ్యర్థులు సర్వీసులో చేరే ముందు ‘యూనిఫైడ్ ఫౌండేషన్ కోర్సు’(యూఎఫ్ సీ)ను తప్పనిసరి చేయాలని అందులో సూచించింది. అతి త్వరలోనే ఈ వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)కు డీవోపీటీ ఆఫీసర్లు పంపనున్నారని సమాచారం. వీటితో పాటు లేటరల్ ఎంట్రీ స్కీమ్ పరిధిని బాగా పెంచాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని డీవోపీటీ ఆఫీసర్ చెప్పారు. ఈ ప్లాన్స్​కు మినిస్ట్రీ ఒకే చెప్పిందని తెలిపారు. ఇక పీఎంవో ఆమోదమే తరువాయి అని వెల్లడించారు.

‘యూనిఫైడ్ ఫౌండేషన్ కోర్సు’

యూఎఫ్ సీ ఐడియాను పోయిన ఏడాది పీఎంవోనే తెర పైకి తెచ్చింది. యూపీఎస్సీ పరీక్షల్లో నెగ్గిన వాళ్లకు, ఫౌండేషన్ కోర్సు నిర్వహిస్తామంది. కోర్సులో పర్ఫార్మెన్స్ ఆధారంగానే ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసులను కేటాయిస్తామని చెప్పింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసన ఎదురుకావడంతో వెనక్కు తగ్గింది. ఈ నేపథ్యంలో కమిషన్ ఎంపిక చేసే 1,000 నుంచి 1,200 మంది అభ్యర్థులకు ఫౌండేషన్ కోర్సు నిర్వహించాలనే ప్రతిపాదనను డీవోపీటీ మళ్లీ తెర పైకి తేవడం ఆసక్తికరంగా మారింది. అయితే, కోర్సు తర్వాత సర్వీసుకు ఎంపిక చేస్తారా లేదా కోర్సుకు ముందే ఎంపిక చేస్తారా అన్న విషయాలపై క్లారిటీ లేదు. ‘‘కోర్సు తర్వాతే ర్యాంకులు ప్రకటించి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ తదితర కీలక పోస్టుల్లో నియమించాలి” అనే ప్రతిపాదనకే డీవోపీటీ కట్టుబడి ఉందని పెద్దాఫీసర్ ఒకరు తెలిపారు.

లేటరల్ ఎంట్రీ పరిధి పెంపు

మోడీ సర్కారు ప్రవేశ పెట్టిన లేటరల్ ఎంట్రీ స్కీము పరిధిని మరింత పెంచాలని డీవోపీటీ భావిస్తోంది. డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ లెవల్స్ కు బయటి వ్యక్తులను మూడేళ్ల పాటు నియమించాలని అనుకుంటోంది. పని తీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగించాలని చూస్తోంది. లేటరల్ ఎంట్రీలో భాగంగా కొత్తగా 50 మందిని నీతి ఆయోగ్ లోకి రిక్రూట్ చేసుకుంటారనే రిపోర్టు ఈ మధ్య వచ్చిన విషయం తెలిసిందే.