
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు ఓ దివ్యాంగ యువతి కాలి బొటనవేలితో తిలకం దిద్దారు. హారతి కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ఫడ్నవీస్ భావోద్వేగానికి లోనయ్యారు. జలగావ్లో ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల కోసం దీపస్తంభ్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొనగా ఈ అనుభవం ఎదురైంది. 'ఇప్పటివరకు ఎందరో మాతృమూర్తులు, సోదరీమణుల నుంచి నేను ఆశీర్వాదం తీసుకున్నాను. వారు నా నుదట తిలకం దిద్దారు. ఇప్పుడు ఓ దివ్యాంగ సోదరి కూడా బొట్టు పెట్టింది. కానీ ఆమె చేతితో కాకుండా.. తన కాలి బొటనవేలితో తిలకం దిద్దారు.
ఇది నన్ను ఎంతగానో భావోద్వేగానికి గురి చేసింది. జీవితంలో ఇలాంటి క్షణాలు మర్చిపోలేనివి. హరతి కూడా ఇవ్వడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆ సమయంలో ఆమె మోహంలో చిరునవ్వు, ధైర్యాన్ని చూశా. ఏదో సాధించాలనే తపన చూశా. ఎలాంటి పరిస్థితిలోనైనా ధైర్యంగా ముందుకు వెళ్లగలననే ధీమా కనిపించింది. ఆమె ప్రతి పోరాటంలో నేను అండగా ఉంటా.' అని ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి 1.1 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఫడ్నవీస్దయా హృదయానికి నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అభిమానాన్ని చూపుతారని ఒకరు అనగా.. ఇలాంటి పనులతో మీరు ఎంతో ఎదిగారని మరో యూజర్ కామెంట్ పెట్టారు.