పదివేల మందితో సద్దుల బతుకమ్మ : ట్యాంక్ బండ్​పై వేడుకలకు సర్వం సిద్ధం

పదివేల మందితో సద్దుల బతుకమ్మ : ట్యాంక్ బండ్​పై వేడుకలకు సర్వం సిద్ధం

హైదరాబాద్ సిటీ, వెలుగు : ట్యాంక్​ బండ్​పై జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ట్యాంక్​బండ్​అమరవీరుల స్తూపం నుంచి లోయర్​ ట్యాంక్​ బండ్ లో ఉన్న రోటరీ చిల్డ్రన్స్​ పార్కు వరకు బతుకమ్మ ఉత్సవాలు జరుగనున్నాయి. స్వయం సహాయక బృందాలకు చెందిన 10 వేల మంది మహిళలు బతుకమ్మలతో తరలిరానున్నారు. బతుకమ్మ పాటలకు పాదం కలపనున్నారు. ఈ సందర్భంగా పలు శాస్త్రీయ, జానపద సాంస్కృతిక  ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం రోటరీ పార్కులో ఏర్పాటు చేసిన పాండ్స్​ లో ఆడబిడ్డలు బతుకమ్మలను నిమజ్జనం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్​ బోర్డు, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రోటరీ పార్కులో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేకంగా 56  మినీ కొలనులను ఏర్పాటు చేశారు. పాండ్స్​వద్ద ప్రమాదాలు చోటు చేసుకోకుండా బారికేడ్లను ఉంచారు. 

దారి పొడవునా ఎల్ఈడీ స్క్రీన్స్, లైట్లు, భారీ బతుకమ్మ  ప్రతిమలతో అలంకరించారు. ముందస్తు జాగ్రత్తగా పాండ్స్​ వద్ద గజ ఈతగాళ్లు, డీఆర్​ఎఫ్​ సిబ్బందిని సిద్ధంగా ఉంచుతున్నారు. అనుకోని సంఘటనలు జరిగి ఏదైనా ప్రమాదం జరిగితే.. ప్రాథమిక చికిత్స అందించడానికి ట్యాంక్​బండ్​ పై 3 హెల్త్​ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, అత్యవసర చికిత్స అవసరం పడితే.. తరలించడానికి 5 అంబులెన్స్​ లను సిద్ధంగా ఉంచుతున్నామని హైదరాబాద్​జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. 

300 మంది జీహెచ్ఎంసీ సిబ్బందితో..

సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు కుటుంబ సభ్యులతో సహా వేలాది మంది హాజరుకానుండడంతో జీహెచ్ఎంసీ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.  షిఫ్టుకు వంద మంది చొప్పున 300 మంది జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు పనిచేయనున్నారు. అలాగే, వేడుకలకు వచ్చేవారికోసం 9 మొబైల్ టాయిలెట్స్​, చిల్డ్రన్స్​​ పార్కులో మరో 20 టాయిలెట్స్​ను ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సీఏం సహా మంత్రులు కూడా హాజరవుతుండడంతో మరో నాలుగు వీఐపీ టాయిలెట్స్​ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సర్కిళ్ల వద్ద భారీ బతుకమ్మ ప్రతిమలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే నాయకులకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడింగ్, పార్కింగ్, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తు, తదితర ఏర్పాట్లు చేశారు.

హై సెక్యూరిటీ..

సద్దుల బతుకమ్మ వేడుకలకు  సీఎం, మినిస్టర్లు హాజరవుతున్న నేపథ్యంలో 1500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 1000 మంది సివిల్​, 500 మంది ట్రాఫిక్ పోలీసులు నిరంతరం భద్రతను పర్యవేక్షించనున్నారు. ట్యాంక్​బండ్​ పై వందకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గణేశ్​ నిమజ్జన సమయంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనలను దృష్టిలో పెట్టుకుని  బతుకమ్మ ఉత్సవాల్లో షీటీమ్స్​తో​ మరింత నిఘా పెంచారు. 10 షీటీమ్స్, 100 మంది పోలీసులతోపాటు ఉత్సవాలు జరిగే ప్రాంతాల్లో స్పై కెమెరాలు, హై డెఫినేషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు.  మహిళలను వేధిస్తూ  నిఘా కెమెరాలకు చిక్కిన ఆకతాయిలను అక్కడే అరెస్ట్ చేసి, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. అందుకోసం మహిళా పోలీసులు, మఫ్టీ పోలీసులతో బతుకమ్మ ఉత్సవాల్లో సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు.

నేటి సద్దుల బతుకమ్మ వేడుకలు ఇలా..

  • మధ్యాహ్నం 2 గంటలకు : వెయ్యి మందితో బతుకమ్మలు, ఆరు అడుగుల పెద్ద బతుకమ్మ, ఇతర బతుకమ్మలను పేర్చడం.
  • సాయంత్రం 5.30 గంటలకు : మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సీఎస్​, పర్యాటక సాంస్కృతిక శాఖ  ప్రిన్సిపల్ సెక్రటరీ, విమలక్క తదితరుల ఆధ్వర్యంలో బతుకమ్మకు పూజా కార్యక్రమం నిర్వహణ.
  • సాయంత్రం 6.30 గంటలకు :  అమరవీరుల స్మారకం నుంచి బతుకమ్మ ఊరేగింపు పారంభం.
  • రాత్రి 7 గంటలకు :  ట్యాంక్​ బండ్​ పై ఏర్పాటు చేసిన స్టేజీ వద్దకు సీఎం, మినిస్టర్లు చేరుకుంటారు. 
  • రాత్రి 7 – 8 గంటల మధ్య...
  • స్టేజీ వద్ద కళాకారుల ప్రదర్శనలు, బతుకమ్మలను తీసుకొచ్చిన మహిళల ఆటపాటలు
  • రాత్రి 8 గంటలకు :  లేజర్​ షో, పటాకులు, తారా జువ్వలతో అంబరాన్నంటేలా సంబురాలు.

ట్రాఫిక్ ఆంక్షలు..

సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందర్భంగా ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ ఆంక్షలు విధించారు. గురువారం సాయంత్రం 4  గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్స్ చేశారు. అప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాంక్‌‌‌‌‌‌‌‌ బండ్‌‌‌‌‌‌‌‌,అమరవీరుల స్మారక స్థూపం నుంచి బతుకమ్మ ఘాట్‌‌‌‌‌‌‌‌( రోటరీ చిల్డ్రన్స్​ పార్క్‌‌‌‌‌‌‌‌) వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ను ట్రాఫిక్ చీఫ్‌‌‌‌‌‌‌‌ విశ్వప్రసాద్‌‌‌‌‌‌‌‌ బుధవారం విడుదల చేశారు. నిర్దేశించిన రూట్లలోనే వాహనదారులు ట్రావెల్‌‌‌‌‌‌‌‌ చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సిటీ ట్రాఫిక్ పోలీస్ టోల్‌‌‌‌‌‌‌‌ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 9010203626కి కాల్ చేయాలని తెలిపారు.