
హైదరాబాద్, వెలుగు : గ్రూప్ 2 ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులకు అభ్యర్థుల హైట్ తో పాటు చెస్ట్ సైజ్ ను సర్కారు పెంచింది. ఒకవైపు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల భర్తీలో ఫిజికల్ ఈవెంట్ల మార్పుతో గందరగోళం కొనసాగుతున్న టైంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క కొత్త రోస్టర్ విధానం కావడంతో మహిళలకే ఎక్కువ పోస్టులు అలాట్ అయ్యాయి. చాలా పోస్టుల్లో బీసీ–డీలోని పోస్టుల కంటే ఈడబ్ల్యూఎస్ కోటాలోనే ఎక్కువగా ఉన్నాయి.
టీఎస్ పీఎస్సీ రిలీజ్ చేసిన గ్రూప్2 నోటిఫికేషన్ ద్వారా 97 ప్రొషిబిషన్ ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీంట్లో అభ్యర్థుల ఫిజికల్ రిక్వైర్ మెంట్లలో మార్పులు చేశారు. పురుషుల హైట్, చెస్ట్ సైజ్‌ను పెంచారు. 2015లో టీఎస్పీఎస్సీ ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఎస్ఐ పోస్టులకు మగవారికి 165 సెంటీమీటర్ల ఎత్తు ఉండగా, తాజాగా జారీచేసిన నోటిఫికేషన్లో ఎత్తును167.6 మీటర్లకు పెంచారు. అలాగే ఇప్పటి వరకు చెస్ట్ సైజ్ 81 సెంటీమీటర్లు ఉండాలని నిబంధన ఉంది.
ప్రస్తుతం ఛాతీ పరిమాణం 86.3 సెం.మీ ఉండాలని కొత్త రూల్ తీసుకొచ్చారు. మరోవైపు ఆడవారు తప్పకుండా 45.5 కిలోలు ఉండాలనే నిబంధన ఉండగా, ప్రస్తుతం ఆ రూల్ ను ఎత్తేశారు. వారికి ఎత్తు విషయంలో పాత రూలే కొనసాగించనున్నారు. మగవారికి హైట్, చెస్ట్ లో మార్పులు చేయడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పోలీస్ ఈవెంట్లలో లాంగ్ జంప్, షాట్ పుట్ విభాగాల్లో మార్పులు చేశారు. ఈ అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కొందరు కోర్టును ఆశ్రయించారు.
సిలబస్ మారింది..
ఇక గ్రూప్ 2లో సిలబస్ కొదిగా మారింది. గతంలో ఉన్న సిలబస్ కొనసాగిస్తూ, కొత్త సిలబస్ ను యాడ్ చేశారు. దీని కోసమే ఇటీవలే టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ కాపీలను తీసేశారు. ప్రస్తుతం పేపర్ 3 ఎకానమి అండ్ డెవలప్మెంట్ లో తెలంగాణ బడ్జెట్, వ్యవసాయ, పారిశ్రామిక రంగం తెలంగాణ, ఇండియా వివరాలు, డెమోగ్రఫీ తదితర అంశాలను చేర్చారు. పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీలో దేశసమగ్రత సవాళ్లు, థర్డ్ జెండర్ సమస్యలను చేర్చారు.
ఈసారి స్టేట్, మల్టీజోన్, జోనల్ పోస్టులు
గతంలో గ్రూప్ 2 పోస్టులంటే జోనల్గానే ఉండేవి. కొత్త జోనల్ విధానం అమల్లోకి రావడంతో అవన్నీ మల్టీజోన్ పోస్టులుగా ఉంటాయని అభ్యర్థులు భావించారు. కానీ తాజాగా రిలీజైన గ్రూప్2 నోటిఫికేషన్ లో జోనల్, మల్టీజోనల్, స్టేట్ కేడర్ పోస్టులు ఉన్నాయి. 18 రకాల పోస్టుల్లో 6 మల్టీజోన్, ఐదు స్టేట్, ఆరు జోన్ లెవెల్ లో, ఇంకోటి కంటిన్యూస్ జోన్ (మల్టీజోన్ మాదిరి ) పోస్టులున్నాయి. స్టేట్ కేడర్‌లో ఐదు డిపార్ట్మెంట్లలోని ఏఎస్ఓ పోస్టులు ఉండగా, మల్టీజోన్‌లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎంపీఓ, ఏబీసీడబ్ల్యూఓ, ఏటీడబ్ల్యూఓ, ఏఎస్డబ్ల్యూఓ పోస్టులు, జోనల్ లెవెల్లో ఏసీటీఓ, నాయిబ్ తహసిల్దార్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, అసిస్టెంట్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉండగా, ఎక్సైజ్ ఎస్ఐ పోస్టులు కంటిన్యూస్ జోన్ పరిధిలో ఉన్నాయి.