కుమ్రం భీం ప్రాజెక్టు కాల్వలు పూర్తి చేయని సర్కారు.. రైతులకు తిప్పలు

కుమ్రం భీం ప్రాజెక్టు కాల్వలు  పూర్తి చేయని సర్కారు.. రైతులకు  తిప్పలు

ఆసిఫాబాద్ వెలుగు : గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనను గెలిపిస్తే పెండింగ్​ప్రాజెక్టులు పూర్తి చేయిస్తానని హామీలిచ్చిన సీఎం కేసీఆర్​మాట నిలబెట్టుకోలేకపోయారు. ఇప్పటికీ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాక, కాలువల పనులు ముందుకు సాగక నీళ్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రధాన ప్రాజెక్టులన్నీ పెండింగ్ లోనే ఉండడంతో సాగులో పెద్దగా మార్పు రాలేదు. సరైన నీటి వసతి లేక వేలాది ఎకరాలు నిరుపయోగంగానే ఉన్నాయి. దీంతో అన్నదాతలు వర్షాలపై ఆధారపడి పూర్తిగా ఆరుతడి పంటలతో సరి పెట్టుకుంటున్నారు.  

కుమ్రం భీం ప్రాజెక్టుతో సెంటు భూమి తడవలే..

ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఆడ గ్రామంలోని పెద్ద వాగుపై కట్టిన కుమ్రం భీం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయి పదిహేనేండ్లు దాటింది. కానీ రైతుల చేన్లకు మాత్రం చుక్క నీరు రాలేదు. 2005లో కాంగ్రెస్​ప్రభుత్వ హయాంలో వైఎస్​రాజశేఖర్​రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం భాగంగా 270 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ పనులను ప్రారంభించారు. కెనాల్స్​నిర్మాణం పూర్తి కాకుండానే 2011 నవంబర్ లో అప్పటి కాంగ్రెస్​సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 2012 నాటికి కాల్వలు పూర్తిచేస్తామని ప్రకటించారు. అయితే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించి టీఆర్​ఎస్​ప్రభుత్వం రెండు సార్లు అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ కాల్వలను పూర్తి చేయలేకపోయింది. పనులు పూర్తయితే 45, 500ఎకరాలకు సాగునీరందించే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టులో నీళ్లున్నా కెనాల్స్​లేకపోవడంతో ప్రయోజనం లేకుండా పోతోంది. కుడి కాల్వ మొదట్లో అనేక చోట్ల మట్టి పూడుకుపోయింది. కొన్ని చోట్ల ధ్వంసమైపోయింది. ఈ ఏడాది భారీ వర్షాలకు కాల్వలలకు అనేక చోట్ల గండ్లు పడి అధ్వానంగా మారింది. సిమెంట్ లైనింగ్ లేకపోవడంతో నీరు వదల్లేని పరిస్థితి.  

జగన్నాథ్​పూర్ ​ప్రాజెక్టు ఎప్పుడు పూర్తయ్యేను? 

సిర్పూర్ టి నియోజకవర్గంలోని జగన్నాథ్ పూర్ ప్రాజెక్ట్ ఎన్నో సంవత్సరాలుగా నిర్మాణంలోనే ఉంది. 2005లో124.64 కోట్ల నిధులతో కాగజ్ నగర్ మండలం జగన్నాథ్ పూర్ సమీపంలో పెద్ద వాగుపై పనులు ప్రారంభించారు. రెండేండ్లలో పూర్తి చేయాలని టార్గెట్​పెట్టుకోగా 17 ఏండ్లు గడుస్తున్నా కంప్లీట్ కాలేదు. నిధులు ఎప్పుడు విడదుల చేస్తారా? ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందా అని రైతులు ఎదురుచూస్తున్నారు.  

మెయింటనెన్స్​ లేని వట్టివాగు ప్రాజెక్టు 

ఆసిఫాబాద్ మండలంలోని వట్టి వాగు ప్రాజెక్టును1977లో మొదలుపెట్టి  1998లో పూర్తి చేశారు. కుడి కాల్వ ద్వారా 22 వేల ఎకరాలకు, ఎడమ కాల్వ ద్వారా 2,500 ఎకరాలకు సాగు నీరందించింది. అయితే రాను రాను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, నిధులు విడుదల చేయకపోవడంతో  ప్రధాన కాల్వలు శిథిలమయ్యాయి. తుంగ పేరుకుపోయింది. టీఆర్ఎస్​సర్కారు వచ్చినా ఇందులో పెద్దగా వచ్చిన మార్పేమీ లేదు. దీంతో ఈ ఖరీఫ్ సీజన్​లో కేవలం 17 వేల ఎకరాలకు మాత్రమే నీరిచ్చారు. యాసంగిలో కేవలం10 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చేందుకు ఇంజినీరింగ్ అధికారులు ప్లాన్ చేశారు.

అన్నీ అంతే..

కెరమెరి మండలంలోని కేస్లాగూడ వద్ద అమ్మనా మడుగు ప్రాజెక్టును రూ.16.60 కోట్లతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించింది. కెనాల్స్​కట్టకపోవడంతో ఎకరం భూమి కూడా తడవలేదు. దీంతో ఇక్కడి గిరిజన రైతులు వర్షంపైనే ఆధారపడి సాగుచేస్తున్నారు. అలాగే కాంగ్రెస్​హయాంలో మొదలైన బెజ్జూర్​ మండలం బొక్కివాగు ప్రాజెక్టు పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. చింతలమానేపల్లి మండలం బాబా సాగర్ వద్ద 2009లో రూ.15 కోట్లతో ఆర్కగూడ ప్రాజెక్టు నిర్మించారు. ఇక్కడ కూడా కాల్వల నిర్మాణం పూర్తి చేయలేదు.  ఈ కెనాల్​పనులు పూర్తయితే సుమారు ఐదు వేల ఎకరాలకు నీరందే అవకాశం ఉంటుంది. రెబ్బెన మండలంలోని నంబల వాగుపై 2009లో అప్పటి కాంగ్రెస్​సర్కారు మొదలుపెట్టిన గంగాపూర్ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అప్పుడు అంచనా వ్యయం రూ‌‌.9 కోట్లు కాగా ఇప్పుడు రూ.26  కోట్లకు చేరింది.1300 ఎకరాలు టార్గెట్​పెట్టుకోగా ఇప్పట్లో ఒక్క ఎకరాకు కూడా నీరందే పరిస్థితి లేదు. 320 మీటర్ల పొడవు స్పిల్​వే నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు262 మీటర్ల పొడవు మాత్రమే నిర్మించారు.2018మార్చితో గడువు ముగిసిన ప్రాజెక్టు నిర్మాణం నేటికీ పూర్తి కాలేదు.

కుమ్రంభీం  ప్రాజెక్ట్ నీళ్లు వస్తలేవ్

కుమ్రంభీం ప్రాజెక్ట్ ప్రధాన కాల్వ పక్కనే నా చేనుంది. అయినా ఏండ్ల సంది నీళ్లొస్తలేవు. దీంతో పత్తి, కంది సాగు చేస్తున్న. కూరగాయలు సాగు చేసేప్పుడు పెద్ద వాగులోంచి ఆయిల్ ఇంజిన్​తో నీళ్లు తెచ్చుకుంటున్నం. ఇంతపెద్ద ప్రాజెక్ట్ ఉన్నా ఏం లాభం 
– వడై ధర్మయ్య ,రైతు, తేజపూర్


‘జగన్నాథ్ పూర్’ కంప్లీట్​అయితే రెండో  పంట పండేది..

నాకు రెండెకాలు ఉంది. వానాకాలంలో ఒకే పంట తీస్తున్న. జగన్నాథ్​పూర్​ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడంతో రెండో పంట మొఖమే సూడలే. తెలంగాణ సర్కారు ఈ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టి నీళ్లు వచ్చేట్టు చేయాలె.  
– పోషన్న, రైతు, సార్సాల గ్రామం

 

సాగునీరందించేందుకు చర్యలు

కుమ్రంభీం ప్రాజెక్ట్ పనులు కంప్లీట్ చేసి సాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నం. ప్రాజెక్ట్ కాల్వల పనులు తొందరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు చెప్పినం. వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి స్థాయిలో నీళ్లిచ్చేందుకు చర్యలు చేపట్టినం. అమ్మనమడుగు ప్రాజెక్ట్ కాల్వల నిర్మాణం కోసం గవర్నమెంట్ కు ప్రతిపాదనలు పంపించినం. 
- గుణవంత్ రావు , ఇరిగేషన్ ఈఈ,ఆసిఫాబాద్