Telangana Budget 2024: పంచాయతీరాజ్​కు భారీగా నిధులు

Telangana Budget 2024:  పంచాయతీరాజ్​కు భారీగా నిధులు

రూ.40 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రభుత్వం బడ్జెట్ లో రూ.40,080 కోట్లు కేటాయించింది. ఆరు గ్యారంటీల కేటాయింపుల తర్వాత ఇతర శాఖల కంటే పంచాయతీరాజ్​శాఖకే అధిక నిధులు ప్రతిపాదించింది. ఈ నిధుల్లో ఆసరా పెన్షన్లకు సుమారు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆసరా పెన్షన్లకు సుమారు రూ.12,500 కోట్లు బడ్జెట్ ఉండగా పెన్షన్ల మొత్తం పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లను క్లియర్ చేయటంతో పాటు ఇప్పటికే పెన్షన్ అందుకుంటున్న వారికి పెన్షన్ పెంచటానికి సుమారు రూ.20 వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. సాధారణ పెన్షన్ రూ.2016 ఇస్తుండగా దీన్ని రూ.4 వేలకు, దివ్యాంగులకు రూ.3016 ఇస్తుండగా రూ.6 వేలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పాత అప్లికేషన్లు అప్రూ చేసి పెన్షన్ పెంచితే సుమారు 69 లక్షల మందికి ఆసరా పెన్షన్ అందనుంది. ఇక ఉపాధి హామీ పనులు, పంచాయతీ రాజ్ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, డ్వాక్రా రుణాలు, వడ్డీ లేని రుణాలు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు, లోకల్ బాడీలకు నిధులు వంటికి కేటాయింపుల వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు. మరో వైపు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నుంచి సర్పంచ్ లకు సుమారు రూ.11 వేల కోట్ల నిధులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు మిషన్ భగీరథ బాధ్యతలు ఎవరికి లేకపోవటంతో ఇటీవల గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఆ బాధ్యత అప్పగించింది. అన్ని జీపీలకు బీటీ రోడ్లు వేయాలని, ఇందుకు ప్రతిపాదనలు ఖరారు చేయాలని పీఆర్ అధికారులను సీఎం 
ఆదేశించారు.