యువత సామాజిక బాధ్యతను గుర్తించాలి

యువత సామాజిక బాధ్యతను గుర్తించాలి
  • మాతృభాష, మాతృభూమిని మరవొద్దు.. 
  • తల్లిదండ్రులు, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలి
  • సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
  • గురుకుల్ స్కూల్కు వస్తే దేవలోకం వచ్చినట్టు అనిపిస్తోంది: డాక్టర్ కృష్ణా ఎల్లా

రంగారెడ్డి జిల్లా: యువత సామాజిక బాధ్యతను గుర్తించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఇప్పటి చిన్నారులే రేపటి మన భవిష్యత్ కాబట్టి.. చిన్ననాటి నుంచి నైతిక విలువలు నేర్పించాలని ఆయన సూచించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా, చినజీయర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ మన తల్లిదండ్రులను, సంస్కృతి, సంప్రదాయాలను, పురాణాలను, పండితులను  ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. అలాగే మాతృభాష, మాతృభూమిని మరవొద్దని సూచించారు. జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైతే సరైన నిర్ణయం తీసుకోవడానికి విద్య, నైతిక విలువలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ గురుకుల్ స్కూల్ కు వస్తే దేవలోకానికి వచ్చినట్టు అనిపిస్తోందన్నారు.